మున్నా వాళ్ల అమ్మ

1 Nov, 2016 22:37 IST|Sakshi
మున్నా వాళ్ల అమ్మ

పిల్లలకు రెక్కలొస్తాయి. ఎగిరిపోతారు.
‘బడిపంతులు’ సినిమాలో...
‘రెక్కలు అలసి మేమున్నాము...’ అని తల్లితండ్రులు వాపోతారు.
మున్నా అలా కాదు.
రెక్కలొచ్చాయని అమ్మానాన్ననూ,వాళ్ల ఆశయాన్నీ వదిలిపోలేదు.
రెక్కలు ఉన్నాయి కాబట్టే... అడవిలోకి ఎగిరిపోయాడు.
చిన్నప్పుడు మున్నా తల్లితో అనేవాడు...
‘‘అమ్మా... వర్షం వస్తోంది. పిట్టలకు ఇళ్ళుండవు కదా..
మనింట్లోకి రమ్మనమ్మా...’’ అనేవాడు!
రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో మున్నాను పెంచింది తల్లి.
ఇప్పుడు తనే.. కొడుకును పోగొట్టుకొని... భర్త జాడ కనుమరుగై
రెక్కలు తెగిన పక్షి అయింది. కన్నీటి వర్షంలో తడుస్తోంది.

బిడ్డల్ని త్యాగం చేసిన విప్లవ మాతలను చూశాం. అసలు బిడ్డలే వద్దనుకున్న త ల్లితండ్రులనూ విప్లవంలో చూశాం. కానీ ప్రజాయుద్ధంతో మరణాన్ని జయించడమెలాగో నేర్పిన తండ్రి ఆర్కేనే అంటారు కొడుకు మున్నా (పృథ్వి) చేయిపట్టుకొని ఉద్యమానికి పరిచయం చేసిన కన్నతల్లి శిరీష అలియాస్ పద్మక్క. మావోయుస్టు అగ్రనేత అక్కి రాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) భార్యగా, చెట్టంత కొడుకుని తాజా ‘ఎన్‌కౌంటర్’లో పోగొట్టుకున్న తల్లిగా ఆమె దుఃఖాన్నీ, జ్ఞాపకాలనూ ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్నారు. ‘దూరంగానే ఉన్నా మా మనసులెంతో దగ్గరగా ఉన్నాయనుకున్నా. కానీ రాజ్యం మా కుటుంబాల్ని చెదరగొట్టింది. నా కొడుకుని పొట్టనబెట్టుకుంది. నా భర్తని మాయం చేసింది. అయినా ఈ యుద్ధం ఆగదు’ అని తేల్చి చెప్పిన పద్మక్కతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.

మీ భర్త, మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే ఏమయ్యాడంటారు?
నా భర్త యుద్ధరంగంలోనే ఉంటే నాకు ఏదోలా కబురుపంపేవాడు. ఆర్కేని కచ్చితంగా పోలీసులే మాయం చేశారు. కోవర్టులతో కుమ్మక్కయ్యారు కనుకనే ఆర్కేనీ, నా కొడుకునీ పట్టుకోగలిగారు. లేకపోతే వాళ్ళంత ఈజీగా దొరకరని నా నమ్మకం. ఆర్కేను వెంటనే కోర్టులో హాజరుపర్చాలి. చంపివేస్తే కనీసం డెడ్‌బాడీనైనా బయటపెట్టాలి. ఈ కుట్రలతో ఎంతోకాలం ప్రజల్ని మోసం చేయలేరు. ప్రజలందరూ మోసగాళ్ళు కాదు. కోవర్టులుగా కొందరే మారతారు.

హైకోర్టు ఆదేశాలతో ఏం జరుగుతుందని భావిస్తున్నారు?
నా భర్త ఆచూకీ కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్  వేశాం. నక్సలెటైై్లనా, మరెవ్వరైనా పౌరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. తేలాల్సింది పోలీసుల అసలు స్వరూపమే. కోర్టు గురువారానికి (నవంబర్ 3కి) వాయిదా పడింది. ఈ లోపు వాళ్ళేం చేసినా చెయ్యొచ్చు. చంపేసినా చంపే యచ్చు. అయినా ఒక ఆర్కేని మట్టుపెడితే ఇంకెందరో ఆర్కేలు పుట్టుకొస్తారు. ఆర్కేని మట్టుపెట్టి యుద్ధాన్ని ఆపగలమని భావించడం వారి వెర్రితనమే.

తల్లిగా మీ దుఃఖానికి కారణం?
ఖచ్చితంగా రాజ్యమే. రాజ్యహింసని అత్యంత దగ్గరగా అనుభవించిన నా కొడుకు ఉద్యమమే విముక్తి మార్గమనుకున్నాడు. నా భర్త అయినా, నా కొడుకైనా, ఇంకా ఎందరో ఉద్యమకారులైనా ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించారు. నిస్వార్థంగా బతికారు. ఇప్పుడు జనం నా కొడుకు మున్నా కోసం ఏడుస్తుంటే ఇంకొంత కాలం వాడు ప్రజలకోసం పనిచేస్తే బాగుండనిపిస్తోంది.

మున్నాతో జ్ఞాపకాలను మాతో పంచుకుంటారా?
నా బిడ్డ మున్నా మనసు వెన్న. వర్షంలో తడుస్తున్నాయని పక్షులను సైతం ఇంట్లోకి పిలవమన్నాడు. వాటికి ఇళ్ళు లేవా, మనకంటే నాన్న లేడు. కానీ వాటికి ఇల్లు కూడా లేదే అంటూ దిగులు పడేవాడు. బడి నుంచి ఇంటికొచ్చే సరికి ఏ కోడిపిల్లకి ఏమైందోనని ఆదుర్దాపడేవాడు. బడినుంచి వాడి నడక నేరుగా ఇంట్లోకి కాదు, పక్షుల దగ్గరికీ, నోరులేని జీవాల దగ్గరికే. వాటికేదన్నా అయి చనిపోతే విలవిల్లాడేవాడు. బడికి వెళ్ళేప్పుడు మాత్రం నా బుగ్గ మీద ముద్దు మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడైనా తొందరలో మర్చిపోయినా వెనక్కి తిరిగొచ్చి వాడి ముద్దుతో నా కన్నీళ్ళు తుడిచేవాడు. (ఆగని కన్నీటిని తుడిచే కొడుకు కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్టుంది పద్మక్క ముఖం)

మున్నా బాల్యం, చదువు ఎలా గడిచాయి?
అత్యంత నిర్బంధంలో. నాన్న ఆచూకీ చెప్పమనో, నా భర్త వచ్చాడనో, లేక నా పైన నిఘా వేస్తే నా భర్త దొరుకుతాడనో పోలీసుల దాడులు, నిర్బంధం మమ్మల్ని నిత్యం భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ రోజేమీ జరగదని ఊపిరి పీల్చుకున్న సందర్భాలు మా జీవితాల్లో అరుదు. అందుకే ఒంగోలులోనే రహస్యంగా వాడిని చదివించాం. నాకేమో వాడిని బాగా చదివించాలని ఉండేది.  వాడికి ఇతర విషయాలపైనే వాడి దృష్టంతా. అదేంటో నాకు అర్థం కాలేదు. ఉన్నత చదువులంటే వాడి అర్థం వేరు.

వాళ్ళ నాన్నని గురించి ఎప్పుడైనా అడి గేవాడా?
ఓ రోజు హఠాత్తుగా అడిగాడు - అమ్మా నాన్న మనల్ని ఎందుకు వదిలివెళ్ళాడని. నాన్నకి మనమంటే ఇష్టమేరా కన్నా, జనం కోసమే మనల్ని వదిలి వెళ్ళాడని చెప్పాను. ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న గురించే ప్రశ్నించేవాడు. నా ఆగని దుఃఖానికి కారణమేంటో వాడికి అర్థం అయ్యేది కాదు. కానీ కొంత వయసొచ్చాక, ‘రాని నాన్న కోసం ఎందుకమ్మా ఏడుస్తావు’ అన్నాడు. నాపై, నా తోబుట్టువులపై ప్రభుత్వ నిర్బంధాన్ని చూసి నిర్ఘాంతపోయేవాడు.

మున్నా నక్సల్ మార్గాన్నెంచుకోవడానికి కారణం?
వాడు మంచి చదువులు చదువుకోవాలని నా కోరిక. వాళ్ళనాన్న చెపితేనైనా చదువుపై శ్రద్ధపెడతాడనిఅనుకున్నాను. అందుకే ఆర్కే కాంటాక్ట్ కోసం అడవికి వెళ్ళాను. ఆయనకోసం వెళ్ళినప్పుడల్లా కాంటాక్ట్ దొరకక ఒకోసారి రెండు మూడు నెలలు మేం కూడా గిరిజనులతోపాటే అడవిలోనే గడపాల్సి వచ్చేది. మున్నా అక్కడి ప్రజల్లో ఇట్టే కలిసిపోయేవాడు. చాలా పుస్తకాలు కూడా చదివేవాడు. అక్కడి తన లాంటి పిల్లల్ని చూశాడు. వాళ్ళ తిండి తిన్నాడు. వాళ్ళ కష్టాల్ని పంచుకోవడమూ అలవాటైంది. రాజ్య హింస వాడిని చదువుకంటే అడవినే ప్రేమించేలా చేసింది.

ఎప్పటికి కలవగలిగారు వాళ్ల నాన్నని?
ఒక్కోసారి ఐదారు నెలలకు కూడా కాంటాక్టు దొరికేది కాదు. అంతకాలం అక్కడే ఉండేవాళ్లం. చివరకు నా బిడ్డని నా భర్త దగ్గరికి తీసుకెళ్ళా. ఆర్కే, వాడితో చదువు గురించి మాట్లాడాలన్నది నా కోరిక. ఆర్కే వాడికి చదువు నేర్పాడు. కానీ నేననుకున్న చదువుకాదది. కొద్ది రోజులు అక్కడే ఉంటానన్నాడు మున్నా. ఆ కొద్ది రోజులూ చాలా రోజులని నాకర్థం కాలేదప్పుడు. ఆ తరువాత నేను నా అక్కయ్యల దగ్గరే ఉన్నాను. జి. కల్యాణరావు గారు (రచయిత, ‘విరసం’ నేత) మా అక్క అమృత భర్త. ఉద్యమం ఎప్పుడూ అండగా నిలిచింది. మమ్మల్ని కాపాడుకోవడానికి మా కుటుంబమంతా నిర్బంధాన్ని అనుభవించింది.

మున్నా గురించి ఆర్కే ఏమని చెప్పేవారు?
మున్నాని ఉద్యమంలోనికి ఆహ్వనించిందే వాళ్ళ నాన్న. తన కొడుకు అందరిలా ఏ డాక్టరో, ఇంజనీరో కావాలని వాళ్ళ నాన్న కోరుకోలేదు. నేను కూడా. తన కొడుకుని తనలా ప్రపంచ ప్రజలను ప్రేమించడం నేర్పాలని ఆర్కే కల. అదే విషయాన్ని ఉత్తరాల్లోనూ రాసేవాడు. వాడిని ఓ ఉద్యోగస్థుడిలా కాకుండా, ఉద్యమకారుడిగా చూడాలని భావించేవారు. తన కొడుకే కాదు. విప్లవకారులందరి పిల్లలూ ఉద్యమాల్లోనే ఉండాలని ఉత్తరాల్లో రాసేవాడు. ‘నీ కిద్దరు పిల్లలు కదా, ఒకరినైనా ఉద్యమానికివ్వకూడదూ’ అని చాలా మంది సానుభూతిపరుల్ని కోరేవారు.

మున్నా అటు వెళతాడని గ్రహించారా?
వాళ్ళ నాన్న అనుసరించిన మార్గాన్ని మున్నా ఎంచుకుంటాడని నేనూ అనుకోలేదు. వాళ్ళ నాన్న త్యాగం వాడికి అర్థమైతే నా కన్నీటిని వాడు అర్థం చేసుకుంటాడనుకున్నా. నా దృష్టిలో మున్నా చిన్నపిల్లాడే, కానీ వాడేంటో కొద్దికొద్దిగా అర్థం అయ్యేసరికే వాడు నాకందనంత ఎదిగిపోయాడు. ఎంతగా అంటే మావోయిస్ట్ సైన్యానికే యుద్ధతంత్రాలు నేర్పేంతగా. 

మున్నా మళ్ళీ ఎప్పుడైనా మీ దగ్గరికి తిరిగి వచ్చాడా?
ఇక మళ్ళీ రాలేదు. నేనే వాణ్ణి తీసుకొద్దామని వెళ్ళాను. అప్పటికి ఏడాదిన్నర అయ్యింది. వాడి కోసమే  2010లో ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు (ఏఓబి)కి వెళ్ళా. అప్పుడే గంటి ప్రసాదంతో పాటు అరెస్టయ్యా. ఐ.ఎ.ఎస్. అధికారి వినీల్ కృష్ణ నిర్బంధమప్పుడు నిజానికి మావోయిస్టుల డిమాండ్ ఆదివాసీలను విడుదల చేయాలన్నదే. కానీ, పోలీసులు మమ్మల్ని విడుదల చేశారు. అందుకు నిరసనగానే గంటి ప్రసాదం మూడు రోజులు విడుదల కాలేదు.

ఆ తరువాత మీ జీవనాధారం?
నక్సలై ట్లు, అలా ఉద్యమంలో పనిచేసి బయటకు వచ్చినవారు ఆస్తులు సంపాదించుకుంటారనీ, అడవిలోకి వెళ్ళొచ్చి డబ్బులు వెనకేసుకుంటారనీ రాజ్యం దుష్ర్పచారం చేస్తూ ఉంటుంది. కానీ నా జీవితమే వారికి సమాధానం. ఒంటిపైన ఒకటి, దండెం పైన రెండూ - మొత్తం మూడు చీరలే నాకుండేవి. కటిక దారిద్య్రం అనుభవించా. ఓ వైపు పోలీసుల బెదిరింపుల నుంచి కాపాడుకుంటూనే బతుకుతెరువు చూసుకోవాలి. నేను చేయని పని లేదు. బట్టలు కుడుతూ బతికాను. కూలికెళ్ళి కడుపునింపుకున్నా. ఒంగోలు పొగాకు బేర్నీలో రోజు కూలీకి కూడా పనిచేశా. చివరకు హైదరాబాద్‌లో ఐదువేల రూపాయలకు టీచర్‌గా చేరా. పోలీసు నిర్బంధం నుంచి తప్పించుకోవడానికి ప్రతిసారీ మారాల్సి వచ్చేది. ఒంగోలుకొచ్చి ఓ బళ్ళో చేరాను.

మావోయిస్ట్‌ఆర్కే అసలు మీకెలా పరిచయమయ్యారు?
కారంచేడులో దళితుల ఊచకోతతో వేదనకు గురయ్యా. స్త్రీలపై వేధింపులు ఆందోళనకు గురి చేశాయి. కారంచేడు దారుణంపై జరిగిన ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్నా. అప్పుడే మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అది పెళ్ళికి దారి తీసింది. నా కొడుకు ఎంత సున్నితమనస్కుడో నా భర్త ఆర్కే కూడా అంత అతి సున్నిత మనస్కుడు. అందుకే, అన్యాయంపై ఆయుధం ఎక్కుపెట్టాడు.

మున్నాకి పృథ్వి అని పేరెందుకు పెట్టారు?
పృథ్వి అంటే భూమి. ఆ భూమి కోసమే వారి పోరాటం. భూమి లేని వారి కోసమే వారి ఆరాటం. ఎవరి భూమినైతే కబళించాలనుకున్నారో, ఆ భూమిపైనే వాళ్లిద్దరూ నిలబడాలనుకున్నారు. ఆ భూమిపై ఉన్న ప్రేమతోనే వాడికి ఆ పేరు పెట్టాం. ఆ భూమిని నమ్ముకున్న వాళ్ళకోసమే ఈ అమ్మనొదిలి, ఎందరో అమ్మల కోసం తండ్రీకొడుకులిద్దరూ తరలిపోయారు. అదే విషయాన్ని వాళ్ళ నాన్న నాకు నచ్చజెబుతూ ఉండేవాడు.

ఆర్కే మిమ్మల్ని కూడా ఉద్యమంలోకి ఆహ్వానించారా?
అవును. నేనెప్పుడూ తనలాగే ఉద్యమాన్ని అంటిపెట్టుకుని ఉండాలని ఆర్కే అనుకునేవాడు. చాలాసార్లు రమ్మన్నాడు. నా అవసరం జనతన్ సర్కార్‌కి ఉందని చెప్పేవాడు. నేనేం చేయగలనని  ప్రశ్నిస్తే, ఇక్కడి ఆదివాసీ పిల్లలకి చదువు నేర్పమన్నాడు. చివరకు నేను లోపలున్నప్పుడు సాయుధ దళాలకు బట్టలు కుట్టడం కూడా వారికి చాలా ఉపయోగపడుతుందన్నారు. నేనదే చేశాను.

వెళ్ళిపోయాక మున్నా ఎప్పుడైనా తన కబురంపాడా?
మున్నా నాకు ఉత్తరం రాశాడు. ‘ఎందరో తల్లులను ప్రేమించే నాకు నీ మీద ప్రేమ ఉండదా అమ్మా?’ అని అందులో ప్రశ్నించాడు. రాసిన ఉత్తరాన్ని నేను దొంగతనంగా దాచుకుని, దాచుకుని చదివేదాన్ని. కానీ ఇప్పుడు నిర్భయంగా, బహిరంగంగా, స్వేచ్ఛగా చదువుకుంటాను.

మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా?
కోవర్టులతో కొన్నాళ్ళు ఉద్యమాన్ని దెబ్బతీయొచ్చు. కానీ ఎల్లకాలం అది సాధ్యం కాదు. ఈ ఆటుపోట్లు తాత్కాలికమే. వాళ్ళను నిజమైన యుద్ధం చేయమనండి. నా కొడుకు మరణించినా, అతనే నిజమైన హీరో.

మావోయుస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఆంధ్రా ఒరిస్సా బార్డర్ (ఏ.ఒ.బి) కమిటీ ఇన్‌ఛార్జ్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేది మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో కీలకస్థానం. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం గుత్తికొండ బిలం దగ్గర్లోని తుంబిరి కోటకి చెందిన ఆర్కే 4 దశాబ్దాలుగా మావోయిస్ట్ ఉద్యమానికి వెన్నెముక. 1985 జూలైలో ప్రకాశం జిల్లా కారంచేడు దళితుల ఊచకోతకు నిరసనగా ఎగిసిపడ్డ ఉద్యమం ఆర్కేనీ, ప్రకాశం జిల్లాకి చెందిన పద్మక్కనీ కలిపింది. దాదాపు మూడు దశాబ్దాల వైవాహిక జీవితంలో ఆర్కే అడవిబిడ్డల విముక్తికే తన జీవితాన్ని అర్పిస్తే, పద్మక్క అతని కుమారుడిని ఉద్యమ నెలబాలుణ్ణి చేశారు. ఇటీవలి బలిమెల ‘ఎన్‌కౌంటర్’తో జాడ తెలీని ఆర్కే కోసం వెతుకుతున్నారు.

- అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి

మరిన్ని వార్తలు