అమెరికాలో ఆపద్బాంధవి

16 Feb, 2015 00:12 IST|Sakshi
అమెరికాలో ఆపద్బాంధవి

అడిగినా ఎదుటివాళ్లకు సాయపడరు కొందరు. కానీ అడగకపోయినా సాయం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు ఇంకొందరు. లక్ష్మి దేవినేని కూడా అంతే. ఎదుటివాళ్లకు సాయపడాలని అనుక్షణం తపన పడుతుంటారు. అదే ఆమెను అమెరికాలో చాలా పాపులర్ చేసింది.  ఇమిగ్రేషన్ లా ఫర్మ్‌లో మేనేజర్‌గా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లోని ఇమిగ్రేషన్ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఎంతో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తిస్తోన్న లక్ష్మి...

అమెరికా వచ్చే తెలుగువాళ్లకు కొండంత అండగా ఉంటున్నారు. ‘తానా చైతన్య స్రవంతి’ కార్యక్రమం ద్వారా ఇండియాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వచ్చిన సందర్భంగా తన గురించి, తను చేస్తోన్న సేవ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు...  
  - సమీర నేలపూడి


‘తానా’లో ప్రముఖ పాత్రే పోషిస్తున్నట్టున్నారు?
నేననే కాదు. తానాలోని ప్రతి సభ్యుడూ యాక్టివ్‌గానే ఉంటారు. ప్రతి రెండేళ్లకోసారి తానా కన్వెన్షన్ జరుగుతుంది. దానికి ముందు తానా సభ్యులందరం కలిసి ఇండియాలో నాలుగు వారాల పాటు ‘తానా చైతన్య స్రవంతి’ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. గ్రామాలకు వెళ్లి హెల్త్ క్యాంపులు పెట్టడం, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించడం వంటివి చేస్తుంటాం.
 

ఇమిగ్రేషన్ కమిటీకి మీరు చైర్‌పర్సన్ కదా... ఈ కమిటీ ఏం చేస్తుంది?
కొత్త దేశానికి వెళ్లినప్పుడు ఎవరికైనా అంతా కొత్తగానే ఉంటుంది. యూఎస్ వచ్చేవాళ్ల పరిస్థితి కూడా అంతే. అక్కడ స్థిరపడటానికి ఎలా ప్రయత్నించాలి, ఏయే లెసైన్సులు సంపాదించాలి వంటివేమీ అర్థం కావు.  దాంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారందరికీ సహాయపడతాం.
 
అమెరికా వెళ్లేవాళ్లంతా సాఫ్ట్‌వేర్ అంటారు. మీరు ఇమిగ్రేషన్ లా ఫర్మ్ వైపు ఎందుకు వెళ్లారు?

దాని మీద అవగాహన, ఆసక్తి ఉండటం వల్ల. నేను పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్‌లోనే. నాకు పదిహేనో ఏటే పెళ్లి చేశారు. పదహారో ఏట ఓ బిడ్డకు తల్లిని కూడా అయ్యాను. పెళ్లితో బ్రేక్ పడిన చదువుని, బాబు పుట్టాక పూర్తి చేశాను. ఇంజినీరింగ్ చేశాక, కొన్నాళ్లపాటు చాంబర్ ఆఫ్ కామర్స్‌లో పని చేశాను. ఆ సమయంలో విదేశీ దౌత్యవేత్తలతో పరిచయం పెరిగింది.

అమెరికన్ కాన్సులేట్‌తో వ్యవహారాలు నడిపించడంతో వీసా, ఇమిగ్రేషన్ అంశాల మీద బాగా అవగాహన ఏర్పడింది. అయితే అంత అవగాహన ఉన్న నేను కూడా... ఉద్యోగ నిమిత్తం అమెరికా చేరుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో కన్‌ఫ్యూజ్ అయ్యాను. చాలా విషయాలు అర్థం కాలేదు. ఒక లా ఫర్మ్ ద్వారా అన్నీ తెలుసుకున్నాను. అప్పట్నుంచీ ఎవరు ఇబ్బంది పడుతున్నా నన్ను గైడ్ చేసిన సంస్థ దగ్గరకు తీసుకెళ్లేదాన్ని.

‘ఇంతమందిని తీసుకొస్తారు కదా, మీరు మా దగ్గరే ఎందుకు పని చేయకూడదు’ అనడంతో వెంటనే అక్కడ చేరిపోయాను. పదిహేనేళ్ల పాటు పని చేసి, కొద్ది నెలల క్రితం సొంతగా నేనే ఓ సంస్థ పెట్టాను. పేదవారికి ఉచితంగా కూడా చేసి పెడుతుంటాను.
 

ఉద్యోగుల కోసం, విద్యార్థుల కోసం చాలా చేస్తున్నారు. మరి ఓ మహిళగా మహిళలకు ఏదైనా చేస్తున్నారా?
ఇరవయ్యేళ్లుగా చేస్తూనే ఉన్నాను. అమెరికా వెళ్లేంత విజ్ఞానం ఉన్నవాళ్ల గురించి మనం ఏదో ఊహించుకుంటాం. అయితే అలాంటి వాళ్లలో కొందరు గృహ హింసకు పాల్పడుతున్నారంటే నమ్ముతారా? కట్నం కోసమనో, ఆడపిల్ల పుట్టిందనో చిత్రహింసలు పెడుతుంటారు. కొందరైతే ఏదో వంకతో భార్యను మన దేశానికి పంపేసి, ఆనక అక్కడ కోర్టులో విడాకుల పిటిషన్ వేస్తుంటారు. ఆరోగ్యం సరిగా ఉండదనో, మతి స్థిమితం లేనిదనో ఏవేవో కారణాలు సృష్టిస్తుంటారు. ఒకసారి అక్కడ కోర్టులో కేసు రిజిస్టర్ అయ్యాక ఇక ఆమె ఇంకెక్కడా కేసు వేయడానికి ఉండదు.
 
ఇది అన్యాయం కదా... మీలాంటి వాళ్లు, ప్రభుత్వం కలిసి ఈ పరిస్థితిని మార్చలేరా?

కష్టం. ఎందుకంటే అమెరికాలో చట్టాలు చాలా బలంగా ఉంటాయి. వాటిలో ఎవరినీ ఇన్‌వాల్వ్ అవ్వనివ్వవు. పాపం ఆ అమ్మాయిల్ని చూస్తే చాలా జాలేస్తుంది. ఎక్కడికి వెళ్లాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ మహిళలు విలవిల్లాడిపోతారు. వాళ్లు నాకు ఫోన్ చేసినా, మరెవరి ద్వారా అయినా సమాచారం అందినా నేను వెంటనే వెళ్లిపోతాను. వీలైనంత వరకు ఇరువర్గాలతో మాట్లాడి కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీలుకాని పక్షంలో ‘తానా’ సభ్యుల సహకారంతో ఆ అమ్మాయికి చదువుకోవడానికో, చదువుకున్నవారైతే ఉద్యోగం చేయడానికో ఏర్పాటు చేస్తాను. వారు తమ కాళ్ల మీద తాము నిలబడేవరకూ సభ్యులలో ఎవరో ఒకరం వారికి ఆశ్రయం కూడా కల్పిస్తూ ఉంటాం.  చట్టపరమైన సహాయం అవసరమైతే కనుక ఆయా రాష్ట్రాల్లో ఉన్న తానా సభ్యుల సాయంతో లాయర్లను ఏర్పాటు చేయడం, గెడైన్స్ ఇప్పించడం వంటివి చేస్తాను.
   
విదేశాల్లో చాలా సేవ చేస్తున్నారు. మరి మన దేశం సంగతేంటి?

తానా ‘మన పల్లె కోసం’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. దానిలో భాగంగా సభ్యులందరం ఇండియాలోని ఒక్కోగ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాం. నేను మా అమ్మమ్మగారి ఊరైన ‘నాయుడుగూడెం’ను దత్తత తీసుకున్నాను. ఏలూరు దగ్గర ఉన్న ఈ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి వైఫై విలేజ్‌గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను.

అమెరికా వెళ్లాలనుకుంటున్నారా?

వీసా, ఇమిగ్రేషన్‌ల గురించి సందేహాలు ఉన్నాయా? వెంటనే మాకు రాయండి. అమెరికాలో మీకు సంబంధించిన మహిళలెవరైనా గృహ హింసకు గురవుతున్నారా? వారిని ఎలా కాపాడాలో తెలియడం లేదా? వారి సమస్యను మాకు తెలియజేయండి. మీ ప్రశ్నలన్నింటికీ లక్ష్మి దేవినేని సమాధానాలు ఇస్తారు. పరిష్కారాలను సూచిస్తారు.

మా చిరునామా...

గైడ్, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స్, రోడ్ నం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34
ఈ మెయిల్: guide.sakshi@gmail.com
 

మరిన్ని వార్తలు