నడిపించే మనసు

7 Oct, 2016 22:48 IST|Sakshi
నడిపించే మనసు

కొన్ని మనసులు కదలవు. మెదలవు.కొన్ని మాత్రం ఎదుటివారి చిన్న కష్టానికి కదిలిపోతాయి. కదిలే మనసుకు సమాజాన్ని కదిలించే శక్తి ఉంటుంది.  డాక్టర్ రమణ యశస్వి మనసులో  కదలిక ఉంది.  అందుకే అది కదల్లేని వారి కోసం  తపన పడుతుంది.  అవిటితనం శరీరం కంటే ముందు మనసును అవిటిని చేస్తుంది. రమణ యశస్విలాంటి వాళ్లు ఉంటే మొదట మనసులు కదులుతాయి.  తర్వాత కాళ్లు కదులుతాయి.  ఆగిపోయిన జీవితాలను నడిపించ గలిగే  డాక్టర్‌ను కలవండి.


నా పేరు రమణ. మాది గుంటూరు జిల్లా గణపవరం. నేను వ్యవసాయ కుటుంబంలో జన్మించాను. గణపవరం సిఆర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాను. మా వూళ్లో మా నాన్నగారి మిత్రులంతా డాక్టర్లు కావడంతో, ఆయన నన్ను డాక్టర్ చదివించాలనుకుని, నా చేత ఎంసెట్ రాయించారు. ఫ్రీ సీట్ వచ్చింది. ఆంధ్రా మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేశాను. ఆ తరవాత ఎంఎస్ (ఆర్థో) పూర్తి చేశాను.


మార్గం చూపిన బర్డ్....
చదువు పూర్తయిన కొత్తల్లో తిరుపతిలోని బర్డ్ (బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్, రిహాబిలిటేషన్ ఫర్ డిసేబుల్డ్) ఆసుపత్రి, ఆర్టిఫీషియల్ లింబ్ ఫిట్టింగ్ సెంటర్‌లో మూడు సంవత్సరాలు సేవ చేశాను. సేవ అని ఎందుకంటున్నానంటే అక్కడ మాకు జీతం ఎక్కువగా ఉండదు. పూర్తిగా స్వామి వారి సేవగా భావించాలి. ఆ ఆసుపత్రిలో అందరికీ ఉచితంగానే చికిత్స చేస్తారు. తితిదే వారి ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రి అది. అక్కడికి కృత్రిమ కాళ్ల కోసం వేల మంది వచ్చేవారు. ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల నుంచి కూడా వచ్చేవారు. నిరంతరం వచ్చిపోయే రోగులతో అక్కడి పనివారు విసుగెత్తిపోయి ‘మూడు నెలల తరవాత రండి, ఆరు నెలల తరవాత రండి’ అంటూ వచ్చినవాళ్లని పంపేస్తూ ఉండేవారు. వారి తప్పు కూడా లేదు. అక్కడకు వచ్చేవారి సంఖ్య అలా ఉండేది. ఆ సమయంలోనే ఒకసారి ‘బర్డ్’ తరఫున  ఇతర డాక్టర్లతో కలిసి కలకత్తాలో కృత్రిమ కాళ్లు అమర్చే హెల్త్ క్యాంప్‌కు హాజరయ్యి చాలామందికి కాళ్లు అమర్చాము. ఆ క్యాంప్‌కు మదర్ థెరిస్సా హాజరయ్యి ఆశీర్వదించడం ‘ఇలాగే సేవ చేస్తూ ఉండండి’ అని పలకడం మర్చిపోలేదు. అప్పుడే అనుకున్నాను ‘నేను కూడా ఇటువంటి కేంద్రం నెలకొల్పాలి’ అని. దేశంలో ఎవరికి కృత్రిమ కాలు కావాలన్నా జైపూర్, తిరుపతి వంటి ప్రదేశాలకు వెళ్లవలసి వస్తోంది. నేను నా స్వస్థలంలో నెలకొల్పితే కనీసం ఈ చుట్టుపక్కల వాళ్లకైనా ఉపయోగపడతాను కదా అనుకున్నాను. ఆ ఆలోచన నుంచి వచ్చినదే ఈ ‘వాక్’ సంస్థ.

 

మరచిపోలేను...
కాళ్లు పోగొట్టుకున్నవారు ఎదుర్కొనే సమస్యలు కూడా ‘వాక్’ సంస్థ ఆవిర్భావానికి ఒక కారణం. ఒకసారి ఒక పేషెంటుకు ఆపరేషన్ చేసి కాలు తీయాల్సి వచ్చింది. సర్జరీ పూర్తి చేసి డిశ్చార్జ్ చేశాం. ఆ తరవాత కొన్ని సంవత్సరాలకి  రోడ్డు మీద అడుక్కుంటూ కనిపించాడు. అతడు గతంలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కాలు పోగొట్టుకోవడంతో అతడి ఉద్యోగమూ పోయింది. ఇప్పుడు కుటుంబమూ వెలి వేసింది. అతడిని నా దగ్గరకు తీసుకువచ్చి ఉచితంగా కాలు ఇచ్చి, అతడి కాళ్ల మీద అతడు నిలబడేలా అతడికి దారి చూపించి పంపాను. ఇప్పుడు అతడు షాపు పెట్టుకుని ఎంతో గౌరవప్రదంగా, హాయిగా జీవిస్తున్నాడు. మరోసారి గుంటూరు ఎఎంజి పాఠశాలలో ఒక అమ్మాయిని చూసి నా మనసు కరిగిపోయింది. ఆ అమ్మాయి కాళ్లు, చేతులు లేకుండా పుట్టిన కారణంగా తల్లి ఆమెను అక్కడ విడిచివెళ్లిపోయింది. ఆ పాఠశాల వారే ఆ అమ్మాయిని పెంచుతున్నారు. ఆ అమ్మాయికి ఇప్పుడు 16 సంవత్సరాలు. పేరు స్టెల్లా. లక్షరూపాయల ఖర్చుతో ఆమెకు రెండు కాళ్లు, ఒక చేయి ఏర్పాటుచేశాం. చేతికి స్పామ్ లాంటిది వేయడం వల్ల ఆమె చేయి కేవలం అంగుళం మేర పెరిగింది. ఆ అమ్మాయి కళ్లల్లో కనిపించిన సంతోషాన్ని మర్చిపోలేను. అప్పటికే మా సంస్థ ద్వారా సుమారు వందమందికి కృత్రిమ కాళ్లు నేనే స్వయంగా కొని, ఉచితంగా పంపిణీ చేశాను.

 

ఆయన చలవే...
నేను సేవా కార్యక్రమాలు చేయడం చూసిన ఒక పెద్ద మనిషి, కృత్రిమకాళ్లు తయారుచేయడానికి కావలసిన యంత్రసామగ్రిని మాకు ఉచితంగా  అందచేశారు. 2006లో గుంటూరు బ్రాడీపేటలో ప్రారంభమైన మా ‘వాక్’ సంస్థ, ఇప్పుడు గుంటూరులోని కాకాని రోడ్డులో మా సొంత స్థలంలో ఉంది. ఇప్పటివరకు సుమారు నాలుగు వేల మందికి కృత్రిమ కాళ్లు ఉచితంగా అందచేశాం. మా దగ్గర సర్జరీ చేయించుకున్న వాళ్లకే కాకుండా, బయట సర్జరీ చేయించుకున్న వాళ్లకు కూడా ఈ కాళ్లు పంపిణీ చేస్తున్నాం.  మార్కెట్‌లో దొరికే ప్లాస్టిక్ హెచ్‌డి పైపులను తీసుకువచ్చి, వాటితో ఈ కాళ్లు తయారుచేస్తాం. పాదాలు మాత్రం జైపూర్ నుంచే కొనుగోలు చేస్తాం. అది వారి పేటెంట్.


పేదల కోసం...
మా సేవలన్నీ పేదలకు మాత్రమే.  పేదలకు కేవలం కాళ్లు ఇచ్చి వదిలేయడం కాకుండా, కాలికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మా దగ్గరకు రమ్మని చెప్పి పంపుతాం. అంతేకాదు, వారికి ఏదో ఒక దారి కూడా చూపుతున్నాం. సాఫ్ట్ టాయ్స్ తయారీ, అగరువత్తుల తయారీ, టైలరింగ్ వంటివి నేర్పుతున్నాం. కృత్రిమ చేతులు మాత్రం పనిచేయవు. కేవలం చేతితో గ్లాసు పట్టుకునేలా మాత్రం చేయగలం. అంతవరకే. చేతి దగ్గర ఒక బటన్‌లాంటిది నొక్కితే గ్లాసు పట్టుకుని నీళ్లు తాగగలుగుతారు.

 

చేయూతనివ్వండి...
ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడవాలంటే ఎంతోమంది దాతలు ముందుకు రావాలి. ఒక్కరితో అయ్యే పని కాదు. మేం చేస్తున్నది మంచి పనే అయినా, మాకు అనుకున్నంత సహకారం అందట్లేదు. అడపాదడపా కొందరు దాతలు సహాయం చేస్తున్నారు. మా సేవ నిరంతర ప్రక్రియ. ఇందుకోసం ఎందరు ముందుకు వచ్చినా ఇంకా మిగులుతూనే ఉంటుంది. మాకు రెండు మూడు సంవత్సరాలుగా చందాల కొరత ఏర్పడింది. ఇటువంటి సంస్థలను ఆదరించి, ఆర్థికంగా చేయూతనిస్తే మరిన్ని సేవాకార్యక్రమాలు చేయగలుగుతాం.

- సంభాషణ: డా.పురాణపండ వైజయంతి
సాక్షి, విజయవాడ

 

ఎవరైనా ఇంట్లో శుభకార్యం చేసుకుంటున్నప్పుడు ఆ ఆనందానికి గుర్తుగా, లేదంటే గతించినవారి జ్ఞాపకార్థం చందాలు ఇవ్వమని కోరుతోంది వాక్ సంస్థ. మీ ప్రతి చందా ఒకరిని నడిపిస్తుంది. ఒక్కో కృత్రిమ అవయవానికి నాలుగు వేల నుంచి ఏడు వేల వరకు,  ట్రైసైకిల్ ఇవ్వాలంటే  రూ. 5500 ఖర్చ వుతుంది. అవి అవసరమైనవారికి దాతలు నేరుగా ఇవ్వొచ్చు.

 - డాక్టర్ రమణ యశస్వి  వాక్ ఫౌండేషన్, గుంటూరు. ఫోన్: 99484 94667

 

 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా