ఉద్యమ పాదంపై పుట్టుమచ్చ

13 Nov, 2016 08:53 IST|Sakshi
ఉద్యమ పాదంపై పుట్టుమచ్చ

...థర్టీ ఇయర్స్ రివల్యూషన్!

ఉద్యమం చేయడం ఎంత నిజమో...
నిజం చెప్పడం అంతే ఉద్యమం!
నారాయణమూర్తికి... నిజం అంటే ఏంటి?
ఉద్యమం అంటే ఏంటి?
మనసులో మాట... పెదాల మీద ఉంటే
అదే నిజం! అదే ఉద్యమం అంటాడు.
సత్యవాక్కు పలికేవాడు... సత్యపథం పట్టక మానడు కదా!
సిల్వర్ జూబ్లీ సినిమాలిచ్చినా, కోట్ల కలెక్షన్లు కొట్టినా
ఇప్పటికీ... షేర్ ఆటోలో తిరుగుతాడు.
కాలిబాట పడతాడు. మరి అదే కదా.. సత్యపథం!
గాంధీ ఉద్యమంలో... ‘అహింస’ సత్యాగ్రహం అయితే...
ఆర్. నారాయణమూర్తి గుండెల్లో... ‘విప్లవం’ సత్య ఆగ్రహం.
నిప్పులా రగిలే సత్యం... జ్వాలలా ఎగసిపడే ఆగ్రహం.

తెర మీద బొమ్మ పడింది! అదిగో... నారాయణమూర్తి నడుచుకుంటూ వస్తున్నాడు.ఆ ఉద్యమపాదంపై ప్రజలు పెట్టిన కాటుక చుక్కే ఈ పుట్టుమచ్చ. ఆడియన్స్... ఈలలు, చప్పట్లు, కేరింతలు... ఎర్రటి విప్లవంలా  తెర మీద భగభగమండుతున్నాడు. ఇదిగో... ఈ ఇంటర్వ్యూలో... అలాగే మాట్లాడుతున్నాడు.భగ భగ ఎంజాయ్ చేయండి. హ్యాపీ సండే.

‘అర్ధరాత్రి స్వతంత్రం’తో హీరోగా మొదలై, ఇప్పటికి 30 ఏళ్లయింది. సంపాదించింది ఎంత? పోగొట్టుకున్నది ఎంత?
ఆర్. నారాయణమూర్తి: 30 ఏళ్లుగా దేశంలో జరుగుతున్న సమస్యలే నా సినిమాలు. కార్మిక, ఆదివాసీ, దళితుల, స్త్రీ, రైతు, భూ పోరాటం.. ఇలా ఎన్నో విషయాలపై సినిమాలు తీస్తున్నా. పోగొట్టుకున్నది ఏం ఉంటుంది? ప్రజా సమస్యల్ని చర్చిస్తున్నా కాబట్టి, అభిమానం సంపాదించుకున్నా. 30 ఏళ్లయ్యాయని గుర్తు పెట్టుకుని, ఇంటర్వ్యూ కోసం ‘సాక్షి’ వచ్చిందంటే, అది నేను సంపాదించుకున్నదే.

సమస్యల్ని చూపిస్తే మార్పొస్తుందా?
మార్పు అనేది వస్తుంది. సమాజం గ్యారంటీగా మారుతుంది. మార్పు కోసం డాక్టర్, సైంటిస్ట్, కార్టూనిస్ట్, పొలిటిషీయన్, మీ జర్నలిస్టులు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్‌లో పోరు చేస్తారు. కళాకారుడిగా నేను నా సినిమాల ద్వారా మార్పు కోసం ఫైట్ చేస్తున్నా. నా ‘అర్ధరాత్రి స్వతంత్రం’ చూసి ఎందరో ఉద్యమబాట పట్టారు. ‘ఎర్రసైన్యం’ చూసి భూపోరాటం చేశారు. ‘దండోరా’ చూసి సారాకొట్లు బద్దలు కొట్టారు. అది మంచి మార్పేగా.

గాంధీ ‘శాంతి’ అంటే మీవి పోరాటం వైపు మళ్లిస్తున్నాయి...
మళ్లిస్తున్నాయంటే పొరపాటు. ఒక్క గాంధీ వల్లే మనకు స్వాతంత్య్రం రాలేదుగా? సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ పోరాటం చేయమన్నారు కదా. ఎందరో వీరుల త్యాగఫలితమే ఈ స్వాతంత్య్రం. ఓ విషయం చెబుతాను. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో అభివృద్ధి పేరు చెప్పి, ఇండస్ట్రియలైజేషన్  చేసేస్తున్నారు. అంతా మలినం. రొయ్యల వ్యాపారానికి గండిపడింది. పర్యావరణం నాశనం. భూములు లేకుండా పోయాయి. రైతుల పరిస్థితేంటి? ఉద్యమాలు చెయ్యాలా? వద్దా? చేసినా పోలీసులు కొడుతుంటే తిరుగుబాటు చేయరా? చేయకపోతే ఆ వాయిస్ ఎలా తెలుస్తుంది?

మీ ఆర్థిక లావాదేవీలన్నీ వైట్‌లోనే ఉంటాయా?
సీ మై ఫ్రెండ్... ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ‘వేగు చుక్కలు’ వరకూ 20 ఏళ్లపాటు నేను తీసిన సినిమాలన్నీ బ్రహ్మాండంగా ఆడాయి. అది చూసి కొంతమంది ఇలాం టివి తీశారు. ఒకటీ రెండు తీశాక మొనాటనీ వచ్చిందని మానేశారు. నేను మాత్రం తీస్తూనే ఉన్నా. సముద్రాన్ని ఈదుతూనే ఉన్నా. జనం దయ నాపై ఉంది కాబట్టి సక్సెసవుతున్నా. మొదట్నుంచీ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్, డెరైక్షన్, మ్యూజిక్ - అంతా నేనే కాబట్టి, బడ్జెట్ అక్కడే తగ్గిపోతుంది. సినిమా మొదలుపెట్టే ముందు ఫ్రెండ్స్ దగ్గర్నుంచి అప్పు తెచ్చుకుంటా. సినిమా రిలీజయ్యాక తిరిగిచ్చేస్తా. ‘ఆల్ వైట్.. నో బ్లాక్’.

మొనాటనీ అని కొంతమంది మానేశారన్నారు. మరి ఎప్పుడూ ఒకే టైప్ సినిమాలు తీస్తే.. మీకు విసుగు రాలేదా?
నా బతుకు ఇంతేనా? మార్పు లేదా? అనే ఆలోచన ఏ మనిషి మనసులోనైనా వస్తే, అతడికి విసుగొస్తుంది. అప్పుడు ముందుకు సాగలేడు. ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, సినిమా తల్లిపై ఉన్న అభిమానం, ఆరాధన, ఇష్టం, గౌరవం తగ్గలేదు. సినిమాలపై అయిష్టం రాలేదు.

మీ బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువా? ఆటోల్లో తిరుగుతుంటారు. కారుల్లో తిరిగినా మిమ్మల్ని అడిగేవాళ్లు ఎవరుంటారు?
అవును. ఎందుకు అడుగుతారు? సిల్వర్, డైమండ్ జూబ్లీ సినిమాలు తీసి, కోట్లు గడించినవాణ్ణి. నా దగ్గర బ్యాలెన్స్ ఎందుకుండదు? అది తీసిపారేయండి. చిన్నప్పటి నుంచి నాకిలా ఉండడం అలవాటు. ఏదో పోజు కొట్టడం కోసం ఇలా ఉంటాననుకుంటున్నారేమో? నేనలా ఆత్మవంచన చేసుకోను. నాకిప్పుడు 62 ఏళ్లు. కాలేజీ డేస్‌లో కూడా నాకు రెండు జతల బట్టలే. వాచీలు, గొలుసులు ఎప్పుడూ పెట్టుకోలేదు. చిన్నప్పటి నుంచి నాది ఉద్యమ బాటే. ప్రజల పక్షానే. నా లైఫ్ స్టైల్ ఇది. ఎవరి మెప్పుకోలు కోసమో ఉండట్లేదు. ఇలా ఉండటమే నాకు ఆనందం. నా సినిమా కోట్లు తెచ్చినప్పుడు నాకు బీరువా లేదు. డాక్యుమెంట్లు లేవు. చాప, దిండు మాత్రమే. డబ్బులు తేనప్పుడూ నా దగ్గర ఉండేది చాపా, దిండూనే.

ఊళ్లో బంగ్లా, స్థలాలు కొన్నారని విమర్శ. దానికేమంటారు?
ఓసారి మా ఊరు వెళ్లండి. నేను చేసిన మంచి పనులు కనిపిస్తాయి. ఆస్పత్రి కట్టించా. విద్యాలయాలకు డొనేట్ చేశా. పీపుల్స్ కమిటీ హాల్స్ కట్టించా. ఆంధ్ర, తెలంగా ణాల్లో బోర్లు వేయించా. కానీ ఎక్కడా చెప్పుకోను. మీర న్నట్లు మా ఊళ్లో నా సంపాదన ఉందనుకుంటే.. బంగ్లా కట్టించానేమో చూడండి. మా అమ్మా నాన్న ఏ ఇంట్లో ఉన్నారో చూడండి. రీసెంట్‌గా మా నాన్న చనిపోయాడు. అమ్మ ఒకతే ఉంది. ఊళ్లో నాకు ఎకరం స్థలం లేదు. థియేటర్లు లేవు. దొంగచాటు వ్యాపారాలేవీ చేయట్లేదు. ఒకవేళ మీరన్నది నిజమైతే ఇక ‘సాక్షి’ నన్ను ఇంటర్వ్యూ చేయొద్దు. ‘ప్రజల్ని మోసగిస్తూ, పేదోడిలా నటిస్తున్న నారాయణమూర్తి’ అని హెడ్‌లైన్స్ పెట్టి రాయండి. నేను చెప్పినది కరెక్టని భావిస్తే, ‘ఎలా చెబుతున్నాడో అలానే బతుకు తున్న ఆర్. నారాయణమూర్తికి సెల్యూట్’ అని రాయండి.

మీ సినిమాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కానీ... సమాజం అందుకు దాదాపు విరుద్ధంగా ఉంటోంది.
యస్.. ఇవాళ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం బాగా పెరుగుతోంది. యువత ఆ సంస్కృతికి అలవాటు పడడం, ఆకర్షితులు కావడం సహజం. అంతెందుకు? విశాఖ బీచ్‌లో లవర్స్‌ను ఆహ్వానిస్తున్నారంట. దేశ, విదేశీ ప్రేమికుల ముద్దులాట, కౌగిలింతలను చూసి, ఎంజాయ్ చేయమంటారా? ఎంత దుర్మార్గమైన చర్య. మనకి ఆ సంస్కృతిని అలవాటు చేయడమే కదా! ఓసారి హైదరాబాద్‌లో బ్రహ్మానందరెడ్డి పార్క్‌లో నడుస్తుంటే.. ఓ అమ్మాయి కౌగిలించుకోబోయింది. ఏంటని అడిగితే, ‘హగ్ కల్చర్’ అట. ‘నీది ఏ దేశం?’ అనడిగా. హైదరాబాదే అని చెప్పింది. ఈ హగ్ కల్చర్, ముద్దులు, ఇవన్నీ మనకు కాదు, యూరోపియన్లకు అనే విషయం ప్రజలు తెలుసుకోవాలి. శీతల మండలాల్లో సంస్కృతిని మనకు అలవాటు చేస్తే ఎంత భ్రష్టు పడుతుంది. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టిన బీచ్ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తున్నా. అందాల పోటీలూ డబ్బు కోసమే. ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్న పరిస్థితుల్లో ఎలాగైతే మానవ సంబంధాల్ని కోల్పోతున్నామో, అలాగే వెస్ట్రన్ కల్చర్‌తో మన సంస్కృతి, భాషలను విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. రేపులు, గట్రా పెరగడానికి యూరోపియన్ కల్చర్ ప్రభావమే కారణం. చిన్నపిల్లలతో టీవీల్లో డ్యాన్సులు ఏంటమ్మా? పసిపిల్లలకేం తెలుసు? చివరికి వాళ్లు ఈ సంస్కృతికి అలవాటు పడతారు.

మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది కదా?
కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబు మూడుసార్లు అవకాశమిచ్చారు. తుని నియోజకవర్గంలో ప్రజలు నా పేరు సూచించారని జక్కంపూడి రామ్మోహనరావు గారు చెప్పడంతో వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిగారు ఎమ్మెల్యేగా పోటీ చేయమని స్వయంగా పిలిచారు. 2009లో పీఆర్పీ పిలిచింది. అందరికీ దండాలు పెట్టా. ఎందుకంటే, నేను సినిమా పిచ్చోణ్ణి. రాజకీయాల్లోకి వెళితే.. సినిమాల్లో ఉండకూడదు. ప్రజాసేవ అంటే దేవుడు మనకిచ్చిన వరంగా ఫీలవ్వాలి. నిద్ర, తిండి మినహాయిస్తే మిగతా టైమంతా జనం కోసమే ఆలోచించాలి. ఓ కాలు సినిమా పడవపై, మరో కాలు రాజకీయమనే పడవపై వేసి ప్రయాణించలేను. నేను ఏ రాజకీయ పార్టీ వ్యక్తినీ కాను. ‘అయామ్ ఎ కామన్ మ్యాన్’. ప్రజల పార్టీ వ్యక్తిని.

రాజకీయాల్లోకెళ్తే పొల్యూట్ అవుతామేమోనని భయమా?
మీరు మీరుగా ఉన్నప్పుడు ఎవరూ మార్చలేరు. మరోలా ఉండాలనుకున్నప్పుడు మారిపోతారు. అది వాళ్ల వీక్‌నెస్. సినిమాల్లోకి, పాలిటిక్స్‌లోకెళితే నాశనమవుతారనేది కరెక్ట్ కాదు. ఓ కమిట్‌మెంట్‌తో నిజాయతీగా ఉన్నవాణ్ణి, ఉండాలనుకునేవాణ్ణి ఏదీ ప్రభావితం చేయలేదు. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. నేనేమైనా మారానా?

తెలంగాణ ఉద్యమానికి మద్దతునిచ్చారు. మరి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై మీ అభిప్రాయం?
1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎన్టీఆర్‌గారు ధైర్యంగా ‘నేను సమైక్యాంధ్రా’ అన్నారు. అది ఆయన క్యారెక్టర్. 1972లో ‘జై ఆంధ్రా’ ఉద్యమ సమయంలో ఇండస్ట్రీ అంతా సెలైంట్‌గా ఉంటే.. కృష్ణగారు ధైర్యంగా ముందుకొచ్చి ‘జై ఆంధ్రా’ అన్నారు. అది కృష్ణగారి క్యారెక్టర్. ఇప్పుడు నేను ‘జై తెలంగాణ’, ‘జై ఆంధ్రా’ అన్నాను. ఇది నా క్యారెక్టర్. తెలంగాణ అనేది ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన ఉద్యమం అని నమ్మినవాణ్ణి. అందుకే, మద్దతుగా నిలిచా. విడిపోతే, అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ అభివృద్ధి చెందుతాయని ఉద్యమానికి మద్దతిచ్చా. అన్నదమ్ముల్లా రెండు రాష్ట్రాలు విడిపోయినందుకు హ్యాపీ. అయితే... ఈ రెండు రాష్ట్రాలను విభజించిన యూపీఏ ప్రభుత్వం ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మొదట్నుంచి తెలంగాణ కోరుకుంటున్న బీజేపీ, వెంకయ్య నాయుడు కూడా ప్రతేక హోదా తప్పకుండా ఇచ్చి తీరాలన్నారు. ఎన్నికల ముందు తిరుపతి సభలో మోదీగారు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఎన్నికల్లో మోదీ నెగ్గారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? రాజ్యాంగం ప్రకారం, గత ప్రభుత్వం (యూపీఏ) ప్రకటించిన ప్రత్యేక హోదా ఇవ్వవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది.

‘ప్రత్యేక హోదా వస్తే మీకు లాస్. ప్యాకేజీ ఇంపార్టెంట్’ అంటూ మీడియా సహాయంతో ఊదరగొడుతున్నారు. మాట తప్పడం మహా దుర్మార్గం. పాలకులకు ప్రజలంటే భయం, భక్తులు ఉండాలి. లేనప్పుడు మోనార్కిజం వస్తుంది. ఇప్పుడు మోనార్‌‌కల్లా ప్రవర్తిస్తున్నారు. వెంకయ్యనాయుడి మాటలు, చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఫైట్ చేయకపోవడం కరెక్ట్ కాదు. పలు మీటింగుల్లో ప్రత్యేక హోదా కావాలని నేనూ చెప్పా. ఈరోజు ముఖ్యంగా వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డిగారు బీభత్సంగా ఫైట్ చేస్తున్నారు. హోదా కోసం ఫైట్ చేస్తున్నవాళ్లందర్నీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు.

ఇప్పుడు బయటి బేనర్‌లో ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ సినిమా చేస్తున్నారు. సడన్‌గా బయట సినిమా చేయడానికి కారణం?
యాక్టర్‌గా డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలనుంది. యాక్టింగ్ పిచ్చితో మద్రాస్ వెళ్లినోణ్ణి. గతంలో పలువురు మిత్రులు మంచి వేషాలు ఆఫర్ చేశారు. కానీ, మొనాటనీ ఉంటే జనాలు సినిమా చూడడం మానేస్తారు. అది బ్రేక్ చేస్తూ డిఫరెంట్ వేషాలు వేయాలనుంది. ఇప్పటి వరకూ ఉద్యమకారుడు, రైతు, కార్మికుడు, నిరుద్యోగి, రిక్షావోడు, దళితుడు - ఇలా అనేక వేషాలు వేశా. ఇప్పుడు కానిస్టేబుల్, ప్యూన్, జవాను, గుమస్తా, బక్కరైతు, కులవృత్తులకు సంబంధించిన హీరో పాత్రలు చేయాలనుంది. దేవుడి దయ వల్ల ఆర్.నారాయణ మూర్తి అనే మార్క్ వచ్చింది. ముసలోణ్ణి అయినా ‘త్రిశూల్’లో దిలీప్‌కుమార్, ‘శంకరాభరణం’లో సోమయాజులుగారి తరహాలో నటిస్తా. ఏ మనిషికైనా తన అర్హత, అనర్హతలు ఏంటో ఇతరుల కంటే తనకే బాగా తెలుస్తుంది. ఇండస్ట్రీలో మహా అయితే మరో నాలుగైదేళ్లు ఉంటా. అప్పటివరకూ నటిస్తా. ‘నా రాజ్యానికి నేనే రాజు’ అనేది నా పాలసీ.

హ్యాపీగా ఉండాలంటే...
అమ్మానాన్నలను మించిన దైవం లేదు. పిల్లలకు వాళ్ల తల్లితండ్రులు, తల్లితండ్రులకు వాళ్ల పిల్లలు గొప్పోళ్లు. మా అమ్మానాన్నలు పాజిటివ్‌గా ఆలోచించేవాళ్లు. చిన్నప్పటి నుంచి  కళ్ల ముందు ఏదైనా అన్యాయం జరిగితే వెళ్లడం, దెబ్బలు తినడమే నా పని. మళ్లీ ఉద్యమాల్లోకి వెళ్లేవాణ్ణి. వాళ్ల జీన్స్ నాలో ఉండడమే ఈ ప్రవర్తనకు కారణం అనుకుంటున్నా. నేను నా యాంగిల్‌లో వెళ్తున్నాను. మా అమ్మా నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. మన అంతరాత్మ ప్రకారం నడుచుకున్నప్పుడు హ్యాపీగా ఉంటాం.

ఓకే సార్... మోదీగారు పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో కొంతమంది సినీ పెద్దలు ‘బ్లాక్’ని వైట్ చేసుకోవడానికి ఇబ్బందులపాలవుతున్నారట. మీ సంగతేంటి?
(గట్టిగా నవ్వుతూ)... నాకు బ్లాక్ అండ్ వైట్ తేడా తెలియదు. నల్లధనం ఉండకూడదనే ఆశయంతో మోదీగారు చేసిన ప్రయత్నం మెచ్చుకోదగ్గది. కానీ, మోదీగారిని నేనేం ప్రశ్నిస్తున్నానంటే... ఎన్నికలకు ముందు విదేశీ బాం్యకుల్లో ఉన్న నల్ల డబ్బుని జనానికి పంచేస్తానన్నారు కదా. ముందా పని చేయమంటున్నా. ఎందుకు చేయలేకపోయారు? 500, 1000 రూపాయిల నోటుని రద్దు చేసినప్పుడు 2000 రూపాయి నోటు ఎందుకు? మోదీ హఠాత్ నిర్ణయం సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులపాలు చేస్తోంది. లోయర్, మిడిల్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ల పరిస్థితి అంతకన్నా దయనీయంగా ఉంది.

అంటే.. పెద్ద నోట్ల రద్దు తప్పంటారా?
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మధ్యతరగతి వాళ్ల ఇబ్బందుల గురించి ఆలోచించాలి. దీన్నే అదనుగా తీసుకుని పెట్రోల్ బంకుల్లో, కొన్ని కిరాణా కొట్లలో 500 నోటిస్తే.. నోటుకు సరిపడా కొనాల్సిందేనంటున్నారు. మోదీగారు వాగ్దానం చేసినట్లుగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న డబ్బు తెచ్చి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. అది ఎందుకు చేయలేకపోతున్నారని ఆయనను ప్రశ్నిస్తున్నా. గెలవడానికి  ఎన్నికల ముందు ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ప్రజలు ‘తాత్కాలిక’ అవసరాల కోసం ఓటేసి నంతవరకూ సమాజం బాగుపడదు. అందుకే ఓటేసే ముందు ‘శాశ్వతాన్ని’ దృష్టి పెట్టుకోవాలి. 

వారసులేనా వచ్చేది?
వ్యాపారస్థుడి కొడుకు వ్యాపారస్థుడు.. డాక్టర్ కొడుకు డాక్టర్.. అవుతున్నప్పుడు హీరో కొడుకు హీరో కావడంలో తప్పేంటి? రాజకీయ నేత కొడుకు రాజకీయ నేత అయితే తప్పేంటి? అనే చర్చ ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతోంది. ఎవరి అభిరుచి, ఆసక్తి ప్రకారం వాళ్లు నడుచుకోవచ్చనేది నా అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ఆ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. అయితే సినిమాల్లో నటించాలని, రాజకీయాల్లో రాణించాలని, అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని 90 శాతం మందికి ఉంది. వారసత్వం సరైనదని మీరే వస్తుంటే.. బయటవాళ్లెప్పుడు హీరోలవుతారు? మంత్రులవుతారు? జనాభా దామాషాలో అట్టడుగు వర్గాలూ అందలం ఎక్కాలి.

- డి.జి. భవాని

మరిన్ని వార్తలు