గురువుకు వందనం...

5 Sep, 2013 01:14 IST|Sakshi
గురువుకు వందనం...

‘నువ్వు’ ‘నేను’ ఈ అక్షరాలను చదవగలుగుతున్నామంటే దానికి కారణం ఒక ఉపాధ్యాయుడు. ఆ మహానుభావుడికి ధన్యవాదాలు చెబుతూ...

 ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. ఒక పరిపాలకుడు, ఒక శాస్త్రవేత్త, ఒక పాత్రికేయుడు, ఒక ఇంజినీర్, ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక జవాన్, ఒక గాయకుడు, ఒక ఆటగాడు... వీరందరి వెనుక స్త్రీ ఉన్నా, లేకపోయినా ఆశయసాధన సాధ్యమే! కానీ ప్రతివారి విజయం వెనుక ఒక ఉపాధ్యాయుడు ఉండి తీరతాడు.


 ఉపాధ్యాయుడికి వయసు ఉండదు. ‘‘తల వంచి కైమోడ్చే శిష్యుడవు నీవైతే, నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే’’ అన్న సిరివెన్నెలగారి మాటలు అక్షరాలా సత్యములు. నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టినప్పటి నుంచి నీ శిష్యుడవు నువ్వే. నువ్వే నీకు నిన్ను నేర్పించుకునే ఆచార్యుడవు. సర్వేపల్లి రాధాకృష్ణగారి జీవితం ఇందుకు ఉదాహరణ. ఆయన బి.ఏ. చదివే రోజుల్లో ఒక పుస్తకం రాశారు. ఆయన ఎం.ఏకి వచ్చేనాటికి ఆ పుస్తకం టెక్ట్స్ బుక్ అయ్యిందట!
 
 గురుశిష్యుల సంబంధానికి వయసు ఉండదు, వయసుతో సంబంధం ఉండదు. లియోనార్డో డావిన్సీకి, రైట్ బ్రదర్స్‌కి ఎగిరే పక్షి టీచర్... థామస్ ఆల్వా ఎడిసన్‌కి టంగ్‌స్టన్ వాడకముందు పగిలిపోయిన బల్బులే టీచర్. గజగజ వణికిన అర్జునుడికి చుట్టూ తన సోదరులు, శ్రేయోభిలాషులు ఉన్నా తన భారాన్ని మొత్తం భరించి గీత సారం బోధించి, అక్కడికక్కడే ప్రాక్టికల్స్ చేయించిన ప్రొఫెసర్ శ్రీకృష్ణుడు కాదా? ఉపాధ్యాయుడు మనిషి రూపంలోనే ఉండనవసరం లేదని ఏకలవ్యుడు నిరూపించాడు. కేవలం విగ్రహం నుండే స్ఫూర్తి పొంది విలుకాడు అయ్యాడు.
 
 రేపటి భారతానికి స్తంభాలు విద్యార్థులైతే... ఆ స్తంభాలను కట్టేది ఒక ఉపాధ్యాయుడు. రేపటి పౌరులని తీర్చిదిద్దే ఆర్కిటెక్ట్ ఆయన. ఒక పిల్లవాడికి దేవుడు... తల్లిదండ్రులని ప్రసాదిస్తే, సమాజం ఇచ్చే తల్లి తండ్రి మాత్రం ఉపాధ్యాయుడే. తనకున్న విజ్ఞానంతోపాటు విలువలని నేర్పిస్తాడు. పద్య గద్య, సాహిత్యాల్లోని అందాన్ని, ఒక శ్రీనాథుడిగానో, షేక్‌స్పియర్‌లానో మారిపోయి మన కళ్లకి కట్టినట్టు చూపిస్తున్నాడు. వెనువెంటనే సోక్రటీస్‌లాగ, స్వామివివేకానందలాగ మారి ఆ పాఠం యొక్క మూలాన్ని, దానిలోని సారాన్ని మన ఎదిగే మెదడులోకి ఎక్కిస్తాడు. ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. అందుకేనేమో ఈ ఇరువురి సంబంధం ప్రత్యేకమైంది. నీలో టాలెంట్‌ని మొదటగా గుర్తించి ముందుకు వెళ్లే ధైర్యం ఇచ్చాడనేమో ఇంత అభిమానం. అందుకే ఒకరిని ఒకరు విడిచి వెళ్లాల్సిన సమయంలో ఆ కన్నీరు.
 
 మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం. అలా ఒక విద్యార్థి మనస్తత్వానికి తగ్గట్టు ఉపాధ్యాయుడు కూడా మారతాడు. నిన్ను కొడతాడు... దొంగచాటుగా నీ నుండి తిట్లు తింటాడు. కానీ ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగిన వాళ్లంతా చిన్నతనంలో వాళ్ల మ్యాథ్స్‌సర్‌తో రేపు వీపు బద్దలు కొట్టించుకునే ఉంటారు, ఫిజిక్స్ సర్‌తో చెవి మెలి పెట్టించుకునే ఉంటారు, ఇంగ్లిష్ సర్‌తో స్కేల్ బలాన్ని రుచి చూసే ఉంటారు. అవును... నిన్ను మార్చాలి... బతిమాలినా, భయపెట్టినా, ఏదో ఒకటి చేసి నిన్ను తీర్చిదిద్దాలంటే. అందుకేనేమో ఎన్ని వృత్తులు ఉన్నా టీచర్ పదవికి వన్నె, విలువ తగ్గనిది. అదే ఆయన అలిగి ఉంటే రాజులు, రాజ్యాలు, శాస్త్రాలు, సూత్రాలు ఎప్పుడో చరిత్రలో కలిసిపోయేవి. గడిచిపోయిన నిన్నటిని ఇంకా పుస్తకాల్లో దాచి నేటికి పరిచయం చేసి, రేపటిని నిర్మిస్తున్నాడు. నీ విజయంలో నీ వెనుక ఉంటూ నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు.

 - జాయ్
 

మరిన్ని వార్తలు