రోటీశ్వరి

25 Jan, 2020 03:03 IST|Sakshi

స్ఫూర్తి

సక్సెస్‌ స్టోరీలన్నీ కష్టాల నుంచే మొదలవ్వవు. మంచి ఆలోచనల నుంచి కూడా అవి ‘తయారవుతాయి’. శశిరేఖకు మొదట వచ్చిన ఆలోచన.. ఇంటి పనిలో దొరికించుకున్న ఖాళీ సమయంలో తనేదైనా పని చెయ్యాలని. రెండో ఆలోచన.. తను పని చేస్తూ, కొంతమందికి పని కల్పించాలని. అలా మొదలైందే.. జీవీఎస్‌ ఫుడ్స్‌. రెడీమేడ్‌ రొట్టెలతో అమ్మకాలను మించిన నమ్మకాన్ని పొందుతున్న శశిరేఖను రోటీశ్వరి అనడమే ఆమె విజయానికి సరైన పోలిక.

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉంటారు శశిరేఖ. గృహిణి. భర్త ప్రైవేట్‌ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. అంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు.. ఎనిమిదేళ్ల క్రితం ఓ రోజు భార్యాభర్తల మాటల్లోకి చపాతీలు, జొన్నరొట్టెలు, పుల్కాలు వచ్చాయి. ‘‘అవును, ఇప్పుడంతా ఉదయం పూట టిఫిన్‌గా,  రాత్రి భోజనానికి బదులుగా అవే తింటున్నారు’’ అని భార్య అంటే.. బయట మార్కెట్‌లో కూడా బాగా గిరాకీ కనిపిస్తోంది’’ అని భర్త అన్నాడు. అప్పుడొచ్చింది శశిరేఖకు ఆలోచన. తను కూడా చపాతీలు, జొన్నరొట్టెలు, పుల్కాలు చేసి అమ్మితే?! అయితే అప్పటికప్పుడు వాటిని తయారు చేసి అమ్మడం కాకుండా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినేందుకు వీలుగా ప్యాక్‌ చేసి మార్కెట్‌కు వెయ్యడం కరెక్ట్‌ అనిపించింది ఆమెకు. భర్త బాలరాజుకూ ఆ ఆలోచన నచ్చింది.

ఆవిర్భావం!
భర్త ఓకే అన్నాడు. కావలసిన సామగ్రి తెచ్చిపెట్టాడు. తయారీకి ఐదుగురు మహిళల్ని తీసుకున్నారు. కొద్దిపాటి వ్యాపారమే. మెల్లిగా వృద్ధి చెందడం మొదలైంది. ఇక చేతులు సరిపోవడం లేదు. యంత్రాలు కావలసిందే. ఉన్నవి అమ్ముకుని కొంత, బ్యాంక్‌ లోను కొంత కలిపి యాభై లక్షల రూపాయలతో కోయంబత్తూర్‌ నుంచి ఆటోమేటిక్‌ అన్‌కుక్‌డ్‌ మెషిన్లు రెండింటిని తెప్పించారు. ఇంటినే కర్మాగారంగా మార్చేశారు. ఒక్కో మిషన్‌పై గంటకు 500 చపాతీలు తయారవుతాయి.

రెండు మెషీన్ల నుంచి వెయ్యి చపాతీలను గంటలోనే తయారు చేస్తారు. పిండి కలపడం, ముద్దలుగా చేయడం, ప్రెస్‌ చేయడం, మిషనరీపై నుంచి తయారైన వాటిని ప్యాక్‌ చేసేయడం. నాణ్యత విషయంలో రాజీ పడకుండా తక్కువ ధరలకే ఇస్తుండడంతో డిమాండ్‌ కూడా బాగా పెరిగింది. రెడీమేడ్‌గా తయారు చేసిన ఈ చపాతీలు, జొన్నరొట్టెలను పొయ్యిపై పెనం పెట్టి కొంచెం వేడి చేసుకుంటే చాలు. కమ్మగా తినచ్చు. ప్యాకింగులో వారం రోజులు నిల్వ ఉంటాయి.

తల్లి మనసు
‘‘మేలు రకం గోధుమపిండి, వంటనూనె, మినరల్‌ వాటర్‌ను వీటి తయారీకి ఉపయోగిస్తాం. నాణ్యత, స్వచ్ఛతే మా వ్యాపారాభివృద్ధికి మార్గమైంది’’ అంటారు శశిరేఖ. ‘‘మా రెడీమేడ్‌ చపాతీలను, జొన్నరొట్టెలను గృహిణులు ఇంట్లో చేసి, స్కూలుకు వెళ్లే చిన్నారులకు సైతం టిఫిన్‌ బాక్సుల్లో పెట్టి పంపిస్తున్నారు. పిల్లలు ఎంతో ఇష్టంతో తింటున్నారు’’ అని సంతోషంగా చెబుతున్నప్పుడు శశిరేఖలో మనకు వ్యాపారవేత్త కన్నా, తల్లి మనసే కనిపిస్తుంది! ‘‘బీపీ, షుగర్, ౖథైరాయిడ్, ఒబేసిటీ ఉన్నవారు చపాతీలు, పుల్కాలు, జొన్నరొట్టెలు తినడం మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. దాంతో ఇటు చిన్నారుల నుంచే కాకుండా పెద్దల నుంచి కూడా మా ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని’’అంటారు శశిరేఖ.

ఇతర రాష్ట్రాల నుంచీ..!
రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తుంటాయి. ‘‘హోటల్స్, రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లు, దాబాలు, రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు పెరిగాయి. అంతేకాకుండా అమెరికాకు వెళ్లే మన తెలుగు వారికి ఇక్కడినుంచి చపాతీలు, పుల్కాలు, జొన్నరొట్టెల పార్సిళ్లు పంపుతున్నాం’’ అని చెప్పారు శశిరేఖ.
– మొలుగూరి స్వర్ణలత, సాక్షి, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు