విద్యార్థుల కష్టాలు తీర్చాడు...

26 Jan, 2015 00:25 IST|Sakshi
విద్యార్థుల కష్టాలు తీర్చాడు...

ఆలోచనకు అనుభవంతో పని లేదు. ప్రతిభకు వయసుతో సంబంధం లేదు. కాసింత సృజనాత్మకత, ఇంకాస్త కృషి, మరికాస్త పట్టుదల ఉంటే చాలు... ఎవరూ ఊహించనివి చేయవచ్చు. అందరితో శభాష్ అనిపించుకోవచ్చు. సందేశ్ బెహెటీ ప్రతిభ గురించి, అతడు సాధించిన విజయం గురించి తెలిస్తే... ఈ మాటలు ఎంత సత్యమో తెలుస్తుంది!
 
ఓసారి ఒక దినపత్రికలో ‘మీరూ సెలెబ్రిటీ కావాలనుకుంటున్నారా’ అన్న ప్రకటనకు ఆకర్షితుడై, పోటీకి అప్లికేషన్ పంపించాడు సందేశ్. దాదాపు రెండు లక్షల మంది పాల్గొన్న ఆ పోటీలో... ప్రతి రౌండ్‌లోనూ తన ప్రతిభతో విజయఢంకా మోగించాడు. దాంతో అతడికి హైదరాబాద్ మెట్రో రైలుకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది.
 
తెలంగాణ ఏవియేషన్ అకాడెమీకి వెళ్తే... అకాడెమీని నడిపే ముఖ్యాధికారి దగ్గర్నుంచి, గేటు దగ్గర కాపలా కాసే వాచ్‌మేన్ వరకూ అందరికీ సుపరిచితుడు సందేశ్. పెలైట్ కోర్సు చదువుతోన్న ఈ కుర్రాడిని అంత పాపులర్ చేసింది... ముమ్మాటికీ అతడి ప్రతిభే. పైలట్ కోర్సులో టెక్నికల్ జనరల్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. అది చాలా కష్టంగా ఉంటుంది. ఎవ్వరూ ఒక్కసారి పరీక్ష రాసి పాసవ్వలేరు. ఆ విషయం సందేశ్‌కి బాగా తెలుసు. ఎందుకంటే అతడు కూడా మూడుసార్లు విఫలమై, నాలుగోసారి పాసయ్యాడు కాబట్టి.

అప్పుడే సందేశ్ ఆలోచనలో పడ్డాడు.  అప్పుడతడికి అర్థమైంది... లోపం సబ్జెక్టులో కాదు, దానికి సంబంధించిన పుస్తకాల్లో ఉందని. టెక్నికల్ జనరల్ గురించి ప్రచురించిన ప్రతి పాఠ్య పుస్తకమూ వందలు, వేల పేజీల్లో ఉంది. పైగా అవన్నీ కఠినమైన ఆంగ్లంలో ఉన్నాయి. వాటిని చదవడం, అర్థం చేసుకోవడం, గుర్తు పెట్టుకోవడం అంత తేలిక కాదు. ఈ విషయం అర్థం కాగానే ఓ ఆలోచన తళుక్కున మెరిసింది సందేశ్ మనసులో. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేశాడు. అహరహం శ్రమించాడు. 45 రోజులు తిరిగేసరికల్లా టెక్నికల్ జనరల్ సబ్జెక్టు మొత్తాన్నీ కుదించి ‘హ్యాండ్‌బుక్ ఫర్ పైలట్స్’ పేరుతో ఓ చిన్న పుస్తకంగా వెలువరించాడు.
 
పుస్తకం అంత చిన్నగా ఉన్నా, సబ్జెక్టులో ఉండాల్సిన ఏ ముఖ్యమైన పాయింటూమిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. సందేశ్ పాఠ్యాంశాలను కుదించాడు తప్ప, ఏ ముఖ్యమైన అంశాన్నీ విస్మరించలేదు. పాఠాలన్నిటినీ కూలంకషంగా చదివి, ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ జాగ్రత్తగా పేర్చాడు. అది కూడా సులభమైన ఆంగ్లంలో! పుస్తకంలో పేజీలకి ఒక పక్క మాత్రమే సబ్జెక్ట్ రాశాడు. ఎడమపక్కన పేజీలన్నీ ఖాళీగా ఉంచాడు... చదివేటప్పుడు నోట్స్ రాసుకోవడానికి. వెరసి ఈ పుస్తకం విద్యార్థులకు ఎంత బాగా ఉపయోగపడిందంటే... కళ్లు మూసి తెరిచేలోగా చాలా కాపీలు అమ్ముడైపోయాయి. కొందరు విద్యార్థులు సందేశ్ పుస్తకాన్ని చదివి వెంటనే పరీక్ష పాసైపోయారు కూడా. ఆ విషయం సందేశ్ దగ్గర ప్రస్తావిస్తే...
 
‘‘ పుస్తకం రాయడం వల్ల వచ్చిన పేరు, పాపులారిటీ కంటే... వాళ్లు నా పుస్తకం చదివి పరీక్ష పాసయ్యారన్న విషయమే నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది’’ అంటూ సంబరపడ్డాడు. సందేశ్‌కి ఎయిర్‌లైన్స్ అంటే పిచ్చి. రాజస్థాన్‌లో పుట్టినా... తండ్రి ఎం.రమేష్ కుమార్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి కావడంతో చెన్నై, ఢిల్లీల్లో పెరిగాడు. ఇప్పుడాయన హైదరాబాద్ ఎయిర్ ఇండియా సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా ఉండటంతో, కుటుంబమంతా హైదరాబాద్‌లోనే నివసిస్తోంది.

జేఎన్‌టీయూలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్‌లో ఇంజినీరింగ్ చేసిన సందేశ్, ప్రస్తుతం తెలంగాణ ఏవియేషన్ అకాడెమీలో పైలట్ కోర్సు చేస్తున్నాడు. ఆకాశంలో విహరించడం తన ప్యాషన్ అని చెప్పే ఈ అబ్బాయికి, విమానాలకు సంబంధించిన అంశాలపై వయసుకు మించిన అవగాహన ఉంది.

అదే ఈ పుస్తకం రాయడానికి ప్రేరేపించింది. అయితే ఇందులో తన గొప్పదనం ఏమీ లేదని, తండ్రి రమేష్, తల్లి శిఖాల ప్రోత్సాహమే తనను ప్రతి విషయంలోనూ విజేతను చేస్తోందని వినయంగా చెబుతాడు సందేశ్. త్వరలో ‘హ్యాండ్‌బుక్ ఫర్ పైలట్స్’ రెండో ఎడిషన్ కూడా వేయబోతున్నాడు. దేశంలోని విద్యార్థులందరికీ ఈ పుస్తకం అందుబాటులో ఉండేలా చూడాలనుకుంటున్నాడు.
- సమీర నేలపూడి

మరిన్ని వార్తలు