పని జెండర్‌ ఎరగదు

29 Jan, 2018 00:28 IST|Sakshi

‘ఎవరన్నారీ పని మగవాళ్లదని...’ సంధ్యా మారవి ఈ మాట అనలేదు. కానీ... ఇది మగవాళ్ల పని మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ఆడవాళ్ల పని కూడా. అంతకంటే ముందు ఇది మనిషికి అన్నం పెట్టే పని... అని నిరూపించింది. ఒక చాదస్తపు సంప్రదాయ గిరిగీతను చెరిపివేసింది. కుటుంబాన్ని పోషించడానికి ఇంటి మగవాడు ఉన్న ఆడవాళ్లకు ఇది మగవాళ్ల పనిగానే కనిపిస్తుందేమో! అన్నం పెట్టే వాడు ‘పిల్లలకు ఇక నుంచి తల్లీతండ్రీ నువ్వే’ అని అకస్మాత్తుగా తనువు చాలించిన సంధ్య లాంటి వాళ్లకు మాత్రం కాదు.‘ఇది ఆడవాళ్లు చేసే పని కాదు’ అని చేతులు ఒడిలో పెట్టుకుని, మౌనంగా కూర్చుంటే పిల్లలకు వేళకింత అన్నం ఎవరు పెడతారు?... ఇవన్నీ సంధ్య మౌనంగా సంధించే ప్రశ్నలు.

సంధ్యామారవి కాట్ని రైల్వే స్టేషన్‌లో కూలీ. ఆమెది మధ్యప్రదేశ్, జబల్పూర్‌ జిల్లా కుందం గ్రామం. జబల్పూర్‌ నుంచి కాట్నికి 90 కిలోమీటర్లు. ఆమె ఉద్యోగానికి వెళ్లాలంటే రోజూ బస్సులో సొంతూరు కుందం నుంచి జబల్పూర్‌కి, అక్కడి నుంచి రైల్లో కాట్నికి చేరుకోవాలి. డ్యూటీ ముగిసిన తర్వాత అదే రూట్‌లో తిరుగు ప్రయాణం. అటూఇటూ కలిపి రోజుకు 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మరీ ఉద్యోగం చేస్తోంది. కాట్ని స్టేషన్‌లో 40 మంది పోర్టర్లున్నారు. వారిలో సంధ్య మాత్రమే అమ్మాయి. పసితనం పోని సంధ్య చేత పెట్టెలు మోయించుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందిపడుతుంటారు. ఇంత బలహీనంగా ఉన్న అమ్మాయి తమ సామాను మోయలేక కిందపడేసి పాడు చేస్తుందేమోననే భయం కూడా.

‘నేను మోయగలను సార్‌’ అని వాళ్లకు భరోసా ఇచ్చి మరీ బరువులు మోస్తోంది. రోజంతా బరువులు మోయడం కష్టంగా అనిపించడం లేదా అని ఎవరైనా ఆత్మీయంగా అడిగితే... ‘ఇంకా లోకం తెలియని ముగ్గురు పిల్లల భారం మోస్తున్నాను’ అంటుంది. ఆమె మాటల్లో లోతు అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఆమెను చూస్తే బరువు మోయడానికి శక్తికంటే ఎక్కువగా ధైర్యం ఉండాలనిపిస్తుంది. ఆమె ఎవరి నుంచి కూడా సహాయాన్ని ఆశించడం లేదు. తన కుటుంబాన్ని తానే పోషించుకోగలను అంటోంది. అయితే ఆమె రైల్వే డిపార్ట్‌మెంట్‌ను కోరుతున్న సహాయం ఒక్కటే. అది కాట్ని స్టేషన్‌ నుంచి జబల్పూర్‌ స్టేషన్‌కి బదిలీ. అధికారులు స్పందించినప్పుడు ఆమెకి ఈ సుదీర్ఘమైన ప్రయాణం తప్పుతుంది.

సంధ్యకు ఇద్దరు కొడుకులు, ఎనిమిదేళ్ల సాహిల్, ఆరేళ్ల హర్షిత్‌. కూతురు పాయల్‌కు నాలుగేళ్లు. సంధ్య ఉద్యోగానికి వేళ్లకు వెళ్లాలంటే తెల్లవారు జామున లేచి బయలుదేరాలి. సంధ్య అత్త ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటుంది. ‘నా కొడుకు అర్థంతరంగా పోయాడు. ఇంటి బరువును కోడలు తలకెత్తుకుంది. పిల్లల్ని చక్కగా బడికి పంపించి చదివిస్తాం. పెద్దయిన తర్వాత వాళ్లమ్మ కష్టాలను ఈ పిల్లలే తీర్చాలి’ అంటోందామె.

– మంజీర

మరిన్ని వార్తలు