అసలేం జరిగిందంటే..!

5 Nov, 2016 06:12 IST|Sakshi
డాక్టర్ రవి , సంధ్యారాణి పెళ్లినాటి ఫోటో

సంధ్యారాణి ఆత్మహత్య

డాక్టర్ సంధ్యారాణి సొంత ఊరు నల్గొండ జిల్లా, కట్టంగూర్ మండలం, ఐటి పాముల. ఆమె తండ్రి బాల సత్తయ్య వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇల్లందు బ్రాంచ్‌లో జూనియర్ ఆఫీసర్. 2013లో హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. వారికి ఇద్దరబ్బాయిలు. సంధ్యారాణి ఒక్కతే కూతురు. సంధ్యారాణి చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్. టెన్త్‌లో స్కూల్ టాపర్. టెన్త్ వరకు ఖమ్మంలోనే చదివింది. ఇంటర్, ఎంబీబీఎస్ కోచింగ్ హైదరాబాద్‌లో తీసుకుంది.

సంధ్య ఎంత సెన్సిటివో అంత డేరింగ్ కూడా. మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండిట్లో ఫస్టే! టెన్త్‌లో రెండిట్లో హండ్రెడ్‌కి హండ్రెడ్ మార్క్స్ వచ్చాయ్. ఇంటర్‌లో 960. డాక్టర్ కావాలని ఆమె యాంబిషన్. ఆ ప్యాషన్‌తోనే ఎంబీబీఎస్ చేసింది. 75 పర్సెంటేజ్ తెచ్చుకుంది. తర్వాత గైనకాలజీ చేసి... విమెన్ హెల్త్ కోసం పనిచేయ్యాలని ఉండేదామెకు! అందుకే హైదరాబాద్‌లో ప్యాథాలజీలో సీట్ వచ్చినా వద్దనుకొని, గుంటూరు మెడికల్ కాలేజ్‌లో వచ్చిన గైనకాలజీలో చేరింది.

మా బిడ్డ ఏం చేసినా... ఆమెకు తప్పే!
‘‘సంధ్య రోజుకు మూడుసార్లు ఫోన్ చేసేది. ‘ప్రొఫెసర్ బాగా సతాయిస్తోంది, టార్చర్ పెడ్తోందని ఏడ్చేది. ఇంకా నాలుగు నెలలైతే కోర్స్ అయిపోతుంద’ని నచ్చచెప్పేవాళ్లం’’ అన్నారామె తల్లితండ్రులు.‘‘సెలవులు అడిగితే ప్రొఫెసర్ ఇచ్చేది కాదు. దసరాకి కూడా ఇవ్వకుండా ఆ రోజు కావాలనే  నైట్ డ్యూటీ వేసిందట. వినాయక చవితికీ లీవ్ ఇవ్వలేదు. అయితే అప్పుడు ప్రొఫెసర్ లక్ష్మి అయిదు రోజులు సెలవులో ఉంది. ఇంకో ప్రొఫెసర్... మా అమ్మాయితో ‘లీవ్ కావాలంటే తీసుకో సంధ్యా’ అని సెలవు ఇచ్చారు. ఆ విషయం ప్రొఫెసర్ లక్ష్మికి ఎవరు చెప్పారో ఏమో... మా అమ్మాయికి సెలవు ఇచ్చిన ప్రొఫెసర్‌కి ఫోన్ చేసి సంధ్య గురించి ఆరా తీసిందట.

తిరిగి కాలేజ్‌కి వెళ్లగానే.. ‘నేను లేకపోతే వెళ్లిపోతావా’ అంటూ మళ్లీ టార్చర్ స్టార్ట్ చేసిందట లక్ష్మి. నవంబర్ ఫస్ట్ నుంచి రెండు నెలలు మా అమ్మాయికి లేబర్ వార్డ్‌లో పోస్టింగ్ ఉండింది. ఆ లేబర్ వార్డ్ హెడ్ కూడా ప్రొఫెసర్ లక్ష్మీయే. ‘ఫస్ట్ నుంచి నా దగ్గరికే కదా నువ్ రావాల్సింది! ఎలా పాసవుతావో చూస్తా. నీకు సర్టిఫికెట్ ఎలా వస్తుందో చూస్తా. నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించేదట. మా అమ్మాయి చాలా భయపడింది. అందుకే చనిపోయే ముందు రోజు (అక్టోబర్ 22వ తారీఖు) పొద్దున ఆరు గంటలకే ఫోన్ చేసింది. ‘నేను వచ్చేస్తా. ఇక్కడ ఉండను. మానేస్తా’ అని ఏడ్చింది బిడ్డ. ‘ఇంకెంత నాలుగు నెలలే కదా’ అని నేను, వాళ్ల డాడీ సర్ది చెప్పడానికి ప్రయత్నించాం. అయినా సరే బిడ్డ సమాధానపడలేకపోయింది. ‘లేదు. నేనుండను. లక్ష్మీ మేడమ్ బాగా టార్చర్‌పెడుతోంది. నాకు ఉండబుద్ధి కావట్లేదు. నేను చదువు మానేసుకొని వచ్చేస్తా’ అని ఏడ్చింది.

బిడ్డ కంటే ఎక్కువేం కాదు కదా అని ‘సరే వచ్చెయ్’ అని చెప్పాం. వెంటనే బయలుదేరతా అని కూడా అన్నది. ఆమెతో మాట్లాడిన వెంటనే మలేసియాలో ఉన్న పెద్దకొడుకుకి ఫోన్ చేసి, ‘చెల్లెలు ఏడుస్తోందిరా. ఒకసారి మాట్లాడు’ అని చెప్పాను. వాడు మాట్లాడితే కూడా ‘నాకు ఉండ బుద్ధి కావట్లేదు హైదరాబాద్ వెళ్లిపోతా’ననే ఏడ్చిందట. వాడు కూడా ‘సరే. ఇష్టం లేకపోతే ఉండకు. బయలుదేరిపో’ అనే ధైర్యం చెప్పాడు. ఇది జరిగిన కొంచెంసేపటికి బయలుదేరిందా లేదా తెలుసుకుందామని మా అమ్మాయికి ఫోన్ చేస్తే, ‘లేదు మమ్మీ... రావట్లేదు. హాస్పిటల్‌కెళ్తున్నా’ అంది. సరే మనసు మార్చుకుందేమో.. కుదుటపడిందేమో అనుకున్నాం. ఆ రోజు ఇక తాను ఫోన్ చేయలేదు. రాత్రి తొమ్మిదిన్నర టైమ్‌లో మేమే ఫోన్ చేశాం. మామూలుగానే మాట్లాడింది. అంతా బాగానే ఉందని స్థిమిత పడ్డాం.

ఆదివారం తెల్లవారింది!
మర్నాడు ఆదివారం. మామూలుగా ఆదివారం లేట్‌గా ఫోన్ చేస్తుంది. ఆ టైమ్ దాటినా ఫోన్ రాకపోయేసరికి మేమే ఫోన్ చేశాం. సంధ్య ఫోన్ తీయలేదు. రెండు మూడుసార్లు చేసినా సమాధానం లేదు. మా అమ్మాయి రూమ్ పక్కనే ఉన్న ఆమె ఫ్రెండ్‌కి ఫోన్ చేసి... - సంధ్య ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి చూడమని అడిగాం. ఆమె వెళ్లి చూస్తే డోర్, కిటికీ అన్నీ వేసున్నాయ్. పిలిస్తే పలకలేదు. కిటికీ అద్దం పగలగొట్టి చూస్తే... బెడ్ మీద కాళ్లు, చేతులు కొట్టుకుంటూ కనిపించింది సంధ్య. వాళ్లు వెంటనే మాకు ఫోన్ చేసి సంధ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మేము  ఉదయం తొమ్మిదరన్నరకు గుంటూరు బయలుదేరాం. మధ్యలో ఫోన్ చేస్తే మా ఫోన్ కట్ చేశారు. వెళ్లేసరికి సంధ్య ఐసీయూలో ఉంది. నేను పిలిస్తే ఉలిక్కిపడి లేచింది. మమ్మల్ని గుర్తు పట్టి ‘మమ్మీ’ అని పిలవబోయింది. కానీ, నోట్లో పైపులు ఉండేసరికి మాట్లాడలేకపోయింది. మంచమ్మీద నుంచి లేవపోయింది. అంతలోనే మత్తులోకి వెళ్లిపోయింది. గుండె ఫాస్ట్‌గా కొట్టుకుంటోందని గుండె డాక్టర్‌ను పిలిపించారు.

బీపీ డౌన్ అవుతోందని మాట్లాడుకుంటుంటే విన్నాం. మేం బయటకు వచ్చాం. ఆ తర్వాత మూడు నిమిషాలకు ఆమె ఫ్రెండ్స్ ఏడుస్తూ బయటకు వచ్చారు. తర్వాత మమ్మల్ని పిలిచారు. ఏముంది! అప్పటికే అంతా అయిపోయింది. బిడ్డ చచ్చిపోయింది. గుండెకు సంబంధించిన ఏదో ఇంజక్షన్ తీసుకుని ప్రాణం తీసుకుంది’’ అంటూ చీర కొంగు నోట్లో పెట్టుకొని పెల్లుబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొనే ప్రయత్నం చేసింది సంధ్య తల్లి ప్రమీల. తండ్రి సత్తయ్య పంటి బిగువున బాధను అదిమిపెట్టుకుని, చెంపల మీద కారుతున్న కన్నీళ్లను మౌనంగా తుడుచుకున్నారు.

గర్భం పోయి ఉండవచ్చు!
గర్భం ఒకటి - రెండు నెలల్లో అయితే మాత్రలతో టెర్మినేట్ అయిపోతుంది. బహుశా సంధ్యారాణి విషయంలో అదే జరిగి ఉండవచ్చు. గర్భం దాల్చినప్పటికీ, చనిపోయే నాటికే మందులతో పోగొట్టుకున్నట్లుంది. పోస్టుమార్టంలో ఆ విషయం తేలదు.  - టిటికె రెడ్డి, ఫోరెన్సిక్ విభాగాధిపతి, గుంటూరు జనరల్ హాస్పిటల్

ఆ అమ్మ...  ప్రాణం ఖరీదు
ఈ ఏడాది మే నెలలో జరిగిన లావణ్య హత్య ఇంకా మరిచిపోలేదు ఎవ్వరు! మనం సంక్షేమరాజ్యంలో కాదు రౌడీ రాజ్యంలో ఉన్నామని వీపు చరిచి మరీ చెప్పిన ఘటన అది! లావణ్య, అప్పలరాజు.. చక్కటి జంట.రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు. చూడముచ్చటైన సంసారం. విశాఖపట్నం జిల్లా, గాజువాక మండలం, రాజీవ్‌నగర్ వాళ్ల నివాసం. మే 22న.. అందరూ కలిసి నూకాంబికా దేవాలయానికి వెళ్లారు లావణ్య కోరిక మేరకు. పిల్లలకు నిద్ర వస్తోందని బంధువుల భరోసాతో భార్యను దేవాలయంలోనే ఉంచేసి, తాను పిల్లల్ని తీసుకొని ఇంటికొచ్చేశాడు భర్త అప్పలరాజు. ఆ తర్వాత దర్శనం ముగించుకున్న లావణ్య తమ బంధువులైన మోహన్, దివ్యలతో కలిసి బైక్ మీద ఇంటికి వస్తోంది. తప్పతాగిన దాడి హేమకుమార్, అతని స్నేహితులు కారులో ఆ బైక్‌ను వెంబడించారు.

హారన్ మోగిస్తూ వెకిలిగా నవ్వుతూ, మోటార్ బైక్ పైపైకి తీసుకెళ్లారు కారును. ఆ బృందం నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాడు మోహన్. అయినా వదల్లేదు హేమకుమార్ బృందం. బైకుని కారుతో ఢీకొట్టారు. లావణ్య అక్కడిక్కడే మరణించింది. హేమకుమార్, లావణ్య కుటుంబానికి ఏ పరిచయమూ లేదు. పగ అంతకన్నా లేదు. అది కేవలం అధికార పార్టీ అండ, ఆర్థిక బలం, ఆ మదంతో దుండగులు పాల్పడ్డ దుశ్చర్య. సరదాగా సామాన్యుల ప్రాణాలతో ఆడిన చెలగాటం! జనం ఉద్యమించేసరికి, ప్రాణం ఖరీదు పది లక్షలని బేరం పెట్టారు!

మరిన్ని వార్తలు