పారిశుధ్య ‘వేత్త’

22 Jul, 2015 22:47 IST|Sakshi
పారిశుధ్య ‘వేత్త’

జార్ఖండ్‌లో బిఎ చదివే కాలేజీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుందంటే కారణం... ఏ ప్రేమో, పరీక్షల్లో తప్పడమో కాదు... ఆమె ఇంట్లో టాయిలెట్ లేకపోవడం. ఇటీవల జరిగిన ఈ సంఘటన దేశంలో మరుగుదొడ్ల అవసరం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఓ ఉదాహరణ. ‘‘ఒక్క ఫోన్ కాల్‌తో టాయిలెట్ కట్టించి ఇచ్చే కార్యక్రమం మేం చేపట్టడానికి ఇలాంటి సంఘటనలే కారణం’’ అంటారు రవికుమార్ రెడ్డి.
 
పల్లె వెలుగు కోసం...
 టాయిలెట్ కావాల్సిన వారికి టోల్‌ఫ్రీ నెంబరు అనే వినూత్న ఆలోచనకు రూపమిచ్చిన రవిరెడ్డి (55) జన్మస్థలం నెల్లూరు.  కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చేశారు. వృత్తిరీత్యా చార్టెర్డ్ అకౌంటెంట్. చిన్న తనం నుంచీ గ్రామీణ ప్రాంతాల పట్ల మక్కువ కలిగిన ఆయన పల్లెలో పారిశుధ్ధ్య పరిస్థితులను మెరుగుపరచడానికి తన వంతు చేయూతను అందించే  రీడ్స్ సంస్థలో 1989లో ప్రవేశించారు. ‘‘సెంట్రల్ గవర్నమెంట్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో మానిటరింగ్ ఏజెన్సీగా పనిచేసిన సమయంలో ఒరిస్సా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక... ఇలా పలు రాష్ట్రాల్లోని పల్లె ప్రాంతాలను తిరిగాను. ఆ అనుభవంతో పల్లెటూర్లలో పారిశుధ్ధ్యం, రక్షిత మంచినీరు... అత్యవసరమైన అంశాలుగా గుర్తించాను. 2004లో రీడ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాక, నా అనుభవాన్ని ఉపయోగించి పల్లె వాసులకు ఉపయుక్తమైన కార్యక్రమాలు ప్రారంభించాను’’ అని వివరించారు రవిరెడ్డి. సేఫ్ వాటర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆయన మొబైల్ వాటర్ ట్రీట్‌మెంట్ యూనిట్స్‌ను కూడా పరిచయం చేశారు. చేతుల్ని శుభ్రపరచుకునే విషయంలో చిన్నారుల్లో అవగాహన కలిగించడానికి దేశవ్యాప్తంగా 7వేల స్కూల్స్‌ను సందర్శించారు. అలాగే గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు ఎన్నో ఉన్నా అవి అందుబాటులోకి రాకపోవడాన్ని గుర్తించిన ఆయన ఆ దిశగా కూడా తన వంతు కృషి చేస్తూ పలు అంతర్జాతీయ, జాతీయ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.  ‘‘రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది నాకు వ్యక్తిగతంగా అత్యంత ఇష్టమైన వ్యాపకం. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు దొరికే ఖాళీ సమయంలో సగం సద్వినియోగమైతే చాలు... దేశం సుసంపన్నమైపోవడానికి’’ అంటారు రవిరెడ్డి. ఈ అంశంలో ఆయన కృషిని గౌరవిస్తూ... అమెరికాకు చెందిన సెంటినల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందించింది.

 స్వచ్ఛ భారత్... స్ఫూర్తిగా...
 దేశంలో దాదాపు 13 కోట్ల ఇళ్లకు మరుగుదొడ్లు లేని నిజాన్ని ఇటీవల జరిగిన సర్వే వెల్లడి చేయడంతో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచింది. స్వచ్ఛభారత్ ను ప్రకటించి పెద్ద యెత్తున ప్రచారం చేస్తోంది. అయితే మరుగుదొడ్లు లేని వారిలో 11 కోట్లకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారే. వీరికి ఈ ప్రచారమేమిటో, మరుగుదొడ్డి నిర్మాణంలో ప్రభుత్వం అందించే సహకారం ఏమిటో తెలిసేదెలా? ఈ పరిస్థితిని గుర్తించిన రీడ్స్... ఈ విషయంలో గ్రామీణులకు అవగాహన పెంచడానికి సిద్ధమైంది. సంస్థ ప్రకటించిన టోల్‌ఫ్రీ నెంబరుకు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు, తమ ప్రతినిధులే స్వయంగా సదరు వ్యక్తిని కలిసి టాయిలెట్ నిర్మాణంలో ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న సాధక బాధకాలేమిటో తెలుసుకుంటారు. ప్రభుత్వం నుంచి ఎంత మేరకు సహాయం పొందవచ్చో వివరిస్తారు. అధికారులకు అవసరార్ధులకు మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తామని, నిర్మాణపరమైన సాంకేతిక సహకారం కూడా అందిస్తామని రవిరెడ్డి చెప్పారు. మరుగుదొడ్డి నిర్మాణంలో గ్రామీణులకు సహకరించేందుకు యునిసెఫ్‌తో కలిసి రీడ్స్ (రూరల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ)  స్వచ్ఛంద సంస్థ తరపున ఆయన గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలో ఇటీవలే టోల్ ఫ్రీ నెంబరు (040 911200) ను ఏర్పాటు చేయడం విశేషం. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఒక్క జిల్లాలోనే అమలు చేస్తున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో తెలుగురాష్ట్రాల వ్యాప్తంగా చేపట్టాలని యోచిస్తున్నామన్నారాయన. కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగా  2019 కల్లా దేశంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలంటే అంతటి బృహుత్తర లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని అంటున్నారాయన.
 - ఎస్.సత్యబాబు
 సంకల్పం
 

మరిన్ని వార్తలు