జగద్గురువు ఆదిశంకరులే!

10 May, 2016 23:25 IST|Sakshi
జగద్గురువు ఆదిశంకరులే!

 నేడు శంకర జయంతి
శంకరులు జన్మించేనాటికి ఆనాటి సమాజంలో బహుదేవతారాధన విస్తృతంగా కొనసాగుతోంది. శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం ఇలా ఎన్నో మతాలు, వాటి ఉపశాఖలు లెక్కకు మిక్కిలిగా వర్థిల్లుతున్నాయి. ఆయా మతాలు, శాఖలు పరస్పర విరుద్ధంగా చెప్పే విషయాలతో అసలు ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటో, ఆత్మ పరమాత్మ తత్వాల సారమేమిటో, ఏ మతం మంచిదో, ఏ శాఖ చెప్పిన విధానాలను పాటించాలో తెలీని అయోమయ స్థితిలో పడ్డారు సామాన్య ప్రజానీకం. ఆ సమయంలో దశోపనిషత్తుల సారాంశాన్ని రంగరించి శంకరాచార్యులు అద్వైత మతాన్ని స్థాపించారు. ఏ మతాన్ని నిరసించకుండా వారి ఆచారాలను, విధానాలను సంస్కరించి షణ్మత స్థాపకులయ్యారు. ఆయా మతాలన్నిటినీ సమన్వయం చేసి అద్వైతంలో విలీనం చేశారు.

 పండితుల కోసం శంకర భాష్యాలు, సామాన్యుల కోసం సాధనా పంచకం, ఆత్మబోధలాంటి అజరామరమైన రచనలను అందించారు. పామరుల కోసం వేదాంతం తేలిగ్గా అర్థమయ్యేందుకు వారు సులువుగా పాడుకోగలిగేలా భజగోవిందం లాంటివి రచించారు. ఆయన రచించిన సౌందర్యలహరి, శివానందలహరి, కనకధారాస్తోత్రం, మహిషాసుర మర్దినీ స్తోత్రం నేటికీ భక్తులు పాడుకుంటున్నారు. ఇంతేకాదు,  నిర్వాణ షట్కమ్, కౌపీన పంచకం, సాధనా పంచకం, ప్రశ్నోత్తరి, మణిమాల, నిర్వాణ మంజరి, సార తత్త్వోపదేశం, వివేక చూడామణి, వేదాంత డిండిమ, ఆత్మ షట్కమ్, ఆత్మబోధ తదితరాలనూ అందించారు.

 ఇతరులకు హితాన్ని బోధించే వ్యక్తే గురువు. అందుకే ఆస్తికులే కాదు, నాస్తికులు కూడా తమకు హితాన్ని బోధించే నిస్వార్థులైన గురువులనే సేవిస్తారు. మన జీవితంలో ధర్మమనే ఒక అసాధారణమైన శక్తి ఉన్నదని నిరీశ్వరవాదులైన బౌద్ధులు కూడా అంగీకరించారు. అటువంటి ధర్మాన్ని జీవితంలో అనుభవానికి అందించే గురువుకు లౌకిక గురువు కన్నా గొప్ప స్థానం సహజంగానే సిద్ధిస్తుంది. అయితే దురదృష్టవశాత్తూ, అటువంటి ధర్మగురువుల పరంపరలో వచ్చిన కొందరు ‘సంకుచిత దృష్టితో ‘మన మతమే సత్యం, మిగతా అంతా పెడదారులు’ అని ఉపదేశిస్తూ వచ్చారు.

ఫలితంగా ధర్మం పేరిట కూడా రాగద్వేషాదులు అధికం కావడానికి అవకాశం ఉంది కాబట్టి ధర్మాలన్నింటినీ సామరస్యం కావించి చూపే ఒక మహాగురువు అవసరం. మిగతా మతాలన్నింటిని తుడిచేసి, దీక్ష లేక శుద్ధి అనే నెపాలతో అందరినీ తమ మతానికి చేర్చుకొని అన్ని మతాలను ఏకం చేస్తే మతసమన్వయం చేకూరుతుందని ఇప్పుడు చాలా చోట్ల భావిస్తున్నారు. అయితే అదే నిజమైన ధర్మమార్గమని చెప్పడానికి వీలుకాదు. నిజంగా ధర్మం బయటి వేషభాషలకు సంబంధించినది కాదు. అది హృదయానికి చెందినది అని గ్రహించాలి.  శంకర జయంతిని జరుపుకోవడం నేటికీ జరుగుతోంది. అది చాలదా... ఆయనే జగద్గురువని చెప్పడానికి! 
- స్వరూపానందేంద్ర  సరస్వతీ మహాస్వామి,  శ్రీ శారదాపీఠం,  విశాఖపట్నం

 

మరిన్ని వార్తలు