పుణ్యకాల పర్వదినం

14 Jan, 2015 22:32 IST|Sakshi
పుణ్యకాల పర్వదినం

భారతీయులు అందులోనూ దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగువారు చేసుకునే పండగల్లో అతి ప్రధానమైనది సంక్రాంతి. ఈ రోజున తప్పనిసరిగా ఆడపడుచులని, అల్లుళ్లని పిలిచి ఆదరించి ఆత్మీయతని పంచుతారు. కొత్త అల్లుళ్లయితే విధిగా అత్తవారింటికి వచ్చి తీరాలి. ఏడాదంతా ఎక్కడెక్కడున్నా సంక్రాంతికి మాత్రం అంతా స్వగ్రామాలకి చేరుకుంటారు.
 
ఎందుకింతటి ప్రాధాన్యం?

సంక్రాంతి పండుగ సమయానికి దరిదాపుల్లో అన్ని పంటలు ఇంటికి వచ్చి ఉంటాయి. రైతులు మాత్రమే కాక వ్యవసాయ కూలీలు, ఇంకా సరిగా చెప్పాలంటే గ్రామంలో ఉన్న అందరు కూడా పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. పొలం పనులు పూర్తి అయి ఉంటాయి. కొంత కాలం విశ్రాంతి తీసుకునే వీలుంటుంది. దానితో సందడి, సంబరాలు. అందుకే తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమికి, రైతులకి, కూలీలకి, పాలేర్లకి, పశువులకి, పక్షులకి, మొత్తం ప్రకృతికి కృతజ్ఞతను తెలియ చేసుకోవడం, తమ సంపదను సాటివారితో, బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది.
 
ఈ రోజుకే ప్రత్యేకత ఎందుకు?


భారతీయులు సాధారణంగా పాటించేది చాంద్రమానాన్ని. కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. ఈ రెండు మానాల సమన్వయం సంక్రాంతి పండుగ చేసుకోవటంలో కనపడుతుంది. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. దానిని సంక్రమణం అంటారు. మకరరాశిని సంక్రమించినప్పుడు అది మకరసంక్రమణం అవుతుంది. సంవత్సరంలో ఉండే పన్నెండు సంక్రమణాలలో మకరసంక్రమణం ప్రధానమైనది. దీనికి కారణం మకర సంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణ దిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్లుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరు నెలలు ఉత్తరాయణం అంటారు. అంతకు ముందు ఆర్నెల్లు దక్షిణాయనం. దక్షిణాయణాన్ని పితృయానం (పితృ దేవతలు భూలోక వాసులపై అనుగ్రహం కురిపించే కాలం) అని, ఉత్తరాయణాన్ని దేవయానం (దేవతలు అనుగ్రహాన్ని వర్షించే కాలం) అని చెపుతారు. అందుకనే ఈ రోజుని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ పుణ్య సమయంలో చేయవలసిన విధులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని సంక్రాంతి సంబరాల్లో మేళవించడం జరిగింది.
 ఫొటో: వీరభగవాన్ తెలగరెడ్డి
 
 

మరిన్ని వార్తలు