బెట్టు చేస్తున్న కోడి

12 Jan, 2016 00:21 IST|Sakshi
బెట్టు చేస్తున్న కోడి

సమాజం కోరుకోవడం లేదు.
జంతు ప్రేమికులు కోరుకోవడం లేదు. చట్టాలు కోరుకోవడం లేదు.
ఆఖరకు కోళ్లు కూడా మాకొద్దు మొర్రో అని బెట్టు చేస్తున్నాయి. కాని బెట్టు కోసం వీటి బెట్టును తీసి గట్టున పెడుతున్నారు.
 
 ‘కూస్తే అలారం... కోస్తే పలారం’ అని కోడి గురించి చమత్కరించాడో నానుడికారుడు.
 నిజమే. అలారం లేని రోజుల్లో కోడి కూతతోనే సుప్రభాతం అయ్యేది. కోడి లేపితేనే ఊరంతా లేచింది. తెలీని రోజుల్లో ఆదిమానవులు కొండ దేవరతో పాటు కోడి దేవరకు కూడా దండం పెట్టుకునేవారు. అయితే క్రమక్రమంగా భ్రమలు తొలగిపోయాయి. ‘తాను కూయకపోతే తెల్లారదు’ అని బెట్టు చేసినా సూరయ్య సరాసరా అని పైకొచ్చేసేవాడు. ఇంకేముంది? కోడి కూరైపోయింది. కోరిన దేవతకు మొక్కయ్యింది. దిష్టి దింపే పక్షి అయ్యింది. బంధువులకు మర్యాద అయ్యింది. పందెం వేస్తే ప్రాణం ఇచ్చే ప్రాణి అయ్యింది.

 ఆరువేల ఏళ్లుగా...
 మనిషి ఎక్కడైనా మనిషే. కష్టం చేసిన మనిషి వినోదం కోరుకున్నాడు. ఆ వినోదం చుట్టుపక్కల దొరికి ప్రతి ప్రాణిలో వెతుక్కున్నాడు. అన్ని పందేలకు మల్లే కోడి పందేలు కూడా వినోద సాధనంగా మారాయి. పర్షియాలో దాదాపు ఆరువేల ఏళ్లుగా ఇవి ఉనికిలో ఉన్నట్టు చరిత్ర. కాని 17వ శతాబ్దం నుంచి అధికారికంగా నమోదు అవుతున్నాయి. కోళ్ల పందాలు జరిగే దేశాలలో అమెరికా, జపాన్ వంటి అగ్ర రాజ్యాలు ఉన్నా లాటిన్ అమెరికా దేశాల్లో ఇవి విస్తారం. భారత ఉపఖండంలో తూర్పు ఆసియా దేశాల్లో కోళ్లు కొట్టుకోకపోతే మనుషులు కొట్టుకునేంత వెర్రి ఉంది. ఇక తెలుగువారికైతే పల్నాటి చరిత్రే ఉంది.
 
 మనిషికి చెలగాటం... కోడికి ప్రాణసంకటం
 పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లే కోళ్లయందు పందెపు కోళ్లు వేరేగా ఉంటాయి. పందేలకు పనికొచ్చేవి పుంజులే! ఎంత గతి లేని వాళ్లయినా పెట్టలతో పందేలు ఆడరు. పుంజులలో మేలిజాతివాటిని ఏరి కోరి సాకుతారు. జీడిపప్పు, బాదంపప్పు ఖరీదైన దాణా వేస్తారు. జబ్బులు సోకకుండా ఉండటానికి టీకాలు వేయిస్తారు. ఎప్పటికప్పుడు పశువైద్యులతో పరీక్షలు జరిపిస్తారు. ప్రత్యేక శిక్షకుల ఆధ్వర్యంలో వాటి చేత వ్యాయామాలు చేయిస్తారు.
 
  యుద్ధశిక్షణ ఇప్పిస్తారు. బరిలోకి దిగాక హుషారు సన్నగిల్లకుండా ఉండటానికి గొంతులోకి కాస్త ‘చుక్క’ అలవాటు చేస్తారు. ఇలా మేసే పందెం పుంజులు మనుషులను లెక్కజేయవు. లేని గదను ఊహించుకుంటూ సుయోధనుల్లా తిరుగుతుంటాయి. వేళకు కూత పెట్టినా, పెట్టకున్నా యజమానులు వీటిని పల్లెత్తు మాట అనరు. అయితే, ఇదంతా తాత్కాలిక వైభోగమే! పందెంలో గెలవాలి. అప్పుడే మర్యాద. ఓడిందా... వీరమరణం తప్పదు. ఒక్కోసారి పరువు హత్యలు కూడా ఉంటాయి. గెలిచినా ఓడినా పందెం కోడి అంతిమ స్థావరం భోజన ప్రియుల పెద్ద బొజ్జే.
 
 కాకి... నెమలి... డేగ... ఇవన్నీ కోళ్లే!
 పందెం పుంజుల్లో చాలా రకాలు ఉన్నాయి. కాకి, కొక్కిరాయి, నెమలి, డేగ...  పక్షుల స్వభావాలను పోలుస్తూ  రెక్కలు, తోకల రంగుల బట్టి పందెం కోళ్లకు ఇలా నామకరణం చేస్తారు. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా డేగ, కాకి రకాలు ఉంటాయి. ఆ తర్వాత నెమలి, పర్ల ఉంటాయి. ఇవి కాకుడా చవల, సేతువ, పచ్చకాకి, రసంగి, కౌజు, మైల, ఎరుపుగౌడు, తెలుగు గౌడు వంటి రకాలు ఉన్నాయి.
 
 దించుడు పందెం... చూపుడు పందెం...
 కోడి పందేలను నాలుగు రకాలుగా నిర్వహిస్తారు. ఎత్తుడు దించుడు పందెం... చూపుడు పందెం... ముసుగు పందెం... డింకీ పందెం... వీటిలో ఎత్తుడు దించుడు పందేలకే గిరాకీ ఎక్కువ. రెండు పుంజులను బరిలోకి దింపి రెచ్చగొట్టి అవి కయ్యానికి కాలు దువ్విన మరుక్షణం నుంచి పోటీ మొదలైపోతుంది. నిజానికి కోడి యజమానుల కంటే చుట్టూ చేరిన జనాలే ఎక్కువ పందెం కాస్తారు. కత్తుల పందెం అయితే పందెం ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లాంటిది.
 
  క్షణాల్లో ముగిసిపోతుంది. ఆయువుపట్టు మీద మొదటి కత్తిదెబ్బ తాకిన కోడి నెత్తురోడుతూ వీరమరణం పొందుతుంది. రెండో కోడి రెక్కలల్లారుస్తూ విజేతగా నిలుస్తుంది. కత్తుల పందెంలో కోడి గెలుపు ఎక్కువగా అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. కత్తులు లేని పందెమే కోడిపుంజుల శౌర్యప్రతాపాలను నిగ్గుతేల్చే సిసలైన పందెం. ఇది టెస్ట్ మ్యాచ్‌లలాంటిది. ఇలాంటి పందెం చాలాసేపు కొనసాగుతుంది.
 
 కేవులు... తీతలు...
 పందెం కోళ్ల యజమానుల కంటే పందేలు నిర్వహించేవాళ్లే ఈ పోటీల్లో ఎక్కువ లబ్ధిదారులు. ప్రతి పందెంలో వీరు అన్ని పందేల మీద టెన్ పర్సెంట్ కమీషన్ తీసుకుంటారు. దీనినే కేవులు లేదా తీతలు అంటారు. సంక్రాంతి పండుగలో తూ.గో, ప.గో జిల్లాల్లో ఒక్కో బరిలో ఒక రోజంతా సాగే పందేల్లో నిర్వాహకులకు వచ్చే తీతలే పది నుంచి ముప్పై లక్షలు ఉంటుందని అంచనా. వీళ్లు కాకుండా లబ్ధి పొందేవాళ్లు ఇంకొకరున్నారు.
 
  వీళ్లే రూస్టరాలజిస్టులు. అనగా కుక్కుట శాస్త్రవేత్తలు. అంటే పందెం కోళ్ల స్పెషలిస్టులన్న మాట. వీరు బరులన్నీ తిరుగుతూ ఏ రకం కోడిని ఏ రోజు పందెంలో నిలబెడితే గెలుస్తుందో  ఏ రకం కోడిని బరిలో ఏ దిక్కున నిలబెడితే గెలుస్తుందో  ఈకకు ఈక పరిశీలించి, పంచాంగాలను ‘కోడీ’కరించి మరీ చెబుతారు. ఇలా చెప్పినందుకు భూరి సంభావనలు పుచ్చుకుంటారు. జోస్యం ఫలిస్తే అది తమ ప్రతాపంగా, వికటిస్తే అది సదరు కోడి యజమాని గ్రహచారంగా చెప్పి తప్పించుకుంటారు. నిజానికి కోడి పందేల సీజన్‌లో పందెం బరి దరిదాపుల్లోనైనా కనిపించని ఇలాంటి కుక్కుటేశ్వర స్వాములే సిసలైన విజేతలు!
 
 దుష్ట సంప్రదాయం...
 నిజంగా వినోదం ఏదైనా స్థాయి మించకపోతే వినోదంగానే ఉంటుంది. రెండు పుంజులు రెండు మూడు నిమిషాల పాటు కాలు దువ్వుకుంటే దేని ప్రాణమూ పోదు. మరు నిమిషం విడిపోయి అవి తమ దారిన తాము పోతాయి. కాని పందెం పెట్టడం వల్ల ఒకటి చావాల్సిన... ఇంకోటి బతకాల్సిన అగత్యం వస్తోంది. దీని కోసం కోళ్లకు స్టెరాయిడ్లు ఇచ్చేవాళ్లు ఉన్నారు.
 
  పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవాళ్లు ఉన్నారు. కత్తులకు విషాలు పూసి ఎదుటి పక్షిని విషగ్రస్తం చేసేవాళ్లు ఉన్నారు. ఇవన్నీ సరదాగా సాగాల్సిన పల్లె పందేల్ని కోడి పందేల్లి హింసాత్మకం చేస్తున్నాయి. కాని మానవుల అభిరుచుల్ని చట్టాలు నియంత్రించలేవు. ఇంగ్లాండుతో సహా అనేక దేశాల్లో కోడి పందేలను నిషేధించినా ఎక్కువ తక్కువగా అవి సాగుతూనే ఉన్నాయి. సాగుతాయి కూడా!
 - సాక్షి ఫ్యామిలీ
 

మరిన్ని వార్తలు