రారండోయ్‌ వంటలు చేద్దాం

11 Jan, 2020 00:47 IST|Sakshi

ఇరుగమ్మా పొరుగమ్మా రండి. పిన్నిగారూ బామ్మగారూ రండి. చిన్నారి పొన్నారి రారండి. సంక్రాంతి వస్తోంది. సంబరాలు తెస్తోంది. బంధువులు వస్తారు. సందడి చేస్తారు. పొయ్యి వెలిగిద్దాము. సాయం పడదాము. వంటలు చేద్దాము. విందారగిద్దాము. రారండోయ్‌ వంటలు చేద్దాం...

నువ్వుల బొబ్బట్లు
కావలసినవి: నువ్వులు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; మైదా పిండి – అర కప్పు; గోధుమ పిండి – అర కప్పు; ఉప్పు – చిటికెడు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఏలకులు – 2

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నువ్వులు వేసి దోరగా వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
►ఏలకులు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి
►బెల్లం పొడి జత చేసి అన్నీ కలిసేలా మిక్సీ పట్టాలి
►ఒక పాత్రలో మైదాపిండి, గోధుమపిండి, చిటికెడు ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జతచేస్తూ మెత్తగా చపాతీపిండిలా కలుపుకోవాలి
►రెండు టీ స్పూన్ల నెయ్యి జత చేసి మరోమారు కలిపి మూత ఉంచి, పది నిమిషాలపాటు పక్కన ఉంచాలి
►పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, ఒక్కో ఉండ ను చిన్న సైజు పూరీలా ఒత్తి, అందులో నువ్వులు బెల్లం మిశ్రమం ఉంచి, అంచులు మూసేసి, చపాతీలా వత్తాలి
►ఇలా అన్నీ తయారు చేసుకోవాలి
►స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, ఒక్కో బొబ్బట్టుకు, నెయ్యి వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి
►వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.

దబ్బకాయ పులిహోర
కావలసినవి: బియ్యం – అర కేజీ; నూనె – 100 గ్రా.; దబ్బకాయ రసం – అర కప్పు, పచ్చి సెనగపప్పు – టేబుల్‌ స్పూను; మినప్పప్పు – టేబుల్‌ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఎండు మిర్చి – 10; పచ్చిమిర్చి – 5 (సన్నగా పొడవుగా తరగాలి); కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – అర టీ స్పూను; పల్లీలు – 100 గ్రా; జీడిపప్పులు – 10 గ్రా.

తయారీ:
►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి
►వేడిగా ఉండగానే అన్నాన్ని ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని, ఉప్పు పసుపు జత చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పల్లీలు, జీడిపప్పు జత చేసి దోరగా వేయించాలి
►పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి మరోమారు వేయించాక, అన్నం మీద వేసి కలియబెట్టాలి
►దబ్బకాయ రసం వేసి మరోమారు బాగా కలిపి, ఒక గంట సేపు బాగా ఊరిన తరవాత తింటే రుచిగా ఉంటుంది.

పాకం గారెలు
కావలసినవి: మినప్పప్పు – అర కేజీ; బెల్లం/పంచదార – అర కేజీ; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను

తయారీ:
►మినప్పప్పును ముందు రోజు రాత్రి నానబెట్టాలి
►మరుసటి రోజు ఉదయం, నీళ్లు ఒంపేసి, మినప్పప్పును గ్రైండర్‌లో వేసి గట్టిగా రుబ్బుకోవాలి
►స్టౌ మీద నూనె కాగాక, పిండిని గారెల మాదిరిగా వేసుకుని, రెండువైపులా ఎర్రగా కాలిన తరవాత కిచెన్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి
►ఒక పెద్ద గిన్నెలో బెల్లం తురుము/పంచదారకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి
►ఏలకుల పొడి, నెయ్యి జత చేసి మరోమారు కలిపి దింపేయాలి
►వేయించి ఉంచుకున్న గారెలను ఈ పాకంలో వేసి సుమారు అరగంట సేపు తరవాత తింటే, రుచిగా ఉంటాయి.

నువ్వుల పులగం
కావలసినవి: బియ్యం – ఒక కప్పు; బెల్లం తురుము – ఒక కప్పు; వేయించిన నువ్వుల పొడి – అర కప్పు; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; శొంఠి పొడి – అర టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ:
►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి
►బియ్యాన్ని శుభ్రంగా కడిగి, మరుగుతున్న నీళ్లలో వేసి బాగా కలియబెట్టి, నువ్వుల పొడి కూడా జతచేసి మరోమారు కలిపి, మూత ఉంచాలి
►బాగా ఉడికిన తరవాత బెల్లం తురుము జత చేయాలి
►శొంఠి పొడి, ఏలకుల పొడి, నెయ్యి జత చేసి కలియబెట్టాలి
►పైన నెయ్యి, ఎండు కొబ్బరి తురుము వేసి వేడివేడిగా అందించాలి.

నువ్వుల పచ్చడి
కావలసినవి: నువ్వులు – 100 గ్రా.; చింత పండు – 100 గ్రా.; బెల్లం పొడి – 100 గ్రా.; ఎండు మిర్చి – 50 గ్రా.; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; నూనె – 50 గ్రా.; ఉప్పు – తగినంత

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా నువ్వులు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి
►అదే బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి
►అదే బాణలిలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి
►ఒక గిన్నెలో చింతపండుకు తగినన్ని నీళ్లు జత చేసి, ఉడికించి, చల్లారాక మెత్తగా గుజ్జు తీసి పక్కన ఉంచాలి
►వేయించి పెట్టుకున్న మినప్పప్పు మిశ్రమం మిక్సీలో ముందుగా వేసి మెత్తగా చేయాలి
►నువ్వులు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి
►చింత పండు గుజ్జు, బెల్లం తురుము, ఉప్పు జత చేసి అన్నీ బాగా కలిసేలా మెత్తగా చేసి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి
►వేయించి ఉంచుకున్న ఆవాలు మిశ్రమం జత చేసి బాగా కలపాలి
►గారెలలోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు