ప్రతి అడుగు ఒక పర్యటనే

28 Jan, 2019 00:07 IST|Sakshi

కళ్లు తెరిచి చూస్తే... భౌతిక రూపాలు కనిపిస్తాయి. మనసుతో చూస్తే... అచ్చమైన ఆర్ద్రత కళ్లకు కడుతుంది. మనోనేత్రంతో చూస్తే... స్వచ్ఛమైన జీవితాలు కనిపిస్తాయి. జీవితాలను చూడటం... జీవించడంలో అందాన్ని చూడటమే తన పర్యటనల ఉద్దేశం అంటారు  కవిత బుగ్గన.

ఈ ఏడాది... భారతీయ నాట్య కళాకారిణి మృణాళినీ శారాబాయ్, ప్రముఖ ఉర్దూ కవి కైఫీ అజ్మీల శత జయంతి. దేశం ఇప్పటికే జాతిపిత మహాత్మాగాంధీ నూటయాభయ్యవ జయంతి ఉత్సవాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌.. 2019లో శుక్రవారం (జనవరి, 25) నాడు తన తొలి పుస్తకాన్ని ఆవిష్కరించారు కవిత బుగ్గన. ‘వాకింగ్‌ ఇన్‌ క్లౌడ్స్‌: ఎ జర్నీ టు మౌంట్‌ కైలాస్‌ అండ్‌ లేక్‌ మానససరోవర్‌’ అనే ఆ రచనను వెలువరించడానికి ముందు మూడు దశాబ్దాల ఆమె అధ్యయనం ఉంది. శ్రీలంక, నేపాల్, టిబెట్, లెబనాన్, రుమేనియా, ఇటలీ, ఫ్రాన్స్, యునైటెడ్‌ కింగ్‌డమ్, అమెరికా, కెనడా, స్పెయిన్, చైనా, జపాన్, కంబోడియా, మయన్మార్, థాయ్‌లాండ్, టాంజానియా దేశాల్లో పర్యటించారామె.

ఆ పర్యటనల్లో మనిషి జీవితాన్ని చూశారామె. పరిస్థితులు జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పుతాయో కాంబోడియా పర్యటనలో తెలుసుకున్నారు. రిషి వ్యాలీ స్కూల్‌ ఆమెకు అక్షరాలను, పాఠాలను చదవడంతోపాటు ప్రపంచాన్ని చదవడం కూడా నేర్పించింది. అన్నింటికంటే ముందు ప్రశ్నించడం నేర్పించింది. ఆ లక్షణమే ఆమెను మానసరోవర్‌ యాత్రలో రాక్షస్‌ తాల్‌ నీటిని తాగించింది. రాక్షస్‌ తాల్‌ విషపు నీటి మడుగు అనే మూఢనమ్మకాన్ని తుడిచేయడానికి తన వంతు ప్రయత్నం చేయించింది. పర్యటన అంటే... ప్రదేశాలను కళ్లతో చూడటం కాదు, పరిస్థితులను మనోనేత్రంతో చూడటం అంటూ.. తన అనుభవాలను, అనుభూతులను సాక్షితో పంచుకున్నారు కవిత.

‘‘నేను ఎక్కడికి వెళ్లినా టూర్‌ ఆపరేటర్‌లు రూపొందించిన ఐటెనరీలో వెళ్లను. ఆ టూర్‌లు... మనకు కట్టడాలను చూపిస్తాయి, వస్త్ర దుకాణాలను చూపిస్తాయి, స్థానికంగా తయారయ్యే హ్యాండీక్రాఫ్ట్స్‌ను మన చేత కొనిపించడానికి ప్రయత్నిస్తుంటాయి. నేను చూడాలనుకునేది చరిత్రను తెలిపే గొప్ప నిర్మాణాలతోపాటు అక్కడి ప్రజల జీవితాన్ని కూడా. అందుకే వెళ్లిన ప్రతి చోట మొదట మార్కెట్‌కు వెళ్తాను. అక్కడి పండ్లు, కూరగాయలను చూస్తే ఆ నేలల్లో ఏం పండుతాయో తెలుస్తుంది. ఆహారపు అలవాట్లు అర్థమవుతాయి. వర్క్‌ ప్లేస్, వర్షిప్‌ ప్లేస్‌లు మనుషుల ఇష్టాలు, విశ్వాసాలను చెప్పేస్తాయి. 

కైలాస విశ్వాసాలు
మానస సరోవర్, మౌంట్‌ కైలాస్‌ పర్యటన... హిందూ, బౌద్ధ, జైన, బాన్‌ మత విశ్వాసాలకు ప్రతీక. కైలాస్‌ పర్వతం మీదకు వెళ్లిన తర్వాత కొందరు తిరిగి రావడానికి ఇష్టపడరని తెలిసినప్పుడు ఆశ్చర్యం వేసింది. ప్రాణం పోయే వరకు అక్కడే ఉండాలనుకునే వాళ్లు కూడా ఉంటారు. బుద్ధ పూర్ణిమ రోజున టిబెట్‌ నలుమూలల నుంచి ప్రజలు, బౌద్ధ సన్యాసులు పెద్ద సంఖ్యలో కైలాస పర్వతానికి వచ్చి, బౌద్ధ శాక్యముని వర్ధంతి, సాగదేవ జయంతిని కీర్తనలు, ప్రార్థనలతో  దీక్షగా నిర్వహిస్తారు. కైలాస పర్వతాన్ని హిందువులు శివపార్వతుల క్షేత్రంగా భావిస్తారు. బౌద్ధులు చక్రసంవర, వజ్ర విరాహిలను కొలుస్తారు.

మహాయాన బౌద్ధంలో వజ్రయానం అక్కడ ప్రాక్టీస్‌లో ఉంది. నా పర్యటన ఆద్యంతం చిన్న చిన్న గ్రామాల గుండా సాగింది. అక్కడ కరెంటు లేదు. ఆధునిక ఉపకరణాల్లేవు. స్థానిక గిరిజనులు ఏ మాత్రం సమతలంగా లేని ఎగుడుదిగుడు నేలలోనే వ్యవసాయం చేస్తారు. అనువైన పరిస్థితులు లేవని చింత వారిలో ఏ మాత్రం కనిపించదు. అటవీ ఉత్పత్తులను సేకరించి మైదాన ప్రదేశాలకు వెళ్లి అమ్ముకుంటారు. ‘ప్రకృతి మనకు ఏమి ఇస్తుందో అంతే తీసుకోవాలి, అంతలోనే జీవితాన్ని చక్కదిద్దుకోవాల’నే ఫిలాసఫీ కనిపిస్తుంది. అంతే తప్ప తమ జీవిక కోసం ప్రకృతికి హాని కలిగించరు. 

మన గూర్ఖాలు
కర్నాలి నది నేపాల్‌లో పొడవైన నది. మానససరోవర్‌ ప్రదేశంలో మొదలైన ప్రవాహం మనదేశంలో గంగానదిలో కలుస్తుంది. మ్యూల్‌ గుర్రాలు ప్రశాంతంగా పచ్చిక బయళ్లలో మేస్తూ ఉంటాయి. స్థానికులు అడవి గేదెలు, మేకలను పెంచుకోవడం కనిపిస్తుంది. రాళ్లు పలకలుగా ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో ఆ రాతి పలకలనే సిమెంట్‌ బెంచీలుగా అమరుస్తారు. స్కూలు పిల్లలు ఆ రాతి బెంచీల మీద కూర్చుని హోమ్‌వర్క్‌ చేసుకోవటం చూసినప్పుడు మనిషి పరిస్థితులకు అనుగుణంగా తనను తాను ఎలా మలుచుకుంటాడో కదా అనిపించింది. కర్నాలి నది నీళ్లు మరకతాల పచ్చదనాన్ని, నీలాల నీలివర్ణాన్ని కలుపుకుని వజ్రంలా మెరుస్తుంటాయి. నా ప్రయాణం ‘హమ్లా’ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న సెటిల్‌మెంట్‌ల మీదుగా సాగింది. అన్నీ బంకమట్టి, బండరాళ్లతో కట్టిన చిన్న చిన్న ఇళ్లు. పై కప్పు మీద గడ్డి పరుస్తారు.

పర్వతాల నుంచి వచ్చే పెనుగాలుల నుంచి రక్షణ కోసం అలా కట్టుకుంటారు. ఓ సెటిల్‌మెంట్‌లో మమ్మల్ని (బృందంలో ఉన్న కజిన్‌ పల్లు, ప్రార్థన, జెఫ్, కేటీ ) చూసి ‘ఇండియా ఇండియా’ అని అరిచారు పిల్లలు. ఒక వ్యక్తి ‘ఇండియాలో ఎక్కడ’ అని హిందీలో అడిగాడు. ‘హైదరాబాద్‌’ అని చెప్పాం. కానీ వీళ్లకు హైదరాబాద్‌ ఎలా తెలుస్తుంది అనుకున్నాను. ఆశ్చర్యంగా ‘తెలుగా’ అని అడిగాడతడు. నాకు నోట మాట రాలేదు. ‘అవును’ అనగానే అతడు తెలుగులో ‘మీ పేరేంటి’ అని అడిగాడు. నేను తేరుకుని ‘మీకు తెలుగు ఎలా వచ్చు’ అని అడిగితే... అప్పుడు... తాను విశాఖపట్నంలో గూర్ఖాగా పనిచేశానని. ఇక్కడి గ్రామాల వాళ్లు చాలా మంది ఉపాధి కోసం ఇండియాలో అనేక నగరాలకు వస్తుంటామని చెప్పాడతడు. 

భిక్షతో ఆత్మశుద్ధి
థాయ్‌లాండ్‌లో బౌద్ధాశ్రమాన్ని చూడటంతోపాటు బౌద్ధ సన్యాసుల జీవనశైలిని అనుసరించాను. ఉదయమే లేచి వాళ్ల వెనుక గ్రామాల్లోకి భిక్షకు వెళ్లడం... మన ఆత్మను శుద్ధి చేస్తుంది. మనలోని అహాన్ని చంపేస్తుంది. అహాన్ని చంపేయడంలో బౌద్ధాన్ని మించిన మతం మరోటి ఉండదనే చెప్పాలి. శ్రీలంక, బర్మాతోపాటు దక్షిణాసియా దేశాల్లో తెరవాద బౌద్ధం విస్తృతంగా ఉంది. చైనా, జపాన్, ఉత్తర ఆసియా దేశాల బౌద్ధులు అనుసరించే మతం మహాయాన బౌద్ధం. టిబెట్‌లో బౌద్ధాన్ని దగ్గరగా చూడగలిగాను. తొలినాటి బౌద్ధం చెప్పని తాంత్రికత ఆచరణలో ఉందక్కడ. ఇక టిబెట్‌లో కుక్కలైతే... చూడగానే భయమేస్తుంది. సింహాలంత ఉంటాయి. మనుషుల్ని తినేస్తాయి కూడా. ఇక్కడ పరిమితికి మించి మైనింగ్‌ చేయడం వల్ల మట్టి వదులై తరచూ కొండ చరియలు విరిగిపడుతుంటాయి. అది గోల్డ్‌ మైనింగ్‌ అని చెప్పాడు మా గైడ్‌ చిరింగ్‌. 

రాక్షసుల సరస్సు
మానçసరోవర్‌తోపాటు రాక్షస్‌ తాల్‌ అనే మరో సరస్సు కూడా ఉంది. మానసరోవరం వలయాకారంగా ఉంటే, రాక్షస్‌తాల్‌ అర్ధ చంద్రాకారంలో ఉంది. వీటిని సూర్యచంద్ర సరస్సులు అని కూడా అంటారు. రాక్షస్‌ తాల్‌లో నీరు విషపూరితమని చెబుతారు. శివుని కోసం రావణుడు తపస్సు చేసింది ఈ సరస్సు తీరానే అని హిందువులు చెబుతారు. రావణుడి కారణంగానే అది విషపూరితమైందని, రాక్షస సరస్సుగా పేరు రావడానికి కారణం కూడా రావణుడు తపస్సు చేయడమేనని, ఆ నీటిని తాగితే చచ్చిపోతారని చెబుతారు. మానసరోవరం దేవతల సరస్సు కాబట్టి అందులో నీటిని తాగవచ్చు, ఆ నీటిలో మునిగితే పుణ్యం ప్రాప్తిస్తుందని విశ్వాసం.

పుణ్యం ప్రాప్తించడం అనే నమ్మకం వల్ల ఎవరికీ నష్టం ఉండదు, కానీ ఒక సరస్సును విషపూరితమని ప్రచారం చేయడం ఏమిటి... అనిపించింది. అందుకే కప్పుతో రాక్షస్‌ తాల్‌ నీటిని ముంచుకుని తాగాను. నీరు చల్లగా, శుభ్రంగా ఉన్నాయి. అయితే కొద్దిగా ఉప్పగా ఉన్నాయి. తాగడానికి అనువుగా లేని నీరు అనే కారణంగా విషపూరితం అనీ, రాక్షసుల సరస్సు అని, రావణుడి కారణంగానే ఇలా జరిగిందనే అపోహలతో కథనాలను సృష్టించడం ఎందుకు అని కూడా అనిపించింది. నాతో ఉన్న పల్లు ఆ నీటిని ఎందుకు తాగావని కోప్పడింది. ‘ఆ నీరు విషపూరితమనేది అపోహ మాత్రమే’ అని నిరూపించడానికే అన్నాను. అంతే కాదు, ఆ సరస్సు తీరాన మెడిటేషన్‌ కూడా చేశాను’’.

యుద్ధం నుంచి జీవితం
పర్యటనలన్నింటిలో జీవితం పెట్టే పరీక్షలను ఎదుర్కొని నిలబడిన కంబోడియా మహిళ నన్ను ముగ్ధురాలిని చేసింది. ఖ్మేర్‌ పాలనలో ప్రజాజీవనం అస్తవ్యస్తం అయింది. తినడానికి తిండి దొరకని పరిస్థితి, ఎప్పుడు దాడులు జరుగుతాయోననే భయానక వాతావరణం. సైనిక దాడిలో ఒక కుటుంబంలో యజమాని మరణించాడు. ఆ దాడిని ప్రత్యక్షంగా చూసిన అతడి భార్య పిచ్చిదైపోయింది. పదకొండేళ్ల కొడుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎటో వెళ్లిపోయాడు. ఇక మిగిలింది ఐదేళ్ల అక్క, మూడేళ్ల చెల్లి. ఆ చెల్లిని బతికించుకోవడం ఆ అక్క బాధ్యత. మార్కెట్‌లో పారేసిన పండ్లు, కూరగాయలను ఏరి పాడై పోయిన వరకు తీసేసి బాగున్న భాగాన్ని తిని కడుపు నింపుకోసాగారు.
కొన్నాళ్లకు సైనికులు ఆ మార్కెట్‌ను కాల్చేశారు. మూడేళ్ల చెల్లి ఆచూకీ లేదు. ఇక మిగిలింది తానొక్కటే. మార్కెట్‌ ఆధారం కూడా లేకుండా తనను తాను బతికించుకోవాలి. యుద్ధంలో అనాథలైన పిల్లలకు ఆశ్రయమిస్తున్న బౌద్ధారామానికి వెళ్లిందా ఐదేళ్ల అమ్మాయి. ఆడపిల్లలకు అనుమతి లేదన్నారు. తన కళ్ల ముందే మగపిల్లలను తీసుకెళ్లడం కనిపిస్తోంది. మగపిల్లాడిలా దుస్తులు మార్చుకుని ఆశ్రమంలో చేరిపోయింది. పదమూడేళ్ల వరకు ఇబ్బంది రాలేదు. అమ్మాయి అనే వాస్తవం బయటపడే వయసది.

అప్పుడు ఆశ్రమ పెద్ద పిలిచి జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలనుకుంటున్నావు– అని అడిగారామెని. ‘చాలా భాషలు నేర్చుకోవాలనుంది’ అని చెప్పింది. ఒక సన్యాసి ఆమెకి ఒక బంగారు పళ్లెం ఇచ్చి, వృద్ధ దంపతుల సంరక్షణలో ఉంచారు. అలా పెరిగిన మహిళ ఇప్పుడు ఆంగ్‌కోర్‌వాట్‌లో ఒక కేఫ్, స్టోర్‌ నడుపుతోంది. సోషల్‌ వర్క్‌ చేస్తోంది. బయోగ్రఫీ రాస్తే ‘ప్లేట్‌ ఆఫ్‌ గోల్డ్‌’ అని పేరు పెడతానని చెప్పిందామె. జీవితాన్ని నిలబెట్టుకోవాలనే ఆకాంక్ష ఉంటే ఎన్ని ప్రతికూలతలు ఉన్నా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అని అర్థమైంది. 

తాత్విక జీవనం
నెల్లూరులో పుట్టి, అమెరికాలోని వాషింగ్టన్‌లో పెరిగి, రిషివ్యాలీ స్కూలుకు వచ్చి ఆధ్యాత్మిక తత్వాన్ని ఒంటబట్టించుకున్నారు కవిత బుగ్గన. ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎకనమిక్స్‌లో ఎంఫిల్‌ ఇవ్వని సంతృప్తిని ప్రపంచాన్ని చదవటంలో పొందుతున్నారామె. భర్త హరి బిజినెస్‌మన్‌. పిల్లలు ప్రణవ్, రోహన్‌ యుఎస్‌లో చదువు కుంటున్నారు. ఆధ్యాత్మికత అంటే జీవితం నుంచి, సమాజం నుంచి వెళ్లిపోవడం కాదు... చేసే పనిలో కరుణను నింపుకోగలిగితే అది ఆధ్యాత్మిక జీవనమేనన్నారు.

మరిన్ని వార్తలు