భర్త కాటుకు భలే దెబ్బ

10 Jan, 2017 23:16 IST|Sakshi
భర్త కాటుకు భలే దెబ్బ

అసలు సామెత.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
భర్తలు మనుషుల్లా ప్రవర్తించకపోతే..
కరవడం దాకా ఎందుకు.. మొరిగినా చాలు
చట్టం ‘గొలుసు’తో కట్టేస్తుంది!
ఆ తర్వాత కూడా తోక ఆడిస్తే..
దెబ్బ వేస్తుంది. గృహహింస నుంచి బంగారు తల్లులను రక్షించడానికిది..
భలే చట్టం.


ఉసూరుమంటూ గేటు తీసి, కాంపౌండ్‌లోకి వచ్చింది ఉష. రెండు బస్సులు మారి రావడంతో ఒళ్లు హూనమైపోనట్లయింది.వరండాలో పిల్లలు బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉన్నారు. ‘ఏమ్మా డాలీ.. ఇంట్లోకి ఎందుకు వెళ్లలేదు?’ అని కూతుర్ని అడిగింది. ‘డాడీ పక్కింటి ఆంటీకి కీస్‌ ఇవ్వలేదటమ్మా! తమ్ముడికి ఆకలేస్తోందట.. నీ కోసం వెయిట్‌ చేస్తున్నాం’ అంది కూతురు. తల్లి మనస్సు తల్లడిల్లింది. తాళం తీసి ఇంట్లోకి వెళ్లింది. లైట్‌ వేసింది. వెలగలేదు! వీధిలో అందరికీ కరెంట్‌ ఉంది. వాచ్‌మెన్‌ని అడిగితే, ‘ఈ నెల కరెంటు బిల్లు కట్టలేదటమ్మా.. డిపార్ట్‌మెంట్‌వాళ్లొచ్చి మధ్యాహ్నమే కట్‌ చేసి వెళ్లారు’ అని చెప్పాడు. ‘ఈ ఫోన్‌కి కాల్‌ చేస్తే అతనొచ్చి బిల్లు కట్టించుకుని కనెక్షన్‌ ఇస్తాడంట’ అని.. ఫోన్‌ నెంబర్‌ రాసి ఉన్న స్లిప్పు ఇచ్చాడు. బిల్లును చూసుకుంది ఉష. గాడ్‌! వెయ్యి రూపాయలు. నెలాఖరు రోజులు. అంత డబ్బెలా కట్టాలి? ఇల్లంతా వెతికి వెతికి చిల్లర జమ చేసి, పక్కింట్లోంచి కొంత చేబదులు తీసుకుని వెంటనే  కరెంట్‌ కనెక్షన్‌ ఇప్పించుకుంది.

స్వర్గసీమను నరకం చేశాడు!
బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది ఉష. అందులోని వాష్‌రూమ్‌కి తాళం వేసి ఉంది! బుర్ర తిరిగిపోయింది. దేవుడా అనుకుంది. తిరిగి పిల్లల రూమ్‌లోకి వచ్చింది. ‘అమ్మా.. ఆకలి’.. కడుపు చేత్తో పట్టుకుని తల్లి చెంతకు వచ్చాడు కొడుకు. ‘అయిపోతుందమ్మా... స్నాక్స్‌ చేస్తున్నాను’ అంటూ మిక్సీ దగ్గరకు వెళ్లింది. వైర్‌ కట్‌ అయిపోయి కనిపించింది మిక్సీ! అరె, మాయగా ఉందే అనుకుంది ఉష.. అలసటని, చికాకుని దాచుకునే ప్రయత్నం చేస్తూ. రిఫ్రెష్‌ అవ్వకుండా.. అప్పటికప్పుడు వేడివేడిగా ఉప్మా చేసి పెట్టి పిల్లల ఆకలి చల్లార్చింది. తర్వాత కుక్కర్‌ పెట్టడానికి బియ్యం డబ్బా తెరిచింది. ఫ్చ్‌. బియ్యం లేవు! ఉదయమే చెప్పి వెళ్లింది కిశోర్‌కి, బియ్యం తెచ్చిపెట్టమని. తేలేదన్నమాట. పిల్లలు హోమ్‌ వర్క్‌ చేసుకుంటున్నారు. ‘అమ్మా.. స్కూల్‌ ఫీజ్‌కి రేపే లాస్ట్‌ డేట్‌’.. కూతురు గుర్తుచేసింది. ఒక్కక్షణం తనవన్నీ సినిమా కష్టాల్లా అనిపించాయి ఉషకి. అంత ఒత్తిడిలోనూ తనను తను సముదాయించుకుంటోంది. ‘అలాగే అమ్మా..’ అని చెప్పి బాత్రూమ్‌లోకి వెళ్లింది. అర్జెంటుగా తనిప్పుడు స్నానం చెయ్యాలి. వేణ్ణీళ్లతో స్నానం చేస్తే కాస్త రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. పిల్లల బాత్రూమ్‌లో గీజర్‌ లేదు. మాస్టర్‌ బెడ్‌రూమ్‌లో మాత్రమే ఉంది. దానికి తాళం వేసి ఉంది. ఆలోచనలో పడిపోయింది ఉష. ఇదంతా కిషోర్‌ చేస్తున్న పని కాదు కదా, ఉద్దేశపూర్వకంగానే తను ఇలా చేస్తున్నాడా అనుకుంది. కొన్నాళ్లుగా భర్త కిషోర్‌ ప్రవర్తనలో మార్పును గమనిస్తోంది ఉష.

ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు
పైన రెండు గదులు కట్టించి అద్దెకు ఇవ్వాలని కిశోర్‌ అంటున్నాడు. ఆ అనడం క్రమంగా సతాయింపుగా మారుతోంది. సతాయింపు కొన్నిసార్లు వేధింపు స్థాయిని అందుకుంటోంది! ఉష పేరు మీద ఉన్న ప్లాట్‌ని అమ్మించి, ఇప్పుడున్న ఇంటిపై గదులు కట్టించాలని కిశోర్‌ ఒత్తిడి తెస్తున్నాడు. ఇదే విషయమై తరచు గొడవ పడుతున్నాడు. ఆ ప్లాట్‌ని అమ్మడం ఉషకు ఇష్టం లేదు. ముందుముందు పిల్లల చదువులకు పనికొస్తుందని ఆమె ఆశ. పైగా వాళ్లుంటున్న ఏరియాలో అద్దెలు కూడా ఎక్కువగా రావు. ఆ మాట అంటే కిశోర్‌ వినడం లేదు. పైగా కోపం తెచ్చుకుంటున్నాడు. కిశోర్‌ మొండితన ం గురించి ఉషకు తెలియంది కాదు కానీ, ప్లాటు విషయమై పట్టినపట్టు విడవకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. అస్తమానం పిల్లల ముందు గొడవపడితే ఆ పసి మనసులు కల్లోలం అయిపోతాయేమోనన్న భయంతో అన్నిటికీ ఓర్చుకుని నెట్టుకొస్తోంది. వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడవుతాయని.. చిన్న ఉద్యోగం వస్తే, ఇరవై కిలోమీటర్ల దూరమే అయినా వెళ్లి వస్తోంది. ఆ ఉదయం మళ్లీ గొడవైంది. ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు. తేలిగ్గా తీసుకుని ఆఫీసుకు వెళ్లిపోయింది. తనూ మొండి వైఖరి ప్రదర్శిస్తే మొదటికే బంధం తెగిపోవచ్చు. అందుకుని అడ్జెస్ట్‌ అవుతోంది. ఇదిగో... ఇప్పుడు ఇంటికొచ్చేటప్పటికీ ఇలా ఉంది పరిస్థితి.

పిల్లలు వింటున్నారన్నా వదల్లేదు!
రాత్రి బాగా లేట్‌గా వచ్చాడు కిశోర్‌. ‘అబ్బో కరెంట్‌ తెప్పించుకున్నావే! భేష్‌. ఎంతైనా సంపాదనాపరురాలివి కదా’ అన్నాడు. ప్లేట్‌లో అందించిన చపాతీలను విసిరికొట్టి, ‘ఏం? బియ్యం తెప్పించుకోలేదా?’ అని పెద్దగా అరిచాడు. పిల్లలు వింటారు అన్నట్లు అతడి వైపు చూసింది ఉష. ‘ఇక మీదట ఇంటి ఖర్చులకూ నాకూ ఏ సంబంధమూ లేదు. నేను బయట తినొస్తాను. నా మాటా వినని వారు నా ఇంట్లో  ఉండకూడదు’ అని పెద్ద గొడవ చేశాడు. ‘పిల్లలు వింటున్నారు. మెల్లిగా మాట్లాడండి’ అని ప్రాధేయపడింది ఉష. కిశోర్‌ వినలేదు. ‘నా అరుపులే కదా ఇప్పటి వరకు పిల్లలు విన్నారు. ఇప్పుడు నీ అరుపులు వింటారు చూడు’ అంటూ చప్పున బెల్టు తీసి ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. ఉష అరవలేదు. బాధను అదిమి పెట్టుకుంది. అది ఇంకా కోపం తెప్పించింది కిశోర్‌కు. పిడికిలి బిగించి ఆమె ముఖం మీద కొట్టాడు. ‘అమ్మా’ అని అరిచింది ఉష. ఆ పెదవుల మధ్య తడిగా.. ఉప్పటి స్పర్శ! వేలితో తడుముకుంది. రక్తం!!

ఆర్థికంగా.. మానసికంగా.. శారీరకంగా...
రాత్రంతా నిద్ర పోలేదు ఉష. ఆమె దేహం దెబ్బతింది. ఆమె ఆత్మాభిమానం దెబ్బతింది.  ఈ రెండిటి కన్నా కూడా.. భర్తతో ఆమె అనుబంధం దెబ్బతింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తల్లిదండ్రులతో పిల్లల బంధం దెబ్బతింటుంది. ఆలోచనలు ఉషను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఇంటి కోసం ఒక్క పనీ చేయడం లేదు కిశోర్‌. అంతేకాదు, ఇంట్లోని వస్తువులను వాడుకోనివ్వడం లేదు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. భర్త కారణంగా ఆఫీసు నుంచి ఇంటికి రావడానికే భయం వేస్తోంది ఉషకు. తనపై కోపంతో, పగబట్టినట్లు బిహేవ్‌ చేస్తున్నాడు కిశోర్‌. అతని ఇష్ట ప్రకారమే ప్లాటు అమ్మేసి, ఇంటిపైన గదులు వేయించినా అతడు మారతాడనేం లేదు. అప్పుడు ఇంకొకటేదో మొదలుపెడతాడు. ‘అద్దెల మీద బతికేయెచ్చు’ అని కిశోర్‌ తరచు అనేమాట చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఉషకు. ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నదో చితకదో తనూ చేస్తోంది. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు చేస్తే.. తమకేం తక్కువని! ప్లాటు ఎలాగూ ఉంటుంది. ఉండేది అలా ఉండిపోదు కదా. వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇవేవీ కిశోర్‌ తలకు ఎక్కడం లేదు. తెల్లవారుతుండగా ఒక నిర్ణయానికి వచ్చింది ఉష. ఆఫీస్‌లో లేట్‌ పర్మిషన్‌ తీసుకుని ‘ఉమన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీస్‌’కి వెళ్లింది! అక్కడ ఓ విభాగానికి పెద్ద బోర్డు వేలాడుతోంది. ‘డొమెస్టిక్‌ వయెలెన్స్‌ కేసెస్‌ ఆఫీస్‌’ అని!

పదిరోజులు.. పంటి బిగువన..!
‘ఇది డొమెస్టిక్‌ వయెలెన్స్‌’ కిందికి వస్తుంది అన్నారు.. ఉష చెప్పిందంతా విన్న లీగల్‌ ఆఫీసర్‌. కేస్‌ ఎలా ఫైల్‌ చెయ్యాలో కూడా చెప్పారు. చాలా సులభంగా ఉంది ఆ ప్రొసీజర్‌ అంతా. ఉష మౌనంగా ఉండిపోయింది. ‘చెప్పండమ్మా.. ఏం చేద్దామంటారు’ అన్నారు ఆఫీసర్‌.‘కేసు పెట్టడం నా ఉద్దేశం కాదు సర్‌. నా భర్త మారేలా కౌన్సెలింగ్‌ ఇప్పించగలరా?’ అని అభ్యర్థనపూర్వకంగా అడిగింది ఉష. ఆ తర్వాత పది రోజుల్లో కిశోర్‌కి నోటీసులు వెళ్లాయి. ఈ పదిరోజుల్లో కిశోర్‌ ప్రవర్తన మితిమీరిపోయింది. పంటిబిగువన ఓపిక పట్టింది ఉష. నోటీసు రాగానే కాస్త నెమ్మదించింది.‘ఎంతకు తెగించావే’ అంటూ శాపాలు, శాపనార్థాలు పెడుతూ కౌన్సెలింగ్‌కి బయల్దేరాడు కిషోర్‌.

హింస నుంచి రక్షణ ఉత్తర్వులు
కౌన్సెలింగ్‌ మొదలైంది. కౌన్సెలింగ్‌ పూర్తయింది. లాయర్‌ ప్రస్తాంచిన ‘డీవీ’ యాక్ట్‌ తప్ప కిశోర్‌కి ఏవీ గుర్తులేవు. ‘మీ భార్య తలచుకుంటే మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్లిపోయేలా ఈ చట్టం ద్వారా ఆమె ఆదేశాలు తెచ్చుకోవచ్చు. ఉమ్మడి నివాసం నుండి భర్తను ఖాళీ చేయించడానికి మాత్రమే కాదు.. తనను, పిల్లల్నీ వేధించకుండా ‘రక్షణ ఉత్తర్వు’లను కూడా ఆమె ఈ చట్టం ద్వారా పొందవచ్చు’ అని చెప్పాడు లాయర్‌. అయితే ఆమె మీపై కేసు పెట్టాలని కోరుకోవడం లేదు. మీరు మారితే అదే చాలు అనుకుంటోంది’ అని కూడా చెప్పాడు.  కిశోర్‌ ముఖం వాడిపోయింది. అతడి కళ్లలో భయం కనిపిస్తోంది. ‘ఇకపై అలాంటి పనులు చేయను’ అని లిఖితపూర్వకంగా అంగీకరించి కేసు విత్‌డ్రా చేయించుకున్నాడు.    

 గృహహింస (రక్షణ చట్టం) ఏం చెబుతోంది?
‘గృహహింస నుంచి, వేధింపుల నుంచి మహిళకు రక్షణ కల్పించడం కోసం 2005లో ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అదే డీవీ యాక్ట్‌. (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఫ్రమ్‌ డొమెస్టిక్‌ వయెలెన్స్‌). ఈ చట్టం ప్రకారం... భర్త కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ మహిళను ఏ విధంగానైనా హింసిస్తే, ఆమె కోర్టును ఆశ్రయిస్తే.. కోర్టు ఆమెకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. గృహోపకరణాలను వాడుకోనివ్వకుండా అడ్డుకోవడడం, ఇంట్లోని సదుపాయాలను, సౌకర్యాలను వినియోగించకుండా నిరోధించడం; బియ్యం, ఇతర సరకులను తీసుకురాకుండా ఉండడం; అద్దె, కరెంటు బిల్లు, ఫోన్‌ బిల్లు కట్టకుండా ఉండడం, పిల్లల ఫీజులకు, గృహావసరాలకు డబ్బులు ఇవ్వకపోవడం.. ఇవన్నీ కూడా గృహ హింసనుంచి రక్షణ కల్పించే చట్టం పరిధిలోకే వస్తాయి. అంతేకాదు.. సూటిపోటి మాటలతో మహిళను కించపరచడం, ఆమె ఆత్మాభిమానం దెబ్బతినేలా అవమానించడం, చెయ్యి చేసుకోవడం, ఆహారం అందకుండా నిర్బంధించడం, బెదిరించడం.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఏ విధంగా మహిళను వేధించినా కూడా ఈ చట్ట ప్రకారం.. ఆ మహిళ కోర్టు నుంచి ‘రక్షణ ఉత్తర్వు’లను పొందవచ్చు.
ఇ. పార్వతి, అడ్వకేట్‌ అండ్‌ ఫ్యామిలీ కౌన్సెలర్

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా