బంగారం లాంటి లక్ష్యం కోసం.

23 Dec, 2014 23:40 IST|Sakshi
బంగారం లాంటి లక్ష్యం కోసం.

మాకు ఏడేళ్లమ్మాయి, పదేళ్ల అమ్మాయి ఉన్నారు. మా పిల్లలకు పెళ్లి వయసు వచ్చేసరికి చెరొక పది తులాల బంగారు నగలు చేయించాలని నా ఆలోచన. మా వారి జీతం నుంచి నెలకు ఆరువేల వరకు పొదుపు చేయగలను. నేను ఏ విధంగా చేస్తే సులువుగా నా లక్ష్యాన్ని సాధించగలనో సలహా ఇవ్వగలరు.
 - సి.కుమారి, విజయవాడ
 
సాధారణంగా స్టాక్ మార్కెట్ల పనితీరు ఆధారంగానే పసిడి ధరలో హెచ్చుతగ్గులుండటం గమనించవచ్చు. మీరు ప్రస్తుతం నెలకు రూ. 6,000 పొదుపు చేయగలనన్నారు కదా. ఈ నేపథ్యంలో ఆ మొత్తాన్ని ఈ కింది సాధనాల్లో మదుపు చేయడం ద్వారా గరిష్టంగా ప్రయోజనం పొందవచ్చు.. మీ లక్ష్యాన్నీ సాధించవచ్చు.
 
1. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ పథకాలు  (నెలవారీ సిప్ పద్ధతిన)

 మీరు పొదుపు చేస్తున్న మొత్తంలో మూడోవంతు.. అంటే రూ. 2,000ను సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) కింద ఏదైనా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు కట్టే మొత్తంతో ఫండ్.. పసిడిని కొనుగోలు చేసి, మీకు యూనిట్స్‌ను కేటాయిస్తుంది. మీరెప్పుడైనా ఆభరణాలు కొనుగోలు చేయదల్చకుంటే ఈ యూనిట్లను విక్రయించేసి కొనుక్కోవచ్చు. బంగారం రూపంలో కొని ఉంచుకోవడం కంటే ఇలా కొనుక్కోవడం మంచిది.  
 
2. రికరింగ్ /ఫిక్సిడ్ డిపాజిట్


 మరో మూడో వంతు డబ్బును.. అంటే రూ. 2,000ను ఆర్డీ లేదా ఫిక్సిడ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిలో కచ్చితమైన రాబడి ఉంటుంది. రిస్కులు ఉండవు.

 3. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీములు  (నెలవారీ సిప్ పద్ధతి)

 ప్రస్తుతం మీ పిల్లలది చిన్న వయస్సే. దీన్ని బట్టి మీరు దీర్ఘకాలిక దృష్టితో కాస్త రిస్కు తీసుకోవచ్చు. కనుక, మిగతా మూడో వంతు మొత్తాన్ని సగటున 15-18 శాతం మేర రాబడులు ఇస్తున్న మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ (గ్రోత్ ఓరియంటెడ్)లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్లపరంగా వచ్చే అధిక రాబడులనూ అందుకోవచ్చు. తద్వారా మరిన్ని ఎక్కువ ఆభరణాలనూ కొనుక్కోవచ్చు.
 - రజని భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు