సూర్యుడే జీవుడు... జీవుడే ఆత్మ!

3 Feb, 2019 00:20 IST|Sakshi

తత్త్వ రేఖలు

ఆత్మ సర్వాంతర్యామి అనే అద్వైత సూత్రాన్ని శక్తి నిత్యత్వ నియమం నిరూపిస్తోంది. సైన్స్‌ ఆత్మను అనంతశక్తిగా, విశ్వశక్తిగా పేర్కొంటుంది. ఈ ఆత్మ ఒక అద్భుత పరిణామశీలి. పుట్టేది గిట్టేది కాదు కాబట్టి, నిత్యయవ్వనంతో ఆత్మ కళకళలాడుతూ ఉంటుంది. తన నిత్యత్వాన్ని నిలుపుకోవడం కోసం పరిణామమనే ప్రక్రియను సాధనంగా చేసుకుని, తనకు తానుగా పదార్థంగా పరిణామం చెందుతూ వస్తోంది. మళ్ళీ ఆ పదార్థాలు విఘటనం చెందుతూ, నీటి ఆవిరి గాలిలో లయమైపోయినట్టుగా ఆత్మలో లయమైపోతున్నాయి.ఆత్మలాగే, పదార్థమూ అనాదిగా వస్తున్నదే. అయితే, ఆత్మ స్వీయ స్పందనల నుండి ఈ పదార్థం పుడుతూ, విచ్ఛిన్నమవుతూ వస్తోంది.

ఈ ఖగోళ పదార్థాల సంఖ్య నిశ్చల, నిరంతర క్రియ కాదు. ఈ ఖగోళ పదార్థాల ప్రవర్తనకు సౌరకుటుంబమే నిదర్శనం. ఆత్మకు, జీవనిర్జీవ ప్రపంచానికి అనుసంధానకర్త అయిన సూర్యుని ద్వారానే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చని ‘ఈశావాస్యోపనిషత్తు’ ఉద్ఘాటిస్తోంది.తరచి చూస్తే సూర్యుడు కూడా జనన, బాల్య, కౌమార, ప్రౌఢ, వార్ధక్య దశలను దాటి నశించేవాడే. సూర్యుని నుండే గ్రహాలు ఉద్భవించాయని ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు, నవీన ఖగోళ శాస్త్రవేత్తలూ నిర్ధారించారు. గ్రహాలలో భూమి ఒక్కటే జీవావరణ అనుకూలం. అందునా మానవుడు మేథోపరుడు. ఆలోచిస్తే సౌరశక్తే జీవాలుగా మారినట్లు తెలుస్తుంది.

సూర్యుని నుంచి విడిపడి ఏర్పడ్డ భూమిపై సూర్యరశ్మి పడడం, అందులోని శక్తిని తీసుకుని జీవరాశి తయారవడం కనిపిస్తుంది. అంటే ఆ సూర్యుడే అటు గ్రహాల రూపంలో, ఇటు జీవాల రూపంలో భాసిల్లుతున్నాడు. ఇదే విషయాన్ని ‘ఈశావాస్యోపనిషత్తు’ ‘సత్యధర్ము’డైన సాధకుడే సూర్యునిలో నెలకొన్నాడని తీర్మానిస్తోంది. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ ఆత్మరూపుడు సూర్యుని ద్వారా ప్రయత్నించడం ఆ ఉపనిషత్తులో కనిపిస్తుంది.

ఇదే కోవలో మరింత లోతుగా ఆలోచిస్తే ఈ గ్యాలక్సీలలో ఉన్న కోటానుకోట్ల సూర్యులలో భాసిల్లేది ఆ ఆత్మనే. అంటే, అనంతమైన ఆత్మే నక్షత్రాలుగాను, గ్రహాలుగాను, పంచభూతాలుగాను, ప్రాణులుగానూ మారి కనిపిస్తోంది. ఇదే విషయాన్ని గణిత సూత్రంలో పోలిస్తే ఒక విలువ రెండో విలువకు, రెండో విలువ మూడో విలువకు సమానమైనపుడు ఒకటో విలువ మూడో విలువకు సమానమౌతుంది. ఇదీ అంతే. ఆత్మే సూర్యుడు, సూర్యుడే జీవుడు, జీవుడే ఆత్మ. దీన్ని అర్థం చేసుకోవడమే ఆత్మసందర్శన. అదే భగవద్దర్శనం. ఆ సాధనే సత్యస్వరూపం
–గిరిధర్‌ రావుల


 

మరిన్ని వార్తలు