కడుపు కదిలించేందుకు... కాంతి!

22 May, 2018 00:16 IST|Sakshi

ఉదయాన్నే కడుపు సాఫీగా కదలకపోతే ఎంత చికాకో.. కాఫీలతో కొందరు.. కాసేపు నడక లేదంటే గోరువెచ్చటి నీటితో ఇంకొందరు కడుపు ఖాళీ చేసుకునేందుకు ప్రయత్నిస్తూంటారు. మరికొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని సాఫీగా అవదు. ఇలాంటి వారి కోసం కాంతి ఎంతో బాగా ఉపయోగపడుతుందంటున్నారు ఫ్లిండర్స్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఆశ్చర్యపోవద్దు. అక్షరాలా నిజమే. కాంతి ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. కణాలను చైతన్యవంతం చేయడం ద్వారా గుండె చప్పుళ్లను క్రమబద్ధీకరిస్తుందని, కరెంటు షాకులతో గుండెలను మళ్లీ కొట్టుకునేలా చేసేందుకు ప్రత్యామ్నాయంగానూ ఉపయోగపడుతుందని ఎలుకలపై జరిపిన ప్రయోగాలు రుజువు చేస్తున్నాయి.

తాజాగా పెద్దపేవు ప్రాంతాల్లో నీలపు కాంతిని ప్రసరింప చేయడం ద్వారా అక్కడి నరాలు చైతన్యవంతమై మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం మలబద్ధకం నివారణకు ఉపయోగిస్తున్న లాక్సేటివ్‌లు దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు చూపే అవకాశమున్నందున తాము కాంతిని ప్రత్యామ్నాయంగా గుర్తించామని ఫ్లిండర్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త నిక్‌ స్పెన్సర్‌ తెలిపారు. ఎలుకల పేవు గోడల్లో అతిసూక్ష్మమైన ఎల్‌ఈడీ బల్బులు వెలిగేలా చేసినప్పుడు కొన్ని నరాలు చేతన్యవంతమై ఆ పని పూర్తి అయ్యేలా చేసిందని చెప్పారు. అయితే మనిషి పేవుల్లోకి బల్బులు చొప్పించడం కాకుండా ఇతర మార్గాల ద్వారా వెలుతురును ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. 

మరిన్ని వార్తలు