తెల్ల జుట్టుకు బై చెప్పచ్చు

25 Jan, 2020 03:52 IST|Sakshi

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం మనం తరచూ చూస్తూంటాం. విపరీతమైన ఒత్తిడి దీనికి కారణమన్న విషయమూ మనకు తెలుసు. అయితే కారణమేమిటన్నది మాత్రం నిన్న మొన్నటివరకూ ఎవరికీ తెలియదు. ఈ లోటును పూరించారు హార్వర్డ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఒత్తిడికి, జుట్టు నెరుపుకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది తెలుసుకునేందుకు తాము విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టామని హార్వర్డ్‌ శాస్త్రవేత్త యా ఛీ హూ తెలిపారు. వృద్ధాప్య లక్షణాలు వేగంగా చోటు చేసుకునేందుకు ఒత్తిడి కారణమవుతుందని, అందువల్లనే జుట్టు తెల్లబడుతోందని ఇప్పటివరకూ అనుకునేవారు.

కానీ పరిశోధనల్లో మాత్రం భిన్నమైన ఫలితాలు కనిపించాయి. ఒత్తిడి ఎక్కువైనా వెంట్రుకల కుదుళ్లలో నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలు తక్కువేమీ కాలేదు. అలాగే.. కార్టిసాల్‌ అనే హార్మోన్‌కూ వెంట్రుకల నెరుపుకూ సంబంధం లేదని స్పష్టమైంది. వెంట్రుకల కుదుళ్లలో ఉండే కొన్ని రకాల మూలకణాలు ఒత్తిడి ఎక్కువయినప్పుడు అతిగా స్పందిస్తున్నట్లు ఎలుకలపై జరిగిన పరిశోధనల ద్వారా తెలిసిందని, ఈ క్రమంలో ఆ మూలకణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలూ తగ్గిపోతున్నట్లు తెలిసిందని హూ తెలిపారు.

ఇంకోలా చెప్పాలంటే సాధారణ స్థితిలో నల్లటి రంగును ఉత్పత్తి చేసే కణాలుగా మారే మూలకణాలు ఒత్తిడి సమయంలో అతిగా స్పందించడం వల్ల జుట్టు నెరుస్తోందన్నమాట! అంతా బాగుందికానీ.. ఒత్తిడి సమయాల్లో మన శారీరక వ్యవస్థలోని సింపథెటిక్‌ నెర్వస్‌ సిస్టమ్‌ విడుదల చేసే నోరీపైనిఫ్రైన్‌ అనే రసాయనం మూలకణాలను చైతన్యవంతం చేస్తోందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంట్రుకలు తెల్లబడకుండా కొత్త మందులు కనుక్కునేందుకు ఈ పరిశోధన ఉపకరిస్తుందని అంచనా.

>
మరిన్ని వార్తలు