సూట్‌కేస్‌లో స్కూటర్

28 Jul, 2016 04:24 IST|Sakshi
సూట్‌కేస్‌లో స్కూటర్

టెక్ టాక్ / మోడో బ్యాగ్
 
నడక ఆరోగ్యానికి మంచిదేగానీ.. అది ఏమాత్రం మితిమీరినా నీరసం ఖాయం! విమానాశ్రయాల్లో, రైల్వే స్టేషన్లలో ఒక్కోసారి ఒక చివరి నుంచి మరో చివరకు చేరేసరికి కాళ్లు లాగేస్తూంటాయి. బోర్డింగ్ టైమ్ దగ్గరపడిందంటే.. చేతిలో లగేజీతో నానా అవస్థలు పడుతుంటారు. ఇలాంటి అన్ని రకాల ‘లాస్ట్ మైల్ ప్రాబ్లెమ్స్’కు ఈ మోడోబ్యాగ్‌తో చెక్ పెట్టేయవచ్చు. దాదాపు 90 కిలోల బరువున్న వారిని కూడా మోసుకెళ్లగల మోడోబ్యాగ్ ఒకసారి చార్జ్ చేస్తే గంటకు 12 కిలోమీటర్ల వేగంతో 9.5 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. షికాగోలో తయారైన ఈ బ్యాగ్ కోసం 200 వాట్ల విద్యుత్ మోటార్‌ను ఉపయోగించారు.


దీన్ని అవసరమైతే లాక్కెళ్లవచ్చు. హ్యాండిల్‌బార్, బ్రేక్ వంటి సౌకర్యాలన్నీ ఉండే ఈ బ్యాగ్ విమానాల క్యాబిన్ లగేజీ సైజులోనే ఉంటుంది. ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్స్ పెట్టుకునేందుకు, చార్జ్ చేసుకునేందుకు కూడా ఏర్పాట్లున్నాయి. విమాన ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకుని సిద్దం చేసినప్పటికీ రైల్వేస్టేషన్లలో, భారీస్థాయి షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ కార్ట్‌గానూ దీన్ని వాడే అవకాశాలు లేకపోలేదు.

 

మరిన్ని వార్తలు