స్క్రీన్‌మ్యాన్‌

19 Feb, 2018 00:25 IST|Sakshi

‘ప్యాడ్‌మ్యాన్‌’ చిత్రంతో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేయడానికి ‘రుతుస్రావ పారిశుద్ధం ఉద్యమం’లో ఓ అడుగు వేశాడు. ఆ స్ఫూర్తితో పశ్చిమబెంగాల్‌లోని, దక్షిణ దినాజ్‌పూర్‌ జిల్లా ఈ సామాజికోద్యమంలో మరో అడుగు ముందుకు వేసింది. పాఠశాల విద్యార్థినులందరికీ ఈ సినిమాను జిల్లా స్థాయి అధికారులు ఉచితంగా చూపిస్తున్నారు.

తొలి విడతగా ఐదు వందల టికెట్‌లను అధికారులే కొని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులను సినిమాకు తీసుకెళ్లారు. విద్యార్థినులతో పాటు జిల్లా మేజిస్ట్రేట్‌ శరద్‌కుమార్‌ ద్వివేది, పోలీస్‌ సూపరింటెండెంట్‌ ప్రసూన్‌ బెనర్జీ, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ సుకుమార్‌ డే కూడా ‘ప్యాడ్‌మ్యాన్‌’ సినిమాను వీక్షించారు.

దక్షిణ దినాజ్‌పూర్‌ జిల్లాలో 70 శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వారిలో సగం మంది మహిళలు కూడా శానిటరీ న్యాప్‌కిన్‌లను వాడటం లేదు. జిల్లా వైద్యశాఖ అధ్యయనంలో ఈ సంగతి వెల్లడైంది. గ్రామీణ మహిళలను రుతుక్రమం సమయంలో పాటించాల్సిన శుభ్రత పట్ల చైతన్యవంతం చేయడానికి వైద్య ఆరోగ్య సిబ్బంది కొన్నేళ్లుగా రాష్ట్రమంతటా శ్రమిస్తూనే ఉంది. అయినా సరే వారి ప్రయత్నం అనుకున్నంతగా ఫలవంతం కాలేదు. అనేక అపోహలు గ్రామీణ మహిళల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.

ఈ అపోహలను పూర్తిగా తొలగించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్న అక్కడి ప్రభుత్వ యంత్రాంగం.. రాబోయే తరాన్ని చైతన్యవంతం చేస్తేనే సమాజం ఆరోగ్యకర మవుతుందనే నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయానికి ‘ప్యాడ్‌మ్యాన్‌’ మంచి అవకాశంగా కలిసొచ్చింది. ‘సినిమా ప్రభావవంతమైన మాధ్యమం. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సులభంగా చేరుస్తుంది’ అని అధికారులు అంటున్నారు.

పది నేప్‌కిన్‌లు రూ.27
రుతస్రావ పరిశుభ్రతను పాటించడం నేర్పిస్తే సరిపోతుందా? అందుకు తగినన్ని శానిటరీ న్యాప్‌కిన్స్‌ని అందుబాటులోకి తేవద్దా? తేవాలి. తెస్తున్నారు కూడా. స్థానిక స్వయం సహాయక బృందాల మహిళలకు న్యాప్‌కిన్‌ల తయారీలో అధికారులు శిక్షణ ఇప్పిస్తున్నారు. వారి చేత న్యాప్‌కిన్‌ తయారీ యూనిట్‌లు పెట్టించి ప్రభుత్వమే మెటీరియల్‌ సప్లయ్‌ చేస్తోంది. పది న్యాప్‌కిన్‌ల ప్యాకెట్‌ 27 రూపాయల కు అందుబాటులోకి తెచ్చింది వెస్ట్‌ బెంగాల్‌ ప్రభుత్వం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చొరవతో ఆడవాళ్లకు అందివచ్చిన సౌకర్యం ఇది.

– మంజీర

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు