వెన్నుకు రెండోసారి ఆపరేషన్ సాధారణమే

26 Jun, 2015 23:17 IST|Sakshi
వెన్నుకు రెండోసారి ఆపరేషన్ సాధారణమే

స్పైన్ కౌన్సెలింగ్
నేను రెండేళ్ల క్రితం నా వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్నాను. అయితే ఇప్పుడు నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. ఇక నేను ఎంతమాత్రమూ నడవలేకపోతున్నాను కూడా. మా డాక్టర్‌ను సంప్రదిస్తే, మరోమారు వెన్ను ఆపరేషన్ చేయించాలని అంటున్నారు. దాంతో నాకు ఆందోళనగా ఉంది. సరైన సలహా ఇవ్వండి.
 - యశ్వంతరావు, నిజామాబాద్
 
సాధారణంగా వెన్ను ఆపరేషన్లలో రెండోసారి చేయించాల్సి రావడం కొందరిలో జరగవచ్చు. ఇలా రెండోసారి ఆపరేషన్‌కు దారితీసేందుకు చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు డిస్క్ పక్కకు తొలగడం, ఇన్ఫెక్షన్ రావడం, సూడోఆర్థోసిస్, ఇన్‌స్టెబిలిటీ వంటి ఎన్నో సందర్భాల్లో చేసిన ఆపరేషన్‌ను మరోమారు సరిదిద్దడం అవసరమవుతుంది. అయితే అత్యంత కీలకమైన ‘వెన్నెముక’లో రెండోసారి ఆపరేషన్ చేయడం చాలా సంక్లిష్టమైనది కరాబట్టి,  రెండోసారి ఆపరేషన్‌ను చాలా నిపుణులైన సర్జన్లతో మాత్రమే చేయించాలి.
 నా చేతుల్లో క్రమంగా స్పర్శ తగ్గుతోంది. కాళ్లు బిగుసుకుపోయినట్లుగా మారుతున్నాయి. మెడనొప్పి కూడా వస్తోంది. మూత్రానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో దాన్ని ఆపుకోవడం చాలా కష్టమవుతోంది. పైగా నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కూడా తప్పుతోంది. నా సమస్యలకు పరిష్కారం చెప్పండి.
 - శంకర్‌రావు, అనంతపురం
 
మీరు చెప్పినదాన్ని ప్రకారం మీరు ‘సర్వైకల్ మైలోపతి’ అనే సమస్యతో బాధపడుతున్నారనిపిస్తోంది. మెడ భాగంలోని వెన్నునరాలపై పడే ఒత్తిడి కారణంగా మీరు చెప్పిన లక్షణాలు మీలో కనిపిస్తున్నాయని నా అభిప్రాయం. అయితే వ్యాధినిర్ధారణ కోసం ఒక క్రమపద్ధతిలో క్లినికల్ పరీక్షలు, ఎమ్మారై వంటి పరీక్షలు చేసి దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వచ్చిన కండిషన్ ‘సర్వైకల్ మైలోపతి’ అని నిర్ధారణ అయితే, ఆ వ్యాధి తీవ్రత ఆధారంగా మీకు మెడ ముందు భాగం నుంచి గానీ లేదా మెడ వెనకభాగం నుంచిగానీ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.
డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
స్పైన్ సర్జన్,
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

మరిన్ని వార్తలు