ఉపాధికి గార్మెంట్‌

5 Mar, 2019 00:18 IST|Sakshi

లేడీమేడ్‌

వివాహం అయిన తరువాత వంటింటికే పరిమితం కాలేదు కావ్య. తన వంతు బాధ్యతగా ఇంటి పోషణలో, పిల్లల చదువులలో భర్తకు చేదోడుగా ఉండాలనుకున్నారు. చేతిలో ఉన్న విద్యనే ఆయుధంగా మలుచుకున్నారు. స్వయం ఉపాధిగా కుట్టు పనిని ఆశ్రయించారు. నిరంతరం శ్రమించారు. అంచెలంచెలుగా ఎదిగి పరిశ్రమను స్థాపించే స్థాయికి చేరుకున్నారు. గ్రామానికే ఆదర్శ మహిళగా నిలిచారు. 

బడికెళ్లే రోజుల్లో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నేర్చుకున్న కుట్టుపని తనకొక మంచి ఉపాధి మార్గం అవుతుందని ఊహించలేదు కావ్య. వివాహం అయ్యాక, తనకు తానుగా ఏదైనా ఉపాధిని ఏర్పరచుకోవాలని తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టి, పట్టుదలతో శ్రమించారు. ఇలా తనకో సంపాదన మార్గాన్ని అన్వేషించుకునే క్రమంలో సాటి మహిళలకూ ఉపాధిని కల్పించారు జిందం కావ్య. సిరిసిల్ల, బోయనపల్లి మండలం గర్శకుర్తి గ్రామంలో వావిలాల గణపతి, లక్ష్మి దంపతుల ఆరుగురు సంతానంలో ఆఖరి అమ్మాయి కావ్య. పదో తరగతి వరకు చదువుకున్న కావ్య, ఏదైనా పని నేర్చుకుంటే పోయేదేముంది అనుకుని వేసవి సెలవుల్లో కుట్టుపనిలో శిక్షణ తీసుకున్నారు.

తొమ్మిదేళ్ల క్రితం సిరిసిల్లకు చెందిన జిందం సురేశ్‌తో ఆమె వివాహం అయింది. భార్యాభర్తలు జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో స్థిరపడ్డారు. ఆమె భర్త.. బట్టల వ్యాపారానికి మార్కెటింగ్‌ చేస్తుంటారు. ఆ పనిలో ఆయనకు తోడుగా ఉండాలని అనుకున్నారు ఆమె. కేవలం ఒక కుట్టు మిషన్‌తో జాబ్‌ వర్క్‌ మొదలుపెట్టారు. రోజుకు ఎనిమిది నుంచి పది గంటల వరకు కష్టపడ్డారు. అయితే ఎంత చేసినా చాలినంత ఆదాయం లేకపోవడంతో సొంతంగా రెడీమేడ్‌ దుస్తులను తయారు చేయాలని కావ్య నిర్ణయించుకున్నారు. రోజుకు వచ్చే రూ. 200ల ఆదాయం లోంచే పొదుపు చేసి నాలుగేళ్ల క్రితం పది జుకీ కుట్టు మిషన్లు కొనుగోలు చేశారు. సొంతంగా రెడీమేడ్‌ దుస్తుల తయారీకి ఉపక్రమించారు. 

తోడుగా ఇరుగు పొరుగు
ముడి వస్త్రాన్ని మహారాష్ట్రలోని పలు ప్రాంతాలనుంచి భర్త సత్యం తీసుకొచ్చేవారు. ఆ వస్త్రాన్ని కొలతల ప్రకారం కత్తిరించి షర్టులుగా రూపొందించడమనే బాధ్యతను కావ్య తీసుకున్నారు. అలా తనతోపాటు పనితత్వాన్ని ఇష్టపడే మరో పదిమంది ఇరుగు పొరుగు మహిళలను తోడుగా తెచ్చుకున్నారు. వాళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏ రోజుకు ఆ రోజు అందజేశారు. త్వరలోనే దుస్తుల తయారీ వేగవంతం అయింది. భర్త సహకారంతో దుస్తులను మార్కెట్‌లో ప్రవేశపట్టగానే గిరాకీ పెరిగింది. ప్రస్తుతం మరో ఇరవై జుకీ కుట్టు మిషన్లతో, పీస్‌వర్క్‌ చేసే మరో ఇరవై మంది మహిళలతో కలిపి మొత్తం నలభై మంది సాటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు కావ్య. 

అద్దె ఇంటిలోనే తయారీ
విద్యానగర్‌లోని ఓ రేకుల ఇంటిని అద్దెకు తీసుకుని అందులోనే చిన్న కుటీర పరిశ్రమగా రెడీమేడ్‌ దుస్తుల తయారీ ప్రారంభించారు కావ్య. అంతేకాదు, షర్టుల తయారీలో తనకో ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారు. రోజుకు రెండు వందల షర్టులను తయారు చేసే స్థాయిని అందుకున్నారు. అయితే విద్యుత్‌ ఛార్జీలు, జీఎస్‌టీ వంటి సుంకాలు తమ పరిశ్రమ పురోగతికి ఇబ్బందిగా ఉన్నాయని, ప్రభుత్వం ప్రోత్సహించి సబ్సిడీ రుణం అందిస్తే పరిశ్రమను మరింత విస్తరించగలనని కావ్య అంటున్నారు. 
గెంట్యాల భూమేష్, సాక్షి, సిరిసిల్ల  


ప్రభుత్వం గుర్తిస్తే బాగుంటుంది
తెలిసిన పనితోనే స్థిరపడాలనుకున్నాను. కుటుంబ పోషణ, ఇద్దరు పిల్లలను బాగా చదివించాలంటే ఒక్కరి సంపాదన సరిపోదని భావించి కష్టపడి ఈ స్థితికి రాగలిగాను. పెట్టుబడి లేక మరింత ముందుకు వెళ్లలేకున్నాం. ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి సబ్సిడీ రుణం ఇప్పిస్తే మరి కొంతమంది మహిళలకు ఉపాధిని ఇవ్వగలుగుతాను.

జిందం కావ్య

కుటుంబానికి ఆసరా
పదోతరగతి వరకు చదువుకున్నాను. ఇక్కడే కుట్టుశిక్షణ తీసుకుని పని చేస్తున్నాను. సొంత కాళ్ల మీద నిలబడాలన్న కోరిక ఇలా కొంతవరకు తీరింది. నా కుటుంబానికి ఆసరాకోసం కుట్టు పని చేస్తున్నాను. 

పెందోట కిరణ్మయి

పని చేస్తూనే చదువుకుంటా
డిగ్రీ పూర్తి చేశాను. కుటుంబ పోషణకు తోడ్పాటుగా నిలవాలనుకుని ఈ కుట్టుపనిలో ఇక్కడే శిక్షణ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడే పనిచేస్తున్నాను. రోజుకు కనీసం రూ. 250 వరకు సంపాదిస్తున్నాను. పీజీ చేద్దామనుకుంటున్నాను.

– ఎల్లె లత 

సొంత సంపాదన ఉండాలి
ఏ ఆడపిల్లకైనా తన ఉనికి, వ్యక్తిత్వం నిలుపుకునేందుకు స్వీయ సంపాదన  దోహదపడుతుంది. డిగ్రీ పూర్తి చేసినా కుటుంబ సభ్యుల మీదే ఆ«ధారపడడం సరికాదని భావించి ఈ కుట్టుపనిలో చేరాను.

– సమ్మెట కవిత

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా