స్వయం ఆధారిత పర్యావరణ సేద్యం!

19 May, 2020 06:31 IST|Sakshi

స్వావలంబన (స్వయం ఆధారిత), స్థానికత.. కొవిడ్‌ తదనంతర కాలపు ఎజెండా ఇది. నిజానికి.. అచ్చం ఇదే ఎజెండాను జహీరాబాద్‌ ప్రాంత దళిత మహిళా రైతులు 30 ఏళ్లుగా అమలు చేస్తున్నారు. ఈ వర్షాకాలపు పంట(ఖరీఫ్‌) కాలంలో సుమారు 30 గ్రామాల్లో 1200 ఎకరాల్లో ఎప్పటి మాదిరిగానే తమదైన ప్రత్యేక పర్యావరణ వ్యవసాయం చేపట్టడానికి వెయ్యి మంది మహిళా రైతులు సన్నద్ధమవుతున్నారు. అంతగా సారం లేని తమ ఎర్ర నేలల్లో వర్షాధార పంటలను.. మార్కెట్‌ కోసం కాదు, మా కోసం, మా సంప్రదాయ పద్ధతుల్లోనే పండించుకుంటామని ఇటీవల ముక్తకంఠంతో ప్రతినబూనారు.  }

పొలంలో వేసే ఎరువు మొదలుకొని భిన్నరకాల(చిరు/ పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఆకుకూరలు..) విత్తనాలు.. పర్యావరణానికి, మనుషులకి, గొడ్డుగోదకు హాని చేయని తెగులు నివారణ ద్రావణాలు, కషాయాల పిచికారీలు.. సేంద్రియ ఎరువుల వరకు ప్రతి దాన్నీ తమ దగ్గర ఉన్న వనరులతోనే రైతులు స్వయంగా తయారు చేసుకుంటారు. పంట కోసం అప్పుతేవడం గానీ, ఇతరుల నుంచి ఒక్క రుపాయి తీసుకోవడం గానీ, సర్కారు ఎరువులు వాడడం గానీ చేయరు. పంట సీజన్‌ ముగిసే సరికి సంప్రదాయ సాగులోని విభిన్న పద్ధతులు, పర్యావరణ వ్యవసాయం ప్రాముఖ్యతను చాటి చెబుతారు. ఇది పర్యావరణ వ్యవసాయం యొక్క అత్యంత విలువైన లక్షణం. ఈ మొత్తం పంటల సాగు ప్రక్రియలో వాడే ప్రతిదీ స్థానికమే అని సగౌరవంగా చాటి చెబుతారు.

సాగు పద్ధతి ఇదీ..
► 1200 ఎకరాలకు 48,000 టన్నులకు (ఎకరానికి 40 టన్నులకు) పైగా పశువుల ఎరువు, ప్రత్యేకమైన ‘సమృద్ధి ఎరువు’ వాడతారు.
► విత్తన శుద్ధికి, పంట పెరుగుదలకు ఉపయోగపడే 2000 లీటర్ల బీజామృతం తయారు చేసుకొని వాడతారు.
► పంచగవ్య వంటి సుమారు 5,000 లీటర్ల ‘టానిక్స్‌’ వాడటం ద్వారా పంటల పెరుగుదల క్రమాన్ని బలోపేతం చేస్తారు.
► పూత ఎక్కువ రావడానికి, మొక్కలపెరుగుదలకు సహాయపడటానికి 48,000 లీటర్ల వర్మివాష్‌ 1200 ఎకరాలకు పిచికారీ చేస్తారు.
► ఈ మహిళలు జీవవైవిధ్య సాగు కోసం 10–15 రకాల 12,000 కిలోల సొంత విత్తనాలను తమ చేలల్లో నాటనున్నారు.
► ఈ ఖరీఫ్‌ పంట సీజన్‌నులో ఈ భూములపై తమ శ్రమతోపాటు ఎకరానికి రూ. 5 వేలు ఖర్చు పెట్టనున్నారు.  
► ఇక ఆర్థిక రాబడి ఎంతంటారా?.. నీటివసతి లేని ఈ ఎర్రనేలల నుంచి ఎకరానికి రూ.55,000 వరకు రాబడి తీస్తామని ధీమాగా చెబుతున్నారు.

ఈ పంటల విధానం చిన్న కమతాలున్న మహిళా రైతుల అవసరాలను తీరుస్తుంది. తిండికి, పౌష్టికాహానికి, ఆరోగ్యానికి, జీవనోపాధికి భద్రతనివ్వడంతోపాటు పశువుల మేతకూ భద్రత ఇస్తోంది.

ఎందుకంటే ఇక్కడ రసాయనిక మందుల వాడకం అంటూ ఉండదు.  ఈ ప్రకృతిసిద్ధమైన పంటల వల్ల కుటుంబాల ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుందని మహిళా రైతులు మనోధైర్యంతో చెబుతున్నారు.

సొంత కాళ్లపై నిలబడి సొంత వనరులతో మహిళా రైతులు చిన్నపాటి కమతాల్లో చేపట్టే ఈ పర్యావరణ జీవవైవిధ్య వ్యవసాయానికి జేజేలు పలుకుదాం!

మరిన్ని వార్తలు