ఊరికిచ్చిన మాట

1 Nov, 2018 00:19 IST|Sakshi
మడికట్టులో రైతుల పొలాల వైపు వెళ్లే రోడ్డు పరిస్థితిని పరిశీలిస్తున్న జెడ్పీటీసీ శైలజ

లీడర్‌

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం సొంత ప్లాటునే అమ్మకానికి పెట్టి, దానిద్వారా వచ్చిన 22 లక్షల రూపాయలతో చేవెళ్ల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధిపనులు చేపట్టారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల జెడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజ! ఇది చూసైనా ప్రభుత్వం తను ఇవ్వవలసిన నిధులను విడుదల చేస్తుందని ఆమె ఆశిస్తున్నారు.

మండలంలోని దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన శైలజ చేవెళ్ల మండల జెడ్పీటీసీ సభ్యురాలుగా 2014 లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. ఆమె భర్త  చింపుల సత్యనారాయణరెడ్డి దేవుని ఎర్రవల్లి గ్రామ సర్పంచ్‌గా  2009 నుంచి  2014 వరకు పనిచేశారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన భార్య శైలజ పోటీకి దిగటంతో ప్రజలు ఈ దంపతులపై ఉన్న నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. మండలం కూడా  దేవుని ఎర్రవల్లి గ్రామం మాదిరిగా అభివృద్ధి చెందుతుందని ఆశించారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో తన మండలం అభివృద్ధికి శైలజ సొంత డబ్బును వినియోగించదలిచారు! ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ఆమె వివరించారు. 

అన్ని ప్రయత్నాలూ విఫలం
‘‘ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రావాల్సిన 540 కోట్ల సీనరేజీ నిధులు విడుదల కాకపోవడంపై పలుమార్లు నేను నా భర్తతో కలిసి ప్రభుత్వానికి నివేదించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు! జిల్లాలో జెడ్పీటీసీలంతా కలిసి నిధులు రావటం లేదని సమావేశమై చర్చించాం. అప్పుడు మాత్రం ప్రభుత్వం స్పందించి జిల్లా జెడ్పీటీసీలందరిని పిలిపించి అసెంబ్లీ వద్ద  కేటీఆర్,  పంచాయతీరాజ్‌ మంత్రి జూపల్లి క్రిష్ణారావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డిలు  నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. అయినప్పటికీ విడుదల కాలేదు.  దాంతో హైకోర్టును ఆశ్రయించాను. కోర్టు కూడా రెండు నెలల్లో నిధులను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా  పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లింది.
 
విసిగిపోయి ‘సొంత’ నిర్ణయం
ప్రభుత్వం స్పందించకపోవటంతో పాటు నిధులు విడుదల చేయకుండా పై కోర్టుకు అప్పీల్‌కు వెళ్లటంతో ఓటర్లకు ఇచ్చిన హామీలలో కొన్నింటినైనా నెరవేర్చాలనే ఆలోచనతో నా సొంత ప్లాటు అమ్మి మండలంలో అభివృద్ధి చేయాలనే నిర్ణయానికి వచ్చాను. ఈ నిర్ణయంతోనైనా ప్రభుత్వంలో కొంతైనా చలనం వచ్చి గ్రామాలకు రావాల్సిన సీనరేజీ నిధులు వస్తాయనే ఆలోచనతో  ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ప్లాటు అమ్మి వచ్చిన నిధులను మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేటాయిస్తానని ఆరు నెలల క్రితం ప్రకటించాను. ప్రకటించినట్లుగానే చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారి పక్కనే నా పేరుపై ఉన్న 100 గజాల ప్లాటును  అమ్మి వేశాను. దీనికి  22 లక్షల రూపాయలు వచ్చాయి. వీటిని అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నాను’’ అని శైలజ తెలిపారు.
– ఎస్‌.రాకేశ్, సాక్షి, చేవెళ్ల, రంగారెడ్డి

చేపట్టిన పనులు
మండలంలోని మడికట్టులో రైతుల పొలాల వద్దకు వెళ్లే లింకురోడ్డుతోపాటు..  ఎన్కేపల్లి, మల్లారెడ్డిగూడ, కేసారం గ్రామాల్లో  వాటర్‌ప్లాంటు ఏర్పాటు, ఊరేళ్లలో  రైతుల పొలాల వద్దకు మట్టి రోడ్డు, కుమ్మెరలో సీసీ రోడ్డు లాంటి పనులు  ముందుగా చేయాలని శైలజ నిర్ణయించారు. వీటికి ఖర్చు చేయగా నిధులు మిగిలితే ఘనాపూర్‌లో వడ్డెర బస్తీకి రోడ్డు పనులు చేయాలని అనుకున్నారు.

ఇలా ఉంటుందని అనుకోలేదు
రాజకీయాలంటే మరీ ఇంత దారుణంగా ఉంటాయని అనుకోలేదు. స్థానిక సంస్థల్లో మహిళలకు  50 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లుగానే నిధులు సైతం  వస్తాయని అనుకున్నాను. నేను ఊహించింది ఒకటి అయితే వాస్తవంగా జరుగుతుంది మరొకటి. అందుకే నా బాధ్యతగా నన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు తన వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ సాహసం చేశాను. వచ్చేది  కొద్ది డబ్బే అయినా కొన్ని హామీలనైనా తీర్చాననే తృప్తి నాకు మిగులుతుంది. నా  ఈ నిర్ణయంతో  స్థానిక సంస్థల పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే అన్ని గ్రామాలు బాగుపడుతాయని  ఆశిస్తున్నాను. 
–   చింపుల శైలజ, జెడ్పీటీసీ, చేవెళ్ల 

మరిన్ని వార్తలు