పచ్చి బఠాణీ.. పట్టపు రాణి..!

20 Jul, 2015 22:26 IST|Sakshi
పచ్చి బఠాణీ.. పట్టపు రాణి..!

గట్టి బఠాణీ తినాలంటే బలమైన దంతసిరి ఉండాల్సిందే!
సుతిమెత్తని పచ్చి బఠాణీలకు అలాంటి ఇబ్బందులుండవు.
ఎలాంటి వంటకాల్లోనైనా ఇట్టే ఇమిడిపోతాయి.
ఏ రుచిలోనైనా చక్కగా ఒదిగిపోతాయి.
కాలక్షేపం బఠాణీలని తీసిపారేస్తారు గానీ,
కండర పుష్టికి కూడా ప్రశస్తమైనవి బఠాణీలు.
ఒక్కసారి తిని చూస్తే, ఎంతటి వారైనా..
గింజ కొంచెం.. రుచి ఘనం..
అని నోరారా ప్రశంసించకుండా ఉండలేరు.
పసందైన విందుభోజనాలకు పట్టపురాణి
ఆకుపచ్చని పచ్చిబఠాణీ..
కావాలంటే ఈ వెరైటీలు ప్రయత్నించి చూడండి!

 
సగ్గుబియ్యం - పచ్చిబఠాణీ కట్‌లెట్స్
కావలసినవి: సగ్గుబియ్యం - గ్లాసు; పచ్చి బఠాణీలు - అర గ్లాసు; బొంబాయిరవ్వ - గ్లాసు; జీలకర్ర - పావు టీ స్పూను; సోడా - చిటికెడు; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చిమిర్చి పేస్ట్ - తగినంత; అల్లం వెల్లుల్లి పేస్ట్ - తగినంత; నూనె - తగినంత; ఉప్పు - తగినంత; ఉడికించిన బంగాళదుంప పేస్ట్ - అర కప్పు; కొత్తిమీర - తగినంత
 
తయారీ: సగ్గుబియ్యం మునిగేవరకు నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాక, నీళ్లు తీసేయాలి బఠాణీలో నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాక, నీళ్లు తీసేసి, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పట్టుకోవాలి  బొంబాయిరవ్వలో సగ్గుబియ్యం బఠాణీ పేస్ట్, బంగాళదుంప పేస్ట్ వేసి బాగా కలిపి చివరగా నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు) పకోడీల పిండిలా కలిపి పెట్టుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టి, కాలాక నూనె వేసి, తడి వస్త్రంపై ఈ మిశ్రమాన్ని చిన్న ఉండగా పెట్టి కట్‌లెట్ సైజులో చేతితో చేసి పెనం మీద వేసి చుట్టూ నూనె వేసి బాగా కాలిన తర్వాత తీసి ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే బాగుంటుంది.  కలిపిన పిండిని వడల మాదిరిగా, పకోడీలలాగ కూడా నూనెలో వే సి కూడా చేసుకోవచ్చు.
 
పచ్చి బఠాణీ - ఆనపకాయ ఖీర్
కావలసినవి: పచ్చి బఠాణీలు - కప్పు; పచ్చి కోవా - అర కప్పు; ఆనపకాయ - కప్పు; పంచదార - కప్పు; పచ్చికొబ్బరి తురుము - పావు కప్పు; నెయ్యి - 3 టీ స్పూన్లు; పాలు - 5 కప్పులు; జీడిపప్పు + బాదం పప్పులు - గుప్పెడు; ఎండు ద్రాక్ష - 15; ఏలకుల పొడి - చిటికెడు; కర్బూజ గింజలు - టీ స్పూను

తయారీ: పచ్చి బఠాణీలను గంటసేపు నానబెట్టి, ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి  ఆనపకాయ తురుములో కొన్ని పాలు పోసి ఒక విజిల్ రాగానే దించేయాలి స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగిన తర్వాత పచ్చిబఠాణీ పేస్టు వేసి పది నిమిషాలు ఉంచి, (ఆపకుండా కలుపుతుండాలి) ఆనపకాయ తురుము కూడా వేసి ఐదు నిమిషాలు కలిపి ఆ తరవాత కోవా, పాలు, పంచదార వేసి బాగా కలపాలి  ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి  వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది  ఫ్రిజ్‌లోఉంచి చల్లగా తింటే హాయిగా ఉంటుంది.
 
పచ్చి బఠాణీ పరోఠా
 

కావలసినవి: గోధుమ పిండి - 3 కప్పులు; పచ్చి బఠాణీలు - కప్పు; పచ్చి మిర్చి ముద్ద - తగినంత; నువ్వులు - అర టీ స్పూను; నూనె -  తగినంత; కొత్తిమీర కరివేపాకు - తగినంత; నెయ్యి - టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; ఉప్పు - తగినంత
 
తయారీ: పచ్చి బఠాణీలను గంట సేపు నానబెట్టి, కుకర్‌లో ఉంచి ఒక విజిల్ వచ్చాక దించేయాలి చల్లారాక మెత్తగా గ్రైండ్ చేయాలి  గోధుమపిండిలో పచ్చి బఠాణీ ముద్ద వేసి, నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి బాగా కలిపి, నీళ్లు వేస్తూ చపాతీ పిండిలా కలిపి, అరగంటసేపు నాననివ్వాలి  ఉండలు చేసుకుని, చపాతీ మాదిరిగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేస్తూ, కాల్చాలి  పెరుగుతో తింటే రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది.
 
పచ్చి బఠాణీ తాలికలు

కావలసినవి: బియ్యప్పిండి - 3 కప్పులు; పచ్చి బఠాణీలు - కప్పు; పచ్చిమిర్చి ముద్ద - తగినంత; ఉప్పు - తగినంత; మెంతి కూర - 2 కప్పులు; పల్లీల పొడి - టేబుల్ స్పూను; నూనె - తగినంత; కొత్తిమీర కరివేపాకు - కొద్దికొద్దిగా; ఆవాలు, జీలకర్ర - టీ స్పూను చొప్పున; మినప్పప్పు - టీ స్పూను; ఉల్లి తరుగు - కప్పు

తయారీ: బఠాణీలు ఉడికించి గ్రైండ్ చేయాలి మూడు కప్పుల నీళ్లలో కొద్దిగా ఉప్పు జత చేసి, స్టవ్‌మీద ఉంచి మరిగాక, మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్‌ను వేసి కలిపి, బియ్యప్పిండి కూడా పోసి కలిపి దించాలి  పిండిని ముద్దగా చేసి మురుకుల గొట్టంలో పెట్టి, చిల్లుల పళ్లెంలో వేసి ఆవిరిపై ఉడికించుకోవాలి  మొత్తం పిండిని ఈ విధంగా చేసి పక్కన ఉంచాలి  బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేగాక ఉల్లి తరుగు, మెంతి కూర కూడా వేసి ఉడికిన తర్వాత తగినంత పచ్చి మిర్చి పేస్ట్, ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉడికాక, ఉడికించిన బియ్యప్పిండి మురుకులు వేసి బాగా కలపాలి  వేడయ్యాక పల్లీల పొడి వేసి కలిపి దించేయాలి.
 
 

మరిన్ని వార్తలు