అవి సజీవ పాత్రలు

5 May, 2015 12:08 IST|Sakshi
అవి సజీవ పాత్రలు
  • సినీ రచయిత కాశీ విశ్వనాథ్
  •  
    గురజాడ గిరీశం, చిలకమర్తి గణపతి, మునిమాణిక్యం బారిష్టరు పార్వతీశం..ఇలాంటి కొన్ని హాస్య పాత్రలు తెలుగు సాహిత్యంలో చిరంజీవులు. అలాగే మన సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు ఎప్పటికీ సజీవాలే. ఇలాంటి ఎన్నో అద్భుత హాస్య పాత్రలు ఆయా రచయితల ఆలోచనా మథనంలోంచి పుట్టినవే. నిజానికి ఆలాంటి క్యారక్టర్స్ మన మధ్య మసిలే మనుషుల నుంచి సృష్టించినవే. చేయి తిరిగిన సీనియర్ సినిమా రచయిత కాశీ విశ్వనాథ్ కూడా ఎన్నో చక్కని పాత్రలను వెండితెరపై పండించి నేటికీ వాటి గురించి స్మరించుకునేలా చేసిన ప్రతిభావంతుడు. ఆయన సృష్టించిన ప్రసిద్ధ  క్యారక్టర్ల పుట్టుపూర్వోత్తరాలు ఆయన మాటల్లోనే..       ..:: శ్రీనివాసరావు కిలారి
     
     ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది..’ అంటూ నూతన్ ప్రసాద్ తనదైన అద్భుతమైన మాడ్యులేషన్‌తో పలికే డైలాగ్ ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకులు మరచిపోలేరు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమాలో నూతన ప్రసాద్ పోషించిన ఇన్‌స్పెక్టర్ పాత్ర పలికే ఆ సంభాషణలు ఇప్పటికీ మన చెవుల్లో మార్మోగుతూ ఉంటాయి. అదే సినిమాలో రావుగోపాలరావు పోషించిన మాలిష్ పాత్ర కూడా అలాంటిదే. ఆ పాత్ర ప్రవర్తన     గురించి ఇప్పటికి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. ఆ సినిమా విజయంలో వీరి పాత్రల ద్వారా పండిన హాస్యం చాలా ముఖ్యపాత్ర వహించింది. ఆ పాత్రల పరిచయం గురించి చెప్పాలంటే దాని వెనుక ఉన్న కథ గురించి చెప్పుకోవాలి. అప్పటికి విజయ బాపినీడు నిర్మాణంలో చిత్రం స్క్రిప్టు వర్క్ మొత్తం పూర్తయింది. అయితే ఇంకా కథలో ఏదో కొద్దిగా వెలితి కనిపించడంతో అప్పటికే నేను నాటకాల్లో భాగంగా సృష్టించింది ఇన్‌స్పెక్టర్. అప్పుడు నేను వర్క్ చేసే ఆఫీస్‌లో ఓ గుమస్తా ఉండేవాడు.
     
     ఆఫీస్ వర్క్ మొత్తం తానే చేస్తున్నాననే ఫీల్ అవుతూ.. ఎవరైనా మాట్లాడించేందుకు ప్రయత్నిస్తే ఆఫీస్ వర్క్ సార్ ఈ సమయంలో మాట్లాడటం కుదరదనేవాడు. ఆఫీస్ పని మొత్తం తనే చేస్తున్నానే ఫీలింగ్ అతనిలో కనిపించేది. అతన్ని స్పూర్తిగా తీసుకుని దానిని ఇన్‌స్పెక్టర్ పాత్రకు ఆపాదించాను. అలాగే రావుగోపాలరావు చేసిన మాలిష్ పాత్ర కూడా నాకు తారసపడిన ఒక వ్యక్తి ధోరణి నుంచి  తీసుకున్నదే. నేను రాజమండ్రి వెళ్లినప్పుడు అక్కడ నాకో మాలిష్ ఎదురయ్యాడు. ఎంత సేపు పొగుడుతూనే ఉన్నాడు. అతని మాటలు వింటే ఎలాంటి వారైనా ముగ్ధులైపోవాల్సిందే..అలాంటి వ్యక్తి తాగిన తర్వాత ఎలా మాట్లాడుతాడో ఊహించుకుని అతని పాత్ర తయారు చేసుకున్నా.. దానిని రావుగోపాలరావు పోషించారు. ఈ పాత్రల గురించి చెప్పిన తర్వాత విజయ బాపినీడు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి కథలో భాగంగా పెట్టడంతో ఆ పాత్రలు అనుకున్నట్లే మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.
     
     ఆ పాత్రలకు ప్రాణం.. నటుల గొప్పతనం..
     నటన అంటే ఏదో సెట్‌లోకి వచ్చి డెరైక్టర్ ఇచ్చిన స్క్రిప్టు తీసుకుని టేకుల మీదు టేకులు తీసుకొని చెప్పడం కాదు. దానిలో చాలా గొప్పతనం ఉంది. అలాంటి గొప్పతనం అప్పటి నటులకే సాధ్యం. ఎందుకంటే అప్పుడు చాలా మంది రంగస్థలం నుంచి వచ్చివారే కావడం వలన పాత్ర తాము అనుకున్న దానికంటే గొప్పగా వచ్చేంత వరకు అసలు విశ్రమించే వారు కాదు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్ర గురించి నూతన్ ప్రసాద్‌తో చెప్పే సమయంలో ఆయన నేరుగా మా ఇంటికి వచ్చారు. ఆయన బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లు పాత్రను నటించి చూపిస్తే దానిని మూడు రోజుల పాటు ప్రాక్టీస్ చేసి ఆయన నేర్చుకొచ్చి మరల చేసి చూపించారు.

    రావుగోపాలరావు పోషించిన మాలిష్ పాత్ర గురించి ఆయన నన్ను ఇంటికి పిలిపించుకొని ప్రాక్టీస్ చేశారు. అలా రెండు పాత్రలు పూర్తిగా న్యాయం చేస్తామని అనుకున్న తర్వాత వాటి షూటింగ్ మొదలుపెట్టారు. షూటింగ్ సమయంలో కూడా నన్ను పక్కనే ఉంచుకుని నేను అనుకున్న విధంగా వచ్చిందో రాలేదో అడిగి, రాకుంటే మరోసారి చేస్తామని చెప్పి మరి చేసేవారు. అది అప్పటి నటుల్లో ఉండే డెడికేషన్. నూతన్ ప్రసాద్ కోసం క్రియేట్ చేసిన ఆ ఇన్‌స్పెక్టర్ పాత్రను 11 సినిమాల్లో సీక్వెల్‌గా కొనసాగించి, చిన్న చిన్న మార్పులు చేసి నవ్వించడం అంటే మామూలు విషయం కాదు.

మరిన్ని వార్తలు