నా భార్య కళ... ఇదేనా కల

18 Mar, 2020 07:59 IST|Sakshi

‘జీవితం మనం ప్లాన్‌ చేసుకున్న ప్రకారం ఉండదని బాగా నమ్ముతాను. ఎందుకంటే నేను అనుకున్నవాటికన్నా నన్ను వేరేగా చూపింది ఈ లైఫ్‌ జర్నీ’అంటూ తన గురించి పరిచయం చేసుకున్నారు ప్రతాప్‌ అభి. ‘శశిరేఖ పరిణయం’,‘కుటుంబ గౌరవం’, ‘కుంకుమపువ్వు’, ‘తేనెమనుసులు’, ‘నిన్నే పెళ్లాడతా..’ఇలా వరుస సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు చిరపరిచితుడు ప్రతాప్‌ అభి.తన గురించి ఇలా వివరించారు.

‘సీరియల్స్‌ చేస్తూనే నాలుగేళ్ల క్రితం ‘ముద్దపప్పు – ఆవకాయ’ టైటిల్‌తో వెబ్‌సీరీస్‌ చేశాను. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చిన్నప్పటి నుంచి యాక్టర్‌ కావాలని ఆలోచన ఏమీ లేదు. మాది ఖమ్మం జిల్లా పాల్వంచ. మా నాన్నగారు పవర్‌ స్టేషన్‌లో ప్రభుత్వోద్యోగి. అమ్మ గృహిణి. ముగ్గురు అన్నదమ్ములం. ఇంట్లో నేనే పెద్దవాడిని. నా ఇష్టాలకు ఇంట్లో ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కానీ, నా భవిష్యత్తుకు ఒక మార్గం వేసుకోవడంలో మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఇందులో పాఠాలు ఎన్నో నేర్చుకున్నాను.

నిన్నే పెళ్లాడతా...
‘జీ’ తెలుగులో వస్తున్న ఈ సీరియల్‌ నాకు జీవితాన్నే ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సీరియల్‌లో హీరోయిన్‌గా నటించిన అనూష హె గ్డే నిజ జీవితంలో నా అర్ధాంగి అయ్యింది. ఇప్పుడు అనూష  ‘సూర్యకాంతం’ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్‌లో ఏర్పడిన మా పరిచయం స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. తనది మంగుళూరులోని పుత్తూరు. మా ఇరు కుటుంబాల వాళ్లు మా పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇద్దరం కిందటి నెలలో పెళ్లి చేసుకున్నాం.

త్రీ క్యారెక్టర్స్‌...
బుల్లితెర మీద నా లైఫ్‌ ఇచ్చిందే ‘శిశిరేఖపరిణయం’ సీరియల్, ఆ తర్వాత తేనెమనసులు. ఇప్పుడు నిన్నే పెళ్లాడతా! ఈ మూడు సీరియల్స్‌లోని మూడు క్యారెక్టర్స్‌ నాకు మంచి గుర్తింపునిచ్చాయి. అయితే, సీరియల్స్‌లో ముందు కథ విన్నప్పుడు క్యారెక్టర్‌ వేరుగా ఉంటుంది. ఆ తర్వాత రేటింగ్‌ బట్టి కథ, క్యారెక్టరైజేషన్‌ అన్నీ మారుతాయి. దానిని మనం డిసైడ్‌ చేయలేం. అందుకే లైఫ్‌ అంటే ఇలాగే ఉండబోతుందని ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకోను.

విధిని నమ్ముతాను...
చదువుకునే రోజుల్లో దేవుడు–దెయ్యం అంటూ నమ్మకాలు ఏవీ లేవు. ప్రసాదాల కోసం గుడికి వెళ్లాలని అనుకునేవాడిని. కుటుంబం అంతా కలుసుకోవడానికి ఒక మంచి సందర్భం అనుకునేవాడిని. ఇంటర్మీడియట్‌ నుంచి నాకు తెలియకుండానే నా జీవితంలో కొన్ని స్ట్రగుల్స్‌ ఫేస్‌ చేశాను. ఆ సమయంలో భయంతో స్టార్ట్‌ అయిన భక్తి ఇప్పుడు ప్రేమగా మారింది. ఇలా జరిగి తీరాల్సిందే అని గట్టిగా నేను అనుకున్నప్పుడల్లా అలా పాజిటివ్‌ ఫలితాలు వచ్చాయి. దీంతో నమ్మకం మీద ఎక్కువ నమ్మకం ఏర్పడింది. పంచభూతాలు ఉన్నట్టే దైవం కూడా ఉందని, భయానికి ధైర్యంలా, ప్రశ్నకు సమాధానంలా ఈ సృష్టికి భగవంతుడు ఉన్నాడని నమ్ముతాను.

ఆర్మీకి వెళ్లాలనుకున్నా
ఇంటర్మీడియట్‌ టైమ్‌లో ఆర్మీకి వెళ్లాలని చాలా ఆరాటపడ్డాను. సైనికుడిని కావాలన్నది నా లక్ష్యంగా ఉండేది. కానీ, అనుకోని కారణాల వల్ల ఆర్మీకి వెళ్లే అవకాశం కోల్పోయాను. ఆ విషయం అర్ధమయ్యాక డిప్లమా ఇన్‌ యానిమేషన్, మల్టీమీడియా కోర్సు చేశాను. ఇది పూర్తయ్యాక కోరుకున్న కంపెనీలో అవకాశాలు రాలేదు. దీంతో 2009 నుంచి సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాను. 2013లో ఒక సినిమాలో అవకాశం వచ్చింది. కానీ, అది మొదట్లోనే ఆగిపోయింది. అయితే నిరాశ చెందలేదు. పడిపోయిన దగ్గరే ప్రయత్నాలు చేయాలనుకున్నాను. అప్పుడు ‘శిశరేఖ పరిణయం’ సీరియల్‌ ఆడిషన్స్‌కి పిలుపు వచ్చింది. సెలక్ట్‌ అయ్యాను. అప్పటినుంచి ఈ ఫీల్డ్‌లో కొనసాగుతున్నాను.

నా భార్య కళ .. నా కల
జీవితంలో బాగా సెట్‌ అవ్వాలి. పచ్చదనానికి దగ్గరగా ఉండాలి. వ్యవసాయం చేయాలి. పక్షులతో కబుర్లు చెప్పాలి. మూగజీవాల ఆలనాపాలన చూసుకోవాలి. అందుకు ఒక ఫామ్‌ హౌజŒ  ఏర్పాటు చేసుకోవాలనేది ఆలోచన. అంతకుమించి ఒక నృత్య అకాడమీ ఏర్పాటు చేయాలన్నది కల. నా భార్య అనూష క్లాసికల్‌ డ్యాన్సర్‌. తనకు నృత్యం అంటే ప్రాణం. తన కోసమే ఇప్పుడు కల కంటున్నా. దానిని నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నా. విధి ఎటువైపుగా తీసుకెళుతుందో చూడాలి.’ – సంభాషణ: నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు