ఎడతెగని సేవా గుణం...

2 Jul, 2014 01:07 IST|Sakshi
ఎడతెగని సేవా గుణం...

ఎనిమిది పదుల సాహస కోణం...
ఆదర్శం

హైదరాబాద్ నుంచి ఈజిప్ట్‌కి బయలుదేరిన విమానంలో పదిమంది భారతీయులు ఉన్నారు. వారంతా వారంరోజుల పాటు ఈజిప్ట్‌లో విహరించడానికి బయలుదేరారు. ఆ పదిమందిలో సీతా పెయింటాల్ ఉన్నారు. ఆమె తన బ్యాగ్‌లోంచి ఓ ఐపాడ్ తీసి మెసేజెస్ చెక్ చేసుకుంటూ రిప్లైలు ఇవ్వడం మొదలుపెట్టారు. అది చూసిన వారంతా ‘అంత పెద్దావిడ ఇంత లేటెస్ట్ టెక్నాలజీ వాడటమా’ అని ఆశ్చర్యపోయారు.
 
కాశ్మీర్ సిక్కు కుటుంబానికి చెందిన సీతా పెయింటాల్‌కి ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. పుట్టిందీ, పెరిగిందీ, చదువుకున్నదీ అంతా ఢిల్లీలోనే. ఎం.ఏ. ఎకనామిక్స్ చదివి, నాలుగేళ్లపాటు లెక్చరర్‌గా ఉద్యోగం చేశారు. భారత నౌకాదళంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్న దల్జీత్ సింగ్ పెయింటాల్‌తో వివాహం తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి గృహిణిగా మారారు. ‘‘నాకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. వారి ఆలనపాలనలతోటే సమయమంతా గడిచిపోయేది. మా పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలంటే కష్టమనిపించి, బి.ఇడి. చేశాను. ఇప్పుడు మా పెద్దమ్మాయి డాక్టరు. రెండో అమ్మాయి సైకాలజీలో ఆనర్స్ చేసింది. అబ్బాయి ఐ.ఐ.టి. పూర్తయ్యాక హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎమ్.బి.ఏ, చేసి కెనడాలో స్థిరపడ్డాడు. మా వారి ఉద్యోగరీత్యా అనేక నగరాల్లోనే కాక ఇంగ్లాండ్‌లోనూ ఉన్నాం. ఆయన ఉద్యోగ విరమణ చేశాక ఢిల్లీలోనే స్థిరపడ్డాం’’ అని తన గురించి క్లుప్తంగా వివరించారు సీతా పెయింటాల్.
 
కుటుంబ బాధ్యతలు చూసుకోవడమే కాకుండా, సమాజ సేవాకార్యక్రమాల్లోనూ పాలుపంచుకోవడం ప్రారంభించారు పెయింటాల్. మొబైల్ క్రష్‌లో... కార్మికుల పిల్లలకు విద్య, వైద్యం కోసం ఎన్నో సేవలు చేశారు. అంధ విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారి కోసం చరిత్ర, ఆర్థికశాస్త్రం మొదలైనవి తన గొంతులో రికార్డ్ చేసి వినిపించారు. అక్కడితో ఆగలేదామె. ప్రత్యేకించి క్యాన్సర్ బాధితులకు ఎన్నోరకాలుగా తన సేవలు విస్తరించారు.
 
ఆమె అలా క్యాన్సర్ బాధితుల పక్షాన నిలవడానికి కారణం... ‘‘ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తున్న మా చెల్లికి రొమ్ము క్యాన్సర్ సోకిందని తెలిసింది. నాకు ఎంతో బాధ అనిపించింది. ఆ వ్యాధి గురించి తెలుసుకోవాలనుకున్నాను. క్యాన్సర్ గురించిన పుస్తకాలు తెచ్చుకుని కూలంకషంగా అధ్యయనం చేశాను. ఆ వ్యాధి బారిన పడ్డవాళ్లకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు. అందుకు తగ్గట్లే ఆమె ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వారి క్యాన్సర్ సహయోగ్ ఢిల్లీ శాఖలో చేరి, ఆరోగ్యసేవ కొనసాగిస్తున్నారు. ఈ సేవాస్ఫూర్తిని మరింతమందిలో రగిలించడానికి ఎంతోమందిని వలంటీర్లుగా తయారుచేసి వారి ద్వారా కార్యక్రమాలు నడిపిస్తున్నారు.
 
 ‘‘ఇప్పుడు ఆ సంస్థలో వందలాదిగా స్వచ్ఛంద సేవకులు వచ్చి చేరుతున్నారు. సంస్థకు వచ్చే విరాళాలతో రొమ్ము క్యాన్సర్ పీడితులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నాం’’ అని వివరించారు సీతా పెయింటాల్.
 వయసెరుగని...
 
ఇటీవలే ఆమె తన కుటుంబ సభ్యులతో ఈజిప్ట్ పర్యటించారు. తనతో పాటు ఓ బుల్లి కెమెరాను తెచ్చుకున్నారు. పిరమిడ్లను చకచకా ఎక్కుతూ ఎన్నో ఫోటోలు తీసుకున్నారు. నైలునదిలో నౌకావిహారం చేస్తూ అక్కడి దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. స్వయంగా తాను కూడా క్యాన్సర్ బారినపడ్డ ఆమె, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు,  తమ దైనందిన జీవితం ఎలా గడపాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వారి భావోద్వేగాలను పంచుకుని, వ్యాధిని ఎదుర్కొనడానికి తగిన సలహాలు ఇస్తున్నారు. అప్పుడే ఆమె ఇద్దరు చెల్లెళ్లూ, భర్త మరణించారు. అయినా ఆమె తన కర్తవ్యాన్ని విస్మరించలేదు.
 
‘‘క్యాన్సర్ వ్యాధి మీద మరింత మందికి అవగాహన కల్పించాలనుకున్నాను. ‘క్యాన్సర్ సహయోగ్ సంస్థ’ ద్వారా ఢిల్లీలోని ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నాను. ‘నాకు హిందీ, పంజాబీ, ఇంగ్లీష్ భాషలు వచ్చు. క్యాన్సర్ వ్యాధి బారిన పడినవారెవరైనా ప్రతి రోజూ రాత్రి నాకు ఫోన్ చేయచ్చు (ఫోన్ నం. 9818488122). వారికి నైతిక స్థైర్యాన్ని అందజేస్తాను’’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పే ఈ పండుటాకును జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే వారందరూ ఆదర్శంగా తీసుకుని తీరాలి. ఆమెలోని అనుకూల దృక్పథాన్ని అందరూ అలవరచుకోవాలి.
 - గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

మరిన్ని వార్తలు