నా భర్త మరొకామెతో.....

3 Jan, 2016 22:59 IST|Sakshi
నా భర్త మరొకామెతో.....

మైనర్ ఆడపిల్లల కష్టడీ తల్లికే!
లీగల్ కౌన్సెలింగ్

 
మా పెళ్లయి నాలుగేళ్లయింది. పిల్లలు లేరన్న అసంతృప్తి తప్ప మరే లోటూ లేదు. ఎంతో అన్యోన్యమైన దాంపత్యం మాది. ఇటీవల కాలంలో ఆయన ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది. కొందరు స్నేహితుల సహవాసం వల్ల ఆయనకు నైట్‌పార్టీలు ఎక్కువయ్యాయి. మొదట్లో లైట్‌గా డ్రింక్ చేసేవారు. రానురాను క్లబ్‌లకు, పబ్‌లకు వెళ్లడం ఎక్కువైంది. తాగుడు కాస్తా వ్యసనంగా మారింది.   డ్రగ్స్‌కి కూడా బానిసయ్యారు. కోపం పట్టలేక నిలదీశాను. ఛడామడా తిట్టేశాను. విషయం ఎలాగూ తెలిసిపోయింది కదా అని ఆయన ప్రవర్తన మరింత భయానకంగా మారింది. తాను ఏమి చేస్తున్నానో తెలియని పరిస్థితిలో ఒకరోజు గొంతు పిసకబోయారు. సమయానికి ఎవరో రాబట్టి సరిపోయింది కానీ... లేకుంటే ఏమయి ఉండేదో..?

డీ అడిక్షన్ సెంటర్‌కు కానీ, హాస్పిటల్‌కు గానీ తీసుకు వెళ్దామని ప్రయత్నించాను కానీ, ఆయన వినడం లేదు. నాకు ఆయనంటే చాలా ప్రేమ. ఆయనను బాగు చేసుకోవాలని ఉంది. దయచేసి కేసులు వేయమని సలహా ఇవ్వకండి. చికిత్స చేయించే మార్గం ఏమైనా ఉంటే సూచించండి.
 - బిందు శ్రీ, కోదాడ


 మీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. భయపడకండి. అతనిని చికిత్సకు పంపే మార్గం ఉంది. కానీ కోర్టును ఆశ్రయించవలసి ఉంటుంది. అంటే కేవలం ఒకటి రెండుసార్లు వెళ్తే సరిపోతుంది. మీరు మానసిక ఆరోగ్య చట్టం 1987ను అనుసరించి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి, రిసెప్షన్ ఆర్డర్ పొందాలి. అంటే మత్తుపదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి, అస్వస్థుడై మానసిక ప్రవర్తన మారిపోయిన వ్యక్తులను మానసిక రోగుల చికిత్సాలయంలో నిర్బంధించి, చికిత్స ఇవ్వమని ఇచ్చే ఆర్డర్. ఈ ఆర్డర్ మేరకు బలవంతంగా చికిత్సకు పంపవలసిందిగా మీరు రిసెప్షన్ పొందండి. అప్పుడు పోలీసులు మీ వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మేజిస్ట్రేట్ గారు రోగిని వైద్యపరీక్షకు పంపి, అతని మానసిక స్థితిని బట్టి అతని సంక్షేమాన్ని, మీ భద్రతను దృష్టిలో పెట్టుకుని మానసిక రోగుల చికిత్సాలయానికి గానీ వైద్యశాలకు గానీ తరలించమని ఆర్డర్స్ జారీ చేస్తారు. మీ వారు తప్పకుండా ఆరోగ్యవంతులవుతారు.
 
 మా పెళ్లయి పదిహేనేళ్లయింది. మాకు ముగ్గురు పిల్లలు. ప్రభుత్వోద్యోగి అయిన నా భర్త మరొకామెతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను, నా పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తుండడంతో భరించలేక పిల్లలను తీసుకుని ఎనిమిదేళ్ల క్రితం పుట్టింటికొచ్చాను. చిన్న ఉద్యోగం చేసుకుంటూ వాళ్లని పోషించుకుంటున్నాను. అయితే ఇప్పుడు వాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. వాళ్ల చదువులు తదితర ఖర్చులు భరించడం నా వల్ల కావడం లేదు. ఆయన దగ్గర నుంచి ఇంతవరకూ రూపాయి కూడా నాకు భరణం అందలేదు. ఇప్పుడు నేను ఆయన నుంచి భరణం కోరవచ్చా?
 - బి. నాగమణి, ఏలూరు

 మీరు మీ పరిస్థితినంతా వివరిస్తూ, మీ ఆయన నుంచి భరణం ఇప్పించవలసిందిగా కోర్టువారిని కోరుతూ 125 సిఆర్‌పీసీ కింద అర్జీ పెట్టుకోండి. వీలయితే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కింద ఆయన శాలరీ స్లిప్‌ను కూడా జతచేయండి. కుదరకపోతే సంబంధిత డిపార్టుమెంట్ వారిని సాక్షులుగా పిలవండి. కోర్టు వారు ఆయన సంపాదన సామర్థ్యాన్ని బట్టి మీకు, మీ పిల్లలకు మెయింటెనెన్స్ కింద న్యాయబద్ధంగా రావలసిన మొత్తాన్ని ప్రతినెలా ఆయన జీతం నుంచి నేరుగా మీకే అందేలా ఏర్పాటు చేస్తారు.  
 
మా పెళ్లయి పదేళ్లయింది. మా ఇద్దరి మధ్య అన్యోన్యత ఏమాత్రం లేదు. దాంతో నేను, నా భర్త చాలా ఏళ్లనుంచి విడివిడిగా జీవిస్తున్నాం. నా ఇద్దరు ఆడపిల్లలూ నా దగ్గరే ఉంటున్నారు. ఈ మధ్యే నా భర్త, పిల్లల కష్టడీ కోసం కోర్టులో కేసు వేశారు. నాకేమో పిల్లల కష్టడీ ఆయనకు ఇవ్వడం ఇష్టం లేదు. నేను ఏం చేయాలి?
 - కుమారి, విశాఖపట్నం

 మీరింకా లీగల్‌గా డైవోర్స్ తీసుకోలేదు. చట్టప్రకారం మైనర్ పిల్లల సంరక్షణ బాధ్యత తండ్రికే ఉంటుంది. అయితే మీ పిల్లలు  మీతోనే కలిసి ఉంటున్నారు, అదీగాక మైనర్ పిల్లలకు తల్లి అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల జడ్జిగారు పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, దాని ప్రకారం నిర్ణయం తీసుకుని, తీర్పు ఇస్తారు. సాధారణంగా ఎదిగే ఆడపిల్లలకు తల్లి అవసరం ఎంతో ఉంటుంది కాబట్టి కష్టడీ మీకే ఇస్తారు. అయితే తండ్రికి వారానికో పదిహేను రోజులకో ఒకసారి పిల్లలను చూసేందుకు విజిటేషన్ రైట్స్ ఇస్తారు. మీరు అంగీకరించక తప్పదు.
 
ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్
ఫ్యామిలీ కౌన్సెలర్
 
పని చేసే మహిళలకు అండ... లైంగిక వేధింపుల చట్టం
కేస్ స్టడీ

సుజాత ఒక ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి. ఉద్యోగరీత్యా భర్త విదేశాలలో ఉంటాడు. ఆఫీస్‌లో నిజాయితీ గల వర్కర్‌గా, హుందాగా ఉండే మహిళగా సుజాతకి మంచి పేరుంది. ఆఫీస్ వ్యవహారాలలో  నిక్కచ్చి. ఎవరికి ఏ కష్టమొచ్చినా,  స్పందించే ఆమెను అందరూ గౌరవించి, అభిమానిస్తారు. ఇంతలో కొత్తగా వచ్చిన ఆఫీసర్‌తో సమస్య మొదలైంది సుజాతకి. ఛార్జ్ తీసుకున్న రోజు నుంచే అతనికి సుజాతపై కన్ను పడింది. అందంగా, హుందాగా ఉండే సుజాతని ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. ఆయన వయసు రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉంది. అయినా చెడుబుద్ధి మాత్రం ఇంకా పోలేదు. దాంతో అవసరం ఉన్నా, లేకున్నా సుజాతని తన ఛాంబర్‌కి పిలిపించుకుని ద్వంద్వార్థ సంభాషణలు చేయడం మొదలు పెట్టాడు. అతని వ్యవహారం పసిగట్టిన సుజాత అతనితో అంటీముట్టనట్టుగా వ్యవహరించసాగింది. ఎంతో అవసరం ఉంటే తప్ప అతని ఛాంబర్‌కు వెళ్లడం లేదు. ఫైళ్లన్నీ అటెండర్‌తో పంపసాగింది. దాంతో అతనికి పంతం పెరిగింది. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అదనపు పని అప్పగించి, ఆఫీస్ టైమ్ దాటాక కూడా ఆఫీస్ పని చేసేలా వేధించసాగాడు. ఇవన్నీ సుజాతని ఎంతో కృంగదీశాయి.

‘పని చేసే చోట లైంగిక వేధింపుల చట్టం’ గురించి గతంలో ఇక్కడ పని చేసి వేరే చోటికి బదిలీ అయిన తన పై అధికారి రెండు మూడు అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసింది. ఆ చట్టం ప్రకారం ‘ఫిర్యాదుల కమిటీ’ కూడా ఏర్పడేలాగా కృషి చేసింది. ఈ విషయం గుర్తొచ్చి  కొంత రిలీఫ్ కలిగింది. ఇక లాభం లేదనుకుని ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది సుజాత. వారు దానిని ‘ఫిర్యాదుల కమిటీ’ కి పంపించారు. వారు దీనిని క్షుణ్ణంగా విచారించి, తోటి ఉద్యోగుల అభిప్రాయాలను కూడా అడిగి, వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని  ‘లైంగిక వేధింపులు’ జరిగాయని నిర్థారణకు వచ్చారు. వేధింపులకు గురి చేసిన ఉన్నతాధికారిని పిలిచి విచారించి, ‘ప్రవర్తన మార్చుకుంటారా లేక క్రిమినల్ కేసు పెట్టమంటారా?’ అని అడిగారు. దెబ్బకు దిగి వచ్చిన మేనేజర్ సుజాతకి క్షమాపణ పత్రం రాసి ఇచ్చి, తనే ఓ మారుమూల ప్రదేశానికి బదిలీ చేయించుకుని వెళ్లాడు. పని చేసే చోట లైంగిక వేధింపుల గురించిన అవగాహన ఉండబట్టి సుజాత తన సమస్యను ధైర్యంగా పరిష్కరించుకోగలిగింది.

మరిన్ని వార్తలు