వేధింపులు ఇన్ వర్క్‌ప్లేస్

3 Oct, 2016 00:01 IST|Sakshi
వేధింపులు ఇన్ వర్క్‌ప్లేస్

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరిన పాతికేళ్ళ ప్రత్యూషకు ఎవరితోనైనా నవ్వుతూ, తుళ్ళుతూ ఉండడం, సరదాగా, ఉత్సాహంగా పనిచేయడం అలవాటు. ఆమె టీమ్‌లోని మిగతా అయిదుగురికీ పెద్ద టానిక్ అది. కానీ, ఆమె స్నేహాన్ని ఓ టీమ్ మెంబర్ అపార్థం చేసుకున్నాడు. ఆమె తెలివితేటలు, ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించే సామర్థ్యం చూసి ఆరాధించడంతో మొదలుపెట్టాడు. చివరకు ఆమెతో అతి చనువు ప్రదర్శించసాగాడు. కాఫీకి రమ్మనడంతో మొదలై కాళ్ళు తగిలించడం దాకా వెళ్ళింది. ఎన్నిసార్లు చెప్పి చూసినా మారని ఈ కొలీగ్ గురించి, చివరకు పైవాళ్ళకు కంప్లయింట్ చేయక తప్పింది కాదు ప్రత్యూషకు!
 
మూడున్నర పదుల వయసున్న సునీతకు ఆ ఉద్యోగం కొత్త కాదు. కొలీగ్సూ కొత్త కాదు. కానీ, కొత్త బాస్ వచ్చిన తరువాత కొద్ది రోజులుగా మాత్రం ఆమెకు ఎందుకో ఇబ్బందిగా ఉంది. వేషభాషల్లో, ఉద్యోగ నిర్వహణలో ఉత్సాహం ఉట్టిపడే ఆమె పట్ల కొత్త బాస్ చూపిస్తున్న ‘అతి చనువు, చొరవ’ ఈ ఇబ్బందికి అసలు కారణం. బాస్ పిలుపు, పలకరించే తీరు, నవ్వుతూ మాట్లాడుతున్నా ఆ మాటల వెనుక తొంగిచూసే అసభ్యత ఇప్పుడు సునీతను కలవరపరుస్తున్నాయి. దూరం నుంచి చూసే వారికి అంతా మామూలుగానే అనిపించినా, తినేసేలా చూసే ఆ బాస్ చూపుల బాధేమిటో సునీతకే తెలుసు. మాటలతో మొదలైన కొద్ది నెలలకే ఉత్తిపుణ్యానికే మనిషిని తాకే దాకా వెళ్ళడంతో, అప్పటి దాకా అన్నీ సహించి, భరించిన సునీత చివరకు తమ కంపెనీలో హెచ్.ఆర్. వాళ్ళకు ఫిర్యాదు చేసింది. వర్క్ ప్లేస్‌లో ‘లైంగిక వేధింపుల’ ఆరోపణలతో సదరు బాస్‌ను మరో ఊరికి బదిలీ చేశారు.

మహానగరం శివార్లలోని ప్రముఖ పంటల పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న యువ మహిళా శాస్త్రవేత్త దుర్గకు వాళ్ళ బాస్ నుంచి కావచ్చు... టీవీ యాంకర్‌గా కోటి ఆశలతో కొత్తగా మీడియాలోకి వచ్చిన ప్రశాంతి కావచ్చు... పేరున్న ఆ స్టోర్స్‌లో సేల్స్ విభాగంలో పని చేస్తున్న బాల కావచ్చు... స్థాయి తేడా కావచ్చేమో కానీ అందరు ఎదుర్కొంటున్న సమస్యా ఒకటే!
 
పని చేస్తున్న చోట లైంగిక వేధింపు... సెక్సువల్ హెరాస్‌మెంట్ ఇన్ వర్క్‌ప్లేస్... ఆధునిక భారతీయ సమాజంలో ఉద్యోగినులుగా ఆకాశంలో సగం అవకాశాల్ని ఇప్పుడిప్పుడే అందిపుచ్చుకుంటున్న మహిళల్ని తీవ్రంగా వేధిస్తున్న సమస్య. ఎన్ని చట్టాలు వచ్చినా, మరెంతగా మగవాళ్ళను చైతన్యం చేసినా... ఏటేటా పెరిగిపోతున్న కేసులతో, ప్రబలంగా కనిపిస్తున్న సమస్య.
 
పేరున్న సంస్థల్లోనూ...
‘నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’ (ఎన్.ఎస్.ఇ)లో అగ్రస్థానంలో నిలిచే తొలి 50 కంపెనీలు (ఫిఫ్టీ)... స్టాక్ మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే ‘నిఫ్టీ’ కంపెనీలు కూడా ఈ వేధింపులకు నిలయాలనీ, అక్కడ ఏటేటా ఈ వేధింపులు పెరుగుతున్నాయనీ తాజాగా వెల్లడైంది. అంతకు మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 26 శాతం మేర ఈ వేధింపుల కేసులు పెరిగాయి. నమోదైన కేసుల సంఖ్య ప్రకారం చూస్తే, అగ్రశ్రేణి సాఫ్ట్‌వేర్ సంస్థ ‘విప్రో’, ఆ తరువాత ‘ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంక్’, ‘ఇన్ఫోసిస్’ సంస్థలు ఈ లైంగిక వేధింపుల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచి, అపకీర్తిని మూటగట్టుకున్నాయి.
 
సర్వసాధారణంగా - ఐ.టి. రంగంలో, బ్యాంకింగ్ రంగంలో మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. ఈ ‘నిఫ్టీ’ 50 కంపెనీల్లో గత ఏడాది నమోదైన లైంగిక వేధింపుల కేసుల్లో నూటికి 80 ఈ రంగాల్లోవే! ‘కార్యాలయాల్లో మహిళలకు లైంగిక వేధింపుల (నిరోధక, నిషేధ, సహాయక) చట్టం -2013’ ప్రకారం సంస్థలన్నీ తమ ఆఫీసుల్లో నమోదైన కేసుల వివరాల్ని ఏటేటా వెల్లడించాల్సి వచ్చేసరికి ఈ సంగతులు బయటికొచ్చాయి. భారతీయ కార్యాలయాల్లో లైంగిక వేధింపులు లేవంటూ ఇటీవలి దాకా బుకాయిస్తున్న అనేక సంస్థలకు ఇది ఓ పెద్ద కనువిప్పు.
 
జరిగిన కథ... చట్టం ఏం చెబుతోంది?
నిజానికి, పని చేసే చోట్ల స్త్రీలకు జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధానికి మన ప్రభుత్వాలు చట్టం చేసి, దానికి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నాయి. ఒక్కసారి చరిత్ర చూస్తే - 1997లో రాజస్థాన్‌లో ఒక సామాజిక కార్యకర్త దారుణంగా గ్యాంగ్‌రేప్‌కు గురవడంతో ఈ సమస్యపై తొలిసారిగా దేశమంతా పెద్ద చర్చ జరిగింది. పనిచేసే మహిళల రక్షణకు సరైన చట్టం లేదని సుప్రీమ్ కోర్టు దృష్టికి రావడం, చివరకు భారత ప్రభుత్వం మహిళా ఉద్యోగులను వేధింపుల నుంచి కాపాడే చట్టం చేయడం, అటుపైన దాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ, మార్పులు చేయడం లాంటివి జరిగాయి.

ఇంట్లోని పనివాళ్ళు, రోజు కూలీలు, వాలంటీర్లు, తాత్కాలిక ఉద్యోగులు - ఇలా స్త్రీలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. శారీరకంగా తాకడం, లైంగిక వాంఛలు తీర్చమని కోరడం, లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం, అశ్లీల చిత్రాలు చూపించడం, అలాంటి మాటలు, చేష్టలు - అన్నీ లైంగిక వేధింపుల కేసు నమోదుకు దారి తీసే తప్పులే అని చట్టం చెబుతోంది. ఈ విషయంలో ఉద్యోగినుల్ని చైతన్యం చేయడానికి, వారికి అండగా నిలవడానికి వీలుగా సంస్థల్లో ‘అంతర్గత ఫిర్యాదుల సంఘం’ (ఐ.సి.సి) ఏర్పాటు చేయాలి. ఇప్పుడు దాదాపు ప్రతి సంస్థా ఇలాంటి కమిటీలు పెట్టాయి. సంఘటన జరిగిన 3 నెలల దాకా బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు చట్టంలో వీలుంది. ఫిర్యాదు వచ్చిన 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలి.
 
ఏటా పెరుగుతున్న కేసుల సంఖ్య
గణాంకాలు గమనిస్తే... 2013 - 14తో పోలిస్తే, 2014-15లో లైంగిక వేధింపుల కేసులు ఎక్కువ నమోదయ్యాయి. ఇక, 2014-15తో పోలిస్తే, ఈ ఏడాది మార్చితో ముగిసిన 2015-16లో ఈ కేసులు 26 శాతం పెరిగాయి. ఇలా నమోదవుతున్న కేసులు పెరగడం వెనుక మరో కారణం కూడా ఉందని నిపుణుల మాట! లైంగిక వేధింపుల కేసుల నమోదుకు మునుపటి కన్నా ఇప్పుడు పకడ్బందీ యంత్రాంగం ఉండడంతో నమోదు శాతం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. అయితే, మన భారతదేశం లాంటి పురుషాధిక్య సమాజంలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడడం సామాజికంగా, సాంస్కృతికంగా ఇప్పటికీ నిషిద్ధమనే అభిప్రాయం ఉంది.

అందుకే, నమోదు అవుతున్న కేసులతో పోలిస్తే నమోదు కాకుండా స్త్రీలు మౌనంగా భరిస్తున్నవే ఎక్కువ. అందుకే, అనేక సంస్థలు, వాటి యాజమాన్యాలు ఈ విషయంపై తమ ఉద్యోగుల్లో మరింత చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. టి.సి.ఎస్. లాంటి ఐ.టి. సంస్థలు ఈ చైతన్య కార్యక్రమాల్ని మరింత ఎక్కువ చేస్తున్నట్లు చెబుతున్నాయి.
 
ఆ రకంగా పెద్ద సంస్థలు ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు దీన్ని కాస్తంత సీరియస్‌గానే తీసుకుంటున్నాయి. చివరకు, ఫిర్యాదుపై విచారణ జరిగే కాలంలో బాధితురాలు లిఖిత పూర్వకంగా కోరుకుంటే, 3 నెలల దాకా సెలవు కూడా యాజమాన్యం ఇవ్వాలి. ఇటీవలే సాక్షాత్తూ కేంద్ర మంత్రివర్యులు లోక్‌సభ సాక్షిగా చట్టంలో ఉన్న ఆ సదుపాయాన్ని గుర్తుచేశారు. కానీ, ఏటా పెరుగుతున్న వేధింపుల కేసులతో తాజా గణాంకాల్ని చూస్తే, ఇవొక్కటే చాలేటట్లు లేదు. వర్క్‌ప్లేస్‌లో వాతావరణంతో పాటు, మహిళలతో కలసి పని చేసేవాళ్ళ మైండ్‌సెట్‌ను మరింతగా మార్చాలేమో! మానసిక పరిణతి, మహిళలంటే ఉన్నతమైన భావన మనందరిలో అవసరమేమో!
 
అంతా పెద్దలే!
‘దొరికే దాకా... అందరూ దొరలే’ అన్న మాట లైంగిక వేధింపులకు పాల్పడిన కొందరిని చూస్తే అక్షరాలా నిజమనిపిస్తుంది. సమాజంలో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న మహామహులు సైతం ఈ తెగులుకు అతీతులు ఏమీ కాదు. సంచలనం రేపిన మనవాళ్ళ ఈ కేసులే అందుకే సాక్షి...

కె.పి.ఎస్. గిల్: పంజాజ్ మాజీ పోలీస్ డెరైక్టర్ జనరల్ (డి.జి.పి), తీవ్రవాదాన్ని అణచివేయడంలో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అధికారి కె.పి.ఎస్. గిల్ సైతం లైంగిక వేధింపుల కేసులో బుక్కయ్యారు. ఒక పార్టీలో సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారిణి రూపన్ దేవల్ బజాజ్‌ను అనుచితంగా తాకారంటూ, 1988లో ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తూ ఆ అధికారిణే ఫిర్యాదు చేసింది. గిల్ దోషి అని 1996లో కోర్టులో తేలింది. 2005లో సుప్రీమ్ కోర్టు ఆ విషయాన్ని నిర్ధారణ కూడా చేసింది. అయితే, గిల్ గారు మాత్రం కటకటాల వెనక్కి పోనే లేదు.
 
ఫణీశ్ మూర్తి: సాఫ్ట్‌వేర్ రంగంలో దేశంలోకెల్లా బాగా పేరు తెచ్చుకున్న ఫణీశ్ మూర్తి 2002లో లైంగిక వేధింపుల కేసు వల్లే ‘ఇన్ఫోసిస్’ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆయన సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు పాల్పడుతున్నారంటూ సెక్రటరీ రేఖా మాక్సిమోవిచ్ ఆరోపణలు చేయడంతో ఫణీశ్ ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది. చివరకు బాధితురాలికి 30 లక్షల డాలర్లు చెల్లించి, ‘ఇన్ఫోసిస్’ సంస్థ కోర్టు బయట రాజీ కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత మరో పదకొండేళ్ళకు 2013లో కూడా మళ్ళీ లైంగిక వేధింపుల ఆరోపణలతోనే ఒక అమెరికన్ ఐ.టి. సంస్థ నుంచి ఫణీశ్‌కు ఉద్వాసన పలికారు.
 
గోపాల్ కండా: ఇరవై మూడేళ్ళ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ 2012లో ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానా మాజీ హోమ్ మంత్రి గోపాల్ కండా లైంగిక వేధింపులకు తట్టుకోలేకే, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. న్యాయ విచారణ జరుగుతోంది.
 అశోక్ కుమార్ గంగూలీ: ఈ సుప్రీమ్ కోర్టు మాజీ న్యాయమూర్తి పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం అధిపతిగా ఉండేవారు. అయితే, ఒక హోటల్ గదిలో ఈ మాజీ జడ్జి గారు తనను లైంగికంగా వేధించారంటూ న్యాయశాస్త్ర విద్యార్థిని ఒకరు 2014లో ఆరోపణలు చేశారు. ముగ్గురు సభ్యుల సుప్రీమ్ కోర్టు ప్యానెల్ అయ్య గారి ప్రవర్తనను తప్పు పట్టింది. దాంతో, ఆయన పదవి నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.
 
తరుణ్ జె. తేజ్‌పాల్: ప్రముఖ జర్నలిస్టు, పరిశోధనాత్మక జర్నలిజమ్‌తో పేరు తెచ్చుకున్న ‘తెహెల్కా’ అధినేత కూడా సహోద్యోగినితో అనుచితంగా ప్రవర్తించారు. లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చిన తేజ్‌పాల్, గోవాలో ఒక కార్యక్రమం జరిగినప్పుడు తనపై అత్యాచారం జరిపారని మాజీ సహోద్యోగిని ఆరోపించారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది.
 
డేవిడ్ డేవిడర్: భారతీయ సంతతికి చెందిన రచయిత, పెంగ్విన్ కెనడా విభాగం హెడ్ అయిన డేవిడ్ మూడేళ్ళుగా తనను లైంగికంగా వేధిస్తున్నారనీ, చివరకు 2009లో ‘ఫ్రాంక్‌ఫర్ట్ బుక్ ఫెయిర్’ సందర్భంగా అఘాయిత్యం చేశారనీ సహోద్యోగిని లిసా రండిల్ ఆరోపించారు. దాంతో, 2010లో డేవిడ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
 
షియామక్ దావర్: హిందీ చిత్రసీమలో, అలాగే ‘ఐఫా’ లాంటి ప్రసిద్ధ సినీ వేడుకల్లో ప్రసిద్ధుడైన కొరియోగ్రాఫర్ షియామక్ దావర్‌పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. వాంకోవర్‌కు చెందిన ఆయన డ్యాన్స్ స్కూల్ మాజీ స్టూడెంట్‌లు ఇద్దరు గత ఏడాది కెనడాలో ఆయనపై సెక్సువల్ హెరాస్‌మెంట్ ఆరోపణలు చేస్తూ, దావా వేశారు. ఓ ఆధ్యాత్మిక సంస్థ ద్వారా దావర్ తమను ‘నియంత్రిస్తున్నార’నీ, లైంగికంగా లొంగిపోయేలా తమను మలుస్తున్నారనీ ఆరోపించారు. కేసు ఇంకా తేలలేదు.
 
కొన్ని తప్పుడు కేసులూ..!
లైంగిక వేధింపుల చట్టం కొన్నిసార్లు దుర్వినియోగం పాలవుతోందన్న ఆరోపణలూ అడపా దడపా వినిపిస్తున్నాయి. అందుకు ఆ మధ్య జరిగిన ఒక కేసు ఉదాహరణ. ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలోని జూనియర్ టీమ్ మెంబర్ ఒకరు తన సీనియర్ దగ్గరకు వెళ్ళి, పక్కనే ఉన్న మరో డివిజన్‌లోని ఇంకో సీనియర్ తన చేయి పట్టుకొని, డిన్నర్‌కు రమ్మన్నాడంటూ ఆరోపించింది. అయితే, ఆఫీసు బయట జరిగినందు వల్ల సాక్షులెవరూ లేరంటూనే ఫిర్యాదు చేసింది. సంస్థలోని ‘అంతర్గత ఫిర్యాదుల సంఘం’ (ఐ.సి.సి) లోతుగా విచారిస్తే, సదరు ఫిర్యాదు తప్పని తేలింది.

ఫిర్యాదు చేసిన ఉద్యోగి జాబ్‌లో తన ప్రొఫైల్ మార్చుకోవడం కోసం పక్క డివిజన్ సీనియర్ ఉద్యోగిని అడిగినట్లూ, ఆయన అందుకు నిరాకరిస్తూ, ‘సరైన దోవలో నిర్ణీత సీనియర్ ద్వారా రమ్మనమ’ని చెప్పినట్లూ, అది నచ్చక ఆ ఉద్యోగి ఈ లైంగిక వేధింపుల కేసు పెట్టినట్లూ బయటకొచ్చింది. కొన్నిసార్లు ఇలాంటి తప్పుడు ఆరోపణలూ వస్తుంటాయి కాబట్టి, నిర్దోషులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే, లైంగిక వేధింపుల కేసుల్లో నిజానిజాల్ని జాగ్రత్తగా పరిశీలించాలని కోరుతున్న పురుషులూ లేకపోలేదు!
 
పెరుగుతున్న వేధింపులు
కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన గణాంకాలను వివిధ సంస్థలు కొద్దికాలంగా సేకరిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సహా అందరు వేసిన లెక్కలూ వేధింపులు పెరుగుతున్నాయనే సూచిస్తున్నాయి. జాతీయ మహిళా కమిషన్ (ఎన్.సి.డబ్ల్యు) సేకరించిన సమాచారం ప్రకారం కార్యాలయాల్లో నమోదైన లైంగిక వేధింపుల కేసుల వివరాలు ఇవీ...

- రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు