కామెడీ కార్పెట్‌

2 Nov, 2019 03:05 IST|Sakshi

నిషిద్ధాక్షరి

జీవితంలోని హాస్యాన్ని నలుగురికీ పంచుతుండే ప్రముఖ సామాన్యురాలు షబానా అజ్మీ. బహుశా ఈ స్వభావం ఆమెకు ఆమె తండ్రి కైఫీ అజ్మీ నుంచి వచ్చి ఉండాలి. ఆయనా అంతే, మానవ తప్పిదాల వల్ల ఒనగూడే స్వల్ప ఆనందాలను అప్పుడప్పుడూ ఆయన తన కవిత్వంలోంచి ఒంపి ప్రపంచానికి పంచుతుంటారు. షబానా గురువారం నాడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటోను పోస్ట్‌ చేశారు. అదొక సైన్‌బోర్డ్‌ ఫొటో. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ వాళ్లు 2015లో ముంబై విమానాశ్రయంలో పెట్టిన బోర్డ్‌ అది. అప్పుడు దాన్ని ఫొటో తీసుకుని ఉంచుకున్నారో ఏమో.. షబానా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. వెంటనే వేల లైకులు, కామెంట్స్‌ వచ్చి పడ్డాయి.

సైన్‌బోర్డ్‌ వైరల్‌ అవడం మొదలుపెట్టింది. అందులో ఇంగ్లిష్‌ లో ‘ఈటింగ్‌ కార్పెట్‌ స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్‌’ అని ఉంది. షబానాకు ఏమీ అర్థం కాలేదు. ‘కార్పెట్‌ను తినడం నిషిద్ధం’ అని రాశారేమిటి అనుకున్నారు. తర్వాత పైన హిందీలో ఉన్న నిషిద్ధాన్ని చదివారు. ఫర్శ్‌ పర్‌ ఖానా సఖ్త్‌ మనా హై... (కార్పెట్‌ మీద తినడం నిషిద్ధం) అని ఉంది. అప్పుడు కానీ షబానాకు విషయం అర్థం కాలేదు.. ‘కార్పెట్‌పై పడేలా తినకూడదు’ అని దాని భావం అని. అప్పటి ఆ ఫొటోను ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘రియల్లీ’ అని కామెంట్‌ పెట్టారు షబానా. ఎప్పుడూ సేవాకార్యక్రమాల్లో ఉండే షబానా.. ఇలాంటివి కనిపించినప్పుడు, గుర్తొచ్చినప్పుడు సరదాగా షేర్‌ చేస్తూ ఉంటారు.

మరిన్ని వార్తలు