ఈయన ప్రాణాన్ని గీసి, బొమ్మను పోస్తాడు!

18 Feb, 2019 00:08 IST|Sakshi

ఆర్ట్‌లీ వెల్‌కమ్‌

శంకర్‌ గీతకు కంట్రోల్‌ ఉండదు. కంట్రోల్‌ తప్పడం కాదది.. కంట్రోల్‌లో పెట్టడం! అది కార్టూనింగ్‌. వంకరగా అతడు ఒక్క గీత గీశాడంటే.. ఎవరు ఏమిటో చక్కగా దిగిపోద్ది. అది క్యారికేచరింగ్‌. పైనున్నాయన బొమ్మను చేసి ప్రాణం పోస్తే.. ఈయన ప్రాణాన్ని గీసి, బొమ్మను పోస్తాడు. 
అదొక తాండవం. శంకర తాండవం.

భుజానికో గుడ్డ సంచీ తగిలించుకుని అందులో తన ఆశల గీతలను దాచుకుని ఎన్ని మెట్లెక్కాడో తెలియదు కానీ, హృదయాన్ని ముంచెత్తుతోన్న రంగురంగుల స్వప్నాలను ఎక్కడైనా ఒలకబోసుకుందామని ఎన్నిసార్లో ప్రయత్నించారు పామర్తి శంకర్‌. ఆ తపనతోనే వృత్తిరీత్యా కార్టూనిస్టు, ప్రవృత్తిరీత్యా క్యారికేచరిస్ట్‌ అయిన శంకర్‌ అనతి కాలంలోనే అంతర్జాతీయ గుర్తింపుని తెచ్చుకోగలిగారు. అలా రెండు దశాబ్దాల పాటు తను వేసిన ప్రతి పెన్సిల్‌ గీతా, ప్రతి సిరాచుక్కనీ ఒకచోటకు చేర్చి హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆర్ట్‌ గ్యాలరీలో ‘ది ఇంక్డ్‌ ఇమేజ్‌’ పేరుతో ప్రదర్శనకు ఉంచారు శంకర్‌.

 నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలాను తలచుకున్నప్పుడల్లా జాతి వివక్షకు వ్యతిరేకపోరాట చిహ్నంగా అంతర్జాతీయ బహుమతి గెలుచుకున్న శంకర్‌ గీసిన మండేలా బిగిపిడికిలి గుర్తురావాల్సిందే ఎవ్వరికైనా. ఎంఎస్‌ సుబ్బులక్ష్మి గానామృతం రుచిమరిగిన కోయిలమ్మ సహా సుబ్బులక్ష్మి బొమ్మ శంకర్‌ క్యారికేచర్‌ దాహార్తికో మచ్చుతునక. ప్రాణాలన్నీ ఉగ్గదీసుకుని షెహనాయ్‌లోకి ఊదుతున్నట్టున్న బిస్మిల్లాఖాన్‌ షెహనాయ్‌ మన చెవుల్లో రింగుమంటూంటుంది.

కారల్‌ మార్క్స్‌ గడ్డం, ఎంఎఫ్‌ హుస్సేన్‌ ఆర్టు, కేసీఆర్‌ సిగలో తురిమిన తెలంగాణ, పాటల జలపాతాల్లా తోచే గోరటి వెంకన్న కళ్లు, అరుంధతీరాయ్‌ సిగలో పుష్పంగా మారిన సాహిత్యం, పీవీనరసింహారావు మూతి ముడుపు, రజనీకాంత్‌ స్టైలూ, మైకేల్‌ జాక్సన్‌ వొంటి విరుపూ ఇలా చెప్పుకుంటూ పోతే శంకర్‌ క్యారికేచర్‌ల ప్రత్యేకతలు శంకర్‌లోని రాజకీయ, సామాజిక, ఆర్థికావగాహనని సాక్షాత్కరిస్తాయి. ‘‘ఈనెల 21న ముగియనున్న ఈ ఎగ్జిబిషన్‌ ఏ ఒక్క కార్టూనిస్టుని తయారుచేసినా నాకదే సంతృప్తి’’ అంటోన్న శంకర్‌ సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న కొన్ని అనుభూతులు.

మీ మదిలో మెదిలిన తొలి పెన్సిల్‌ గీత?
నిజం చెప్పాలంటే మట్టిబొమ్మలతో నా ప్రయాణం మొదలైంది. స్కూల్‌ డేస్‌లోనే రంగులతో స్నేహం ఏర్పడింది. చిన్నప్పుడే సైన్‌బోర్డు ఆర్టిస్టుగా చేరాను. ఆ తరువాత స్కూల్లో పిల్లలకు డ్రాయింగ్‌ నేర్పే టీచర్‌ వృత్తిలోకి మారాను. మూడు పీరియడ్స్‌ మినహా మిగిలిన సమయమంతా లైబ్రరీలో గడిపేవాడిని. ప్రకాష్‌ షెట్టీ, అజిత్‌ నారాయణ్‌ క్యారికేచర్‌లు చూసేవాడిని. ఏదో వెలితి నన్ను వెంటాడుతూ ఉండేది. నాక్కావాల్సింది ఇది కాదు అన్న భావన నాలో అశాంతిని రేపేది. అప్పటికే నల్లగొండ గోడలపై వెలిసే ఆర్టిస్ట్‌ మోహన్‌ ఉద్యమపొలికేకల పోస్టర్లు నన్ను అమితంగా ఆకర్షించేవి. ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్‌కి ప్రయాణమయ్యేవాడిని. ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్, సండేమార్కెట్‌లో పుస్తకాలు కొనుక్కోవడం, ఎంఏడి (మాడ్‌) కార్టూన్‌ మాగజైన్స్‌ చూడటం, మోర్ట్‌ డ్రక్కర్‌ క్యారికేచర్స్, సెర్జో ఆర్గాన్స్, డాన్‌ మార్టిన్, పాల్‌కోకర్‌ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కార్టూనిస్టులను చూస్తూండేవాడిని. ఆ స్ఫూర్తితోనే వారపత్రికల్లో అప్పుడప్పుడూ సోషల్‌ కార్టూన్స్‌ని పంపేవాణ్ణి. అలా అలా డైలీ పాకెట్‌ కార్టూన్‌కి ఫిదా అయిపోయాను. 

పత్రికారంగంలోకి ఎలా వచ్చారు?
అమెచ్యూర్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో కార్యకర్తగా ఉన్నప్పుడు పూర్వపు ఆంధ్రజ్యోతిలో తిరుపతి, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ కార్టూనిస్ట్‌ కాంపిటీషన్స్‌లో నేను సెలక్ట్‌ అయ్యాను. అయితే ఇంటి దగ్గర్నుంచి చేస్తానన్నాను. కానీ పొలిటికల్‌ కార్టూన్లు ఇంటినుంచి వేయడం కుదరదన్నారు. 

మీ రంగుల కల రాజధానికెలా చేరింది?
అయితే సీజనల్‌గా కాదు పూర్తికాలం కార్టూనిస్టుగా ఉండాలన్న తపన, జిజ్ఞాస ఎలాగైనా హైదరాబాద్‌కి వెళ్లిపోవాలన్న కోర్కెకు బలంచేకూర్చింది. అదే నాన్నకి చెప్పాను. మహా మహా ఆర్టిస్టులే రోడ్ల మీద క్రీస్తు బొమ్మలూ, ఆంజనేయస్వామి బొమ్మలూ వేసుకుని అడుక్కుతింటూంటే హైదరాబాద్‌ వెళ్లి నువ్వేం చేస్తావురా? నువ్వింకా హైదరాబాద్‌కి వెళ్లదల్చుకుంటే నా శవంపై నుంచి దాటి వెళ్లు అన్న నాన్న కరెంటు నర్సయ్య మాటలకు కట్టుబడి, నల్లగొండ మట్టిపై మమకారాన్ని వదులుకోలేక చాలా ఏళ్లు నన్ను కనిపెంచిన ఆ నల్లనిరాళ్లలో ఉండిపోయా ను. ఉద్యోగంలో తృప్తిలేదు. కార్టూన్ల దాహం తీరలేదు. ఇక లాభంలేదనుకుని ఒకానొక రోజు భుజానికి గుడ్డసంచీ తగిలించుకుని, దాని నిండా నేను గీసిన కార్టూన్లు నింపుకుని ఆర్టిస్టు మోహన్‌గారిని వెతుక్కుంటూ హైదరాబాద్‌ చేరాను. నా గీతను ఇష్టపడిన మోహన్‌గారు నన్ను అక్కున చేర్చుకున్నారు. 

క్యారికేచర్లలోకి ఎలా అడుగుపెట్టారు?
తెలుగు మహాసభల కోసం ప్రత్యేక సంచిక వేస్తూ మోహన్‌గారు నాకోసం ప్రత్యేకించి శంకర భాష్యం పేరుతో ఒక పేజీని కేటాయించారు. భానుమతి, బాల్‌థాకరే, రాజేంద్రప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల క్యారికేచర్‌లు అందులో పబ్లిష్‌ అవడం నా జ్ఞాపకాల్లో ఎప్పుడూ మెదిలే తొలి అనుభవం. చెదిరిన జుట్టుతో అత్యంత సహజంగా వేసిన బాలగోపాల్‌ క్యారికేచర్, రైతు భుజంపై చేయివేసిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి క్యారికేచర్, ఎంఎఫ్‌ హుస్సేన్, విన్నీ మండేలా, రావు బాల సరస్వతి, కిషోర్‌ కుమార్, ఆరుద్రల క్యారికేచర్‌లు నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

∙కార్టూనిస్టుగా తొలి అనుభూతి?
ఉద్యోగం కోసం కార్టూన్లతోనే మూడు పేజీల బయోడేటా తయారుచేసుకుని నా కార్టూన్లన్నింటినీ సంచిలో పెట్టుకుని మళ్లీ కార్టూనిస్ట్‌ ఉద్యోగ వేటలో పడ్డాను. వార్తాపత్రికలో రామచంద్రమూర్తిగారికి నా కార్టూన్లిచ్చి వచ్చాను. నల్లకుంటలో బస్‌కోసం ఎదురుచూస్తుంటే అనుకోకుండా పాన్‌డబ్బా ముందు వేళ్లాడదీసిన నా కార్టూన్‌... ఒకటి కాదు వరసగా పది పేపర్లు. ఆశ్చర్యపోయాను. నా కార్టూన్‌ ఫ్రంట్‌ పేజ్‌లో. ఆనందానికి అవధుల్లేవు. అలా మొదలై ఇప్పుడు ప్రముఖ దినపత్రిక ‘సాక్షి’లో కార్టూనిస్టు స్థాయికి చేరాను. ఓసారి రాజకీయవేత్తలందరితో వేసిన ఓ క్యారికేచర్‌ తెల్లారి ఫ్రంట్‌ పేజ్‌ బ్యానర్‌గా మార్చిన సాక్షి ఎడిటర్‌ మురళిగారిని ఆశ్చర్యంగా అడిగాను సర్‌ ఇది లోపలి పేజీ కోసం వేసిందని. ‘‘అది బ్యానర్‌లో ఉండాల్సిన క్యారికేచర్‌లే మాకు తెలుసు’’ అని మురళిగారు అన్న మాట వృత్తిపరంగా నాకెంతో సంతృప్తినిచ్చిన మరో సందర్భం. 

అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్‌ కరస్పాండెంట్, సాక్షి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా