అతడు చనిపోయాడు ఆశయం బతికి ఉంది

18 Nov, 2019 04:04 IST|Sakshi

ట్రూ స్టోరీ

యాభై ఐదేళ్ల వయసులో ఏ తల్లికీ రాకూడని గర్భశోకాన్ని దిగమింగుకున్నారు శిశిర్‌ తల్లి సవిత. ఆమెకు ధైర్యం చెబుతూ.. కొడుకు ఆశయాన్ని ఆమెకు గుర్తు చేశారు శిశిర్‌ తండ్రి. జాతి నిర్మాణంలో ప్రతి పౌరుడూ తన శక్తిమేరకు పాలు పంచుకోవాలన్నదే ఆ కొడుకు ఆశయం! అందుకోసం వాళ్లు ఎంచుకున్న మార్గం.. చదువు చెప్పడం.

సైన్యంలో పనిచేసి గ్రూప్‌ కెప్టెన్‌గా రిటైరయ్యారు శరద్‌ తివారి. ఆయన స్ఫూర్తితో కొడుకు శిశిర్‌ కూడా డిఫెన్స్‌ ఉద్యోగంలో చేరాడు. 2017, అక్టోబర్‌ 6న శిశిర్‌ స్క్వాడ్రన్‌ లీడర్‌గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ జిల్లాలో ఓ ప్రమాదం జరిగింది. ఎమ్‌ఐ–17 విఫైవ్‌ విమానం కూలిన ఆ ప్రమాదంలో శిశిర్‌ చనిపోయాడు. అతడి ఆశయాన్ని బతికించడం కోసం శిశిర్‌ తల్లిదండ్రులు గత ఏడాది ఆగస్టు నెలలో ‘షహీద్‌ స్క్వాడ్రన్‌ లీడర్‌ శిశిర్‌ తివారీ మొమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌’ ప్రారంభించారు. ఢిల్లీలోని యమునా తీరంలో ఉన్న మురికివాడలో పిల్లలకు చదువు చెప్పడం మొదలు పెట్టారు.

వంద మంది పిల్లలతో మొదలు పెట్టిన అనియత (నాన్‌ ఫార్మల్‌) విద్యాకేంద్రం ఇప్పుడు 350 మందికి చేరువైంది. మురికివాడల్లో నివసించే వారికి వారి రోజును వెళ్లదీయడంలోనే సరిపోతోంది. పిల్లలకు మంచి చదువు చెప్పించడం, శుభ్రత నేర్పించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వడం మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ వాటికైనా తమ పిల్లలను రోజూ పంపించాలనే ఆసక్తి కూడా ఉండడం లేదు. పిల్లవాడు బడికి పోనంటే తమతోపాటు ఏదో ఒక పనికి తీసుకెళ్లవచ్చనే ధోరణిలో ఉంటున్నారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పిల్లలను రోజూ బడికి పంపించేటట్లు నచ్చ చెప్పారు శిశిర్‌ తల్లిదండ్రులు. ఆ తర్వాత కాలనీలోనే బహిరంగ ప్రదేశంలో షెడ్‌ నిర్మించి పాఠశాల తెరిచారు.

ఏడాదిలో ఎంతో మార్పు
మధ్యాహ్నం, సాయంత్రం రెండు షిఫ్టులుగా పిల్లలకు పాఠాలు చెప్తున్నారు తివారీ, సవిత. ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి పిల్లల వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పాతిక మంది విద్యా వాలంటీర్లను నియమించారు సవిత దంపతులు. మెట్రో స్టేషన్‌ పనుల్లో ఉన్న తల్లిదండ్రులతోపాటు తాత్కాలిక నివాసాల్లో రోజులు గడుపుతున్న యాభై మంది పిల్లల కోసం అక్కడే మరొక అనియత పాఠశాలను పెట్టారు. ‘‘ఈ ఏడాది కాలంలో పిల్లల్లో మేము ఆశించిన మార్పు కనిపిస్తోంది. పిల్లలకు వారి పట్ల వారికి ఆసక్తి పెరిగింది. పరిశుభ్రత పాటిస్తున్నారు.

ముఖ్యంగా ఎనిమిదవ తరగతి నుంచి స్కూలు మానేస్తున్న ఆడపిల్లల్లో కెరీర్‌ గురించి ఆలోచనలు రేకెత్తుతున్నాయి. తాము శుభ్రంగా ఉండడంతోపాటు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే స్పృహ కూడా కనిపిస్తోంది. అన్నిటికన్నా కూడా ఎవరైనా పలకరించినప్పుడు బదులిచ్చే విధానంలో మార్పు వచ్చింది. వీరి నుంచి దేశానికి మంచి ఇంజనీర్‌లు, లాయర్‌లు, పైలట్‌లు, సోల్జర్‌లు, జర్నలిస్టులు వస్తారనే నమ్మకం కలుగుతోంది. శిశిర్‌ కోరుకున్నటువంటి పౌరులను దేశానికి ఇవ్వడంలో నేను విజయవంతం అవుతాననే ధైర్యం వస్తోంది’’ అన్నారు సవిత.
– మను

►మా అబ్బాయి కోరుకున్న జాతి నిర్మాణం కోసం పని చేస్తున్నాం. ఈ పని మాకు సంతోషాన్నిస్తోంది. ఇంకా విస్తృతం చేస్తాం.
– శరద్‌ తివారీ, సవిత

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా