ఆ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటాను

12 Apr, 2015 22:52 IST|Sakshi
ఆ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటాను

శారద... అసలు పేరు సరస్వతి...ఆమె వయసు ఏడుపదులు అని చెబితేనే గాని నమ్మలేని లావణ్యరూపం...ఆధ్యాత్మిక ప్రపంచంలో హాయిగా గడుపుతూ...మిత్రులతో సంతోషంగా క బుర్లు చెబుతూ...జీవిత ప్రయాణం కులాసాగా కొనసాగిస్తున్నారు...చెట్లంటే ప్రాణంపెట్టే శారద చెట్లను నాటమని ఉద్యమించుదామనుకుంటున్నారు...చెన్నై సరస్వతీ వీధిలో ఉంటున్న శారదను కలిసినపున్పడు ఎన్నో ఆసక్తికరమైన, విషయాలను వివరించారు.
 
కాశ్మీర్‌లో ఆది శంకరాచార్యుల పీఠం, సూళ్లూరుపేట దగ్గర దర్గా, కన్యాకుమారి రాక్ మెమోరియల్, పెనుగొండ యోగివేమన సమాధి వంటి ప్రదేశాలకు వెళ్లి ధ్యానం చేయడమంటే చాలా ఇష్టం. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలగాలని ప్రార్థిస్తాను. ఎందుకంటే ఎవరి తలరాతనైనా ఆయనే కదా మార్చేది. ప్రస్తుతం ఖాళీ ఉంటే అంతా ఆధ్యాత్మిక ప్రపంచంలో గడుపుతాను.కాకినాడలో ఒక పూజారి ఉన్నారు. ఆయన నన్ను ‘అక్కయ్య’ అని అప్యాయంగా పిలుస్తారు. ఆయనకు, నాకు ఏం ఋణమో తెలీదు మరి. నేను ఏనాడో చేసిన పుణ్యమే ఇదంతా అనుకుంటాను. వైరాగ్యం, భక్తి, స్నేహం... వీటిని అలవర్చుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాను. అందువల్ల సమయం హాయిగా గడుస్తోంది. నేను ‘గొప్పదాన్ని’ అనే భావనే లేదు నాకు.
 
ప్రస్తుతం ఒక మళయాళ సినిమాలో నటిస్తున్న సినీనటి శారద, పలకరించడంతోనే హాయిగా కడుపునిండుగా నవ్వుతూ మాట్లాడటం ప్రారంభించారు.‘‘నేను సినిమా కంటే బయట ప్రపంచంతో ఎక్కువ కాంటాక్ట్‌లో ఉన్నాను. వాళ్లని కలవటం వల్ల నేనే ఏదీ మిస్ అవ్వట్లేదు. అది ఒక రకమైన ఎనర్జీని ఇస్తుంది. ఇంతకాలంగా అంటే సుమారు 50 సంవత్సరాలుగా నా స్నేహితులతో నా యాత్ర చక్కగా సాగిపోతోంది. వాళ్లంతా వారి వారి ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు నన్ను ఆహ్వానిస్తుంటారు. వాళ్లు చూపించే అభిమానాన్ని నేను తోసెయ్యలేకపోతున్నాను. ఏడుపదుల వయసులో ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అందువల్ల ప్రస్తుతం ఫంక్షన్లకి వెళ్లడం ఇబ్బంది అవుతోంది.

నాకు చిన్నతనంలో నుంచే ఆధ్యాత్మికత అలవాటైందనుకుంటాను. తెనాలిలో రెండు వందల ఏళ్లనాటి చర్చ్ ఒకటి ఉంది. నా చిన్నతనంలో అక్కడ ఆడుకునేదాన్ని. ఇంకా... మా చుట్టుపక్కల కూడా అందరూ ఆధ్యాత్మిక సంబంధీకులు ఉండేవారు. వారి దగ్గర మడి, ఆచారం, దైవ చింతన చూసి చిన్నతనం నుంచే చూశాను. ఆ ధోరణి నాకు తెలియకుండా అప్పుడే ‘నాకు’ అలవడి ఉంటుందనుకుంటాను. ఇప్పటికీ పురాతన దేవాలయాలకు వెళ్లడమంటే ఇష్టం. చర్చ్‌కి కూడా వెళ్తాను. ఆ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఏదో వైబ్రేషన్స్ వస్తుంటాయి.

మనం ఎప్పుడూ చిన్నవాళ్లమే. అన్నీ తెలుసుకోవాలి అనుకుంటేనే ఎదుగుతాం. శంకరాచార్యులు, నారద మునీంద్రులు, నా తల్లిదండ్రులు, నన్ను పెంచిన అమ్మమ్మ, పెద్దమ్మ, నాకు చదువు నేర్పిన గురువులు.. వీరు నా గురువులు. ధ్యానాన్ని ఇష్టపడతాను. ఈశ్వరుడు, హనుమంతుడు, అమ్మవార్లను ఎక్కువ ధ్యానిస్తాను.ఇప్పటికీ నన్ను స్త్రీ పక్షపాతి అంటారు మగవాళ్లు. నేను స్త్రీని కనుక ఆ పక్షపాతం ఉంటుందంటాను నేను. నా అభిమానుల్లో కూడా స్త్రీలే ఎక్కువ. ఆ విషయం గురించి వారితో తర్కం జరుగుతున్నంతసేపు నాకు హాయిగా ఉంటుంది. మంచి మనుషులతో కలసి మాట్లాడుతుంటే, వాళ్ల దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవచ్చు, కొన్ని నేను చెప్పవచ్చు. నేను అటువంటి వారితో కలవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తాను. .

నేను 35 సంవత్సరాల క్రితం మాంసాహారం మానే శాను. అలాగని తినద్దని ఇతరులకు చెప్పను. ఒకసారి గుల్బర్గా - హైదరాబాద్ మార్గ మధ్యంలో ఉన్న మాణిక్యేశ్వరీదేవి ఆశ్రమానికి వెళ్లాను. ఆవిడ ఏ ఆహారమూ తీసుకోకుండా ధ్యానంలో ఉంటారు. ఎప్పుడో గాని బయటకు రారు. ఆ రోజున అనుకోకుండా బయటకు రావడం నా అదృష్టంగా భావిస్తాను. ఆవిడ నా దగ్గరకు వచ్చి, ‘ఈ రోజు నుంచి నువ్వు మాంసాహారం మానేసై’ అన్నారు. నేను మారు మాట్లాడకుండా మానేశాను. అప్పటి నుంచి నాకు హాయిగా ఉంది. భోజనం చేసేటప్పుడు, ‘అది లేదు ఇది లేదు’ అనే బాధ లేదు.

నేను మానేసినందువల్ల, నా పక్కన కూర్చుని ఎవరైనా ఏది తింటున్నా ఆ వాసన నాకు రాదు. అది ఆ తల్లి వరం. అది మానేసిన దగ్గర నుంచి జీర్ణసమస్య లేకుండా పోయింది. బయట ఏది పడితే అది తినట్లేదు. ఏవి పడితే అవి తినడం, ఆసుపత్రికి వెళ్లడం ‘నాకు’ అవసరమా!!! ఇంటి భోజనాన్ని ఇష్టపడతాను. ఉదయాన్నే ఉసిరిపచ్చడి, ఆకుకూరల వంటలు తింటాను.మహానటి కన్నాంబగారు ఒకసారి నన్ను ‘నువ్వు నా అంతదానివి అవుతావు’ అని ఆశీర్వదించారు. ఆ తీపి జ్ఞాపకాలు నిరంతరం నెమరువేసుకుంటూ ఉంటాను. సూర్యకాంతమ్మగారు మా మీద చూసిన అనురాగం 50 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు తెచ్చుకుంటున్నాను. వారు నాకు ఒక రకమైన గెడైన్స్.

నేను సినిమాలో బరువైన పాత్రలు వేస్తాను కానీ, చిన్నతనంలో మాత్రం  బాగా అల్లరిపిల్లను. ఇప్పుడు ఏది లేకపోయినా, ‘లేదు’ అనే మాట నా నోటి నుంచి రాదు.. దానివల్ల కూడా నా శరీరం నేను చెప్పినట్లు వింటోందనుకుంటాను. భోజనం రెండు గంటల్లో అరిగిపోవాలన్నది నా లక్ష్యం. కొంత వయసు వరకు తినడానికి బతకాలి, ఆ తరవాత బతకడానికి తినాలి. నేను ఇప్పడు రెండో స్టేజ్‌లో ఉన్నాను. ఏదైనా తినాలనిపించినా కొద్దిగానే తిని ఎక్కువ తిన్నట్లు అనుభూతి చెందుతాను. ఆ మనస్తత్వం అలవాటు చేసుకుంటే అదే ఆరోగ్యం. నిమ్మకాయ, అల్లం రసం కలిపిన రసం ఈ వేసవిలో తీసుకుంటాను.

నా లక్ష్యం...
చెట్ల పట్ల బాధ్యతను తెలియచేసేలా నేను ఓ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను.రోడ్లు వెడల్పు చేయడం కోసం, బిల్డింగులు కట్టడం కోసం పెద్ద పెద్ద వృక్షాలను నేలమట్టం చేసేస్తున్నారు.  ‘తీసిన చోట మళ్లీ ఒక చెట్టు నాటండి. నెల రోజుల పాటు చెంబుడు నీళ్లు పోయాలి. నేను భిక్ష అడిగినట్లు అడుగుతున్నాను’. చెట్ల వల్ల అనేక రోగాలు దూరమవుతాయి. చెట్లు కూలిపోతే నా ప్రాణం విలవిలలాడిపోతుంది. మా ఇంటి ముందు చెట్టు పడిపోయిన ప్పుడు మూడు రోజులు అన్నం తినలేకపోయాను. పొల్యూషన్ వల్ల రోగాలు వస్తాయి. చె ట్లు రోగాలు రాకుండా నిరోధిస్తాయి.

నేను తులసి చెట్లు ఎక్కువ నాటుతాను. తులసి అనేది ఋషుల వృక్షం. అది 24 గంటలూ ప్రాణవాయువునిచ్చే చెట్టు. చెట్లను నరకవద్దని నేను వేడుకుంటున్నాను. ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం, బాగుచేసుకోవడం రెండూ మన చేతుల్లోనే ఉంది. ప్రకృతి మనకు ద్రోహం చేయదు. ప్రకృతికి మనమే చేటు చేస్తున్నాం. ‘అందరూ కుండీలో తులసిని పెంచండి, దాని గాలిని పీల్చి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి’ అని నేను కోరుకుంటున్నాను. ఇది నేను ఆచరిస్తున్నాను.ఆర్టిస్టునైనా నేను స్త్రీని, మనిషిని. అందరూ చల్లగా ఉండాలని కోరుకునేవాళ్లలో ఒకదాన్ని నేను. మనం చెబితే పిల్లలు ఆచరిస్తారు. యువతరం ఆచరిస్తుంది. అలాగే జరగాలని కోరుకుంటున్నాను.
 - డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై

మరిన్ని వార్తలు