మీ గడ్డం బిరుసుగా ఉందా?

3 Jun, 2019 00:53 IST|Sakshi

స్మూత్‌ షేవింగ్‌

కొంతమందికి గడ్డం చాలా బిరుసుగా ఉంటుంది. అలాంటి పురుషులకు షేవ్‌ చేసుకోవడం ఒక సమస్యగా ఉంటుంది. మరికొందరికి గడ్డంలోనే కొన్ని చోట్ల వెంట్రుకలన్నీ ఒకే పాటర్న్‌లో ఉండవు. అక్కడక్కడా సుడి తిరిగినట్లుగా ఉంటాయి. ఇలాంటప్పుడు షేవింగ్‌ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సురక్షితమైన షేవింగ్‌ కోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షేవింగ్‌ ప్రక్రియ మెత్తగా, హాయిగా, సాఫీగా జరుగుతుంది. అంతేకాదు... చర్మం ఎర్రబారడం, మంట పుట్టడం వంటివి లేకుండా కూడా చూసుకోవచ్చు. షేవింగ్‌ ప్రక్రియ మృదువుగా జరిగిపోడానికి పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు/సూచనలివి...

►బాగా బిరుసుగా ఉన్న వెంట్రుకలు ఉండేవారు ఒక షేవింగ్‌కు ముందుగా న్యాప్‌కిన్‌ను లేదా టవల్‌ను వేడినీటిలో ముంచి గడ్డం తడిసి మెత్తబడేలా గడ్డం చుట్టూ దాన్ని కాసేపు చుట్టుకుని ఉండాలి. అలా చేశాక షేవింగ్‌ చేసుకుంటే... అప్పటికే వెంట్రుకలు బాగా తడిసి మెత్తబడి ఉండటం వల్ల అవి తేలిగ్గా కట్‌ అవుతాయి.

►గడ్డంలోని వెంట్రుకలు మెలి తిరిగి ఉన్నచోట అవి సరిగా కట్‌ కాలేదనుకోండి. అప్పుడు ఆ ఒక్కచోటే మాటిమాటికీ షేవ్‌ చేయకండి. ఒకటి లేదా రెండుసార్లు చేసి అలా వదిలేయండి. మీరలా మాటిమాటికీ షేవ్‌ చేయడం వల్ల చర్మం ఒరుసుకుపోయి మంట పుడుతుంది. ఆ గాయం మిమ్మల్ని రోజంతా బాధపెడుతూనే ఉంటుంది.

►గడ్డంలో సుడులు మెలితిరిగిన ప్రదేశాలు మీ షర్ట్‌ కాలర్‌ ఉండే ప్రాంతంలోనే ఉన్నట్లయితే, గడ్డం గీసే సమయంలో మీరక్కడ బాగా ఒరుసుకుపోయేలా షేవ్‌ చేసుకున్నట్లయితే... ఆ రోజున మాత్రం గట్టిగా, బాగా బిరుసుగా ఉండే కాలర్‌ ఉన్న షర్ట్స్‌ వేసుకోకండి. వీలైతే కాలర్‌ లేనివో లేదా మెత్తటి కాలర్‌ ఉండే డ్రస్‌ లాంటివో వేసుకోండి.

►మీకు బయటకు వెళ్లాల్సిన పనులేవీ లేకుండా ఉంటే మీ సెలవు రోజున వీలైతే గడ్డం గీయకుండా ఒక రోజు బ్రేక్‌ ఇవ్వండి.

►ఎలక్ట్రిక్‌ రేజర్‌ కంటే మామూలు బ్లేడ్‌తో షేవ్‌ చేసుకోవడమే మంచిదని గుర్తించండి. ఎందుకంటే ఎలక్ట్రిక్‌ రేజర్‌తో షేవ్‌ చేసుకునే సమయంలో వెంట్రుక అన్ని దిశల నుంచీ  కట్‌ అవుతుంది. ఒక్కోసారి దీని వల్ల వెంట్రుక మళ్లీ వెనక్కు వెంట్రుక మూలం (ఫాలికిల్‌)లోకి పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతి షేవ్స్‌లో ఇది మరింత బాధాకరంగా పరిణమించే అవకాశాలుంటాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు మామూలు బ్లేడ్‌తో షేవ్‌ చేసుకోవడమే మంచిది.

మరిన్ని వార్తలు