ఆలయ ప్రవేశం తర్వాత ఆమెకు గృహప్రవేశం లేదు

30 Jan, 2019 00:24 IST|Sakshi

అయ్యో అప్పా

అయ్యప్పస్వామిని దర్శించడంలో సఫలమైన కేరళ స్త్రీ కనకదుర్గ ఇప్పుడు తన ఇంట్లో ప్రవేశించడానికి పెనుగులాడుతోంది.అయ్యప్పని హరిహరసుతుడుగా భక్తులు పూజిస్తారు. విష్ణుమూర్తి, శివుడు పురుషులుగా ఉండగా అయ్యప్ప జన్మ సాధ్యపడలేదు. విష్ణుమూర్తి మోహినీ అవతారం– అంటే స్త్రీ అవతారం దాల్చాకనే అయ్యప్ప జన్మ సాధ్యమైంది. అంటే అయ్యప్ప జన్మలో స్త్రీ ప్రమేయం ఉంది. కాని అయ్యప్ప ఆరాధనలో, దర్శనంలో మాత్రం వయసులో ఉన్న స్త్రీల ప్రవేశం వందల ఏళ్లుగా నిషేధించబడింది.దీని గురించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై దేశంలో భిన్నమైన స్పందనలు వెలువడ్డాయి. రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కు అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశంలో భంగపాటుకు లోనవుతున్నదని, స్త్రీలకు ఆ ఆలయంలో ప్రవేశించే హక్కు సంపూర్ణంగా ఉందని కోర్టు చెప్పింది.

ఆ వెంటనే ఎందరో స్త్రీలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నించి భక్తుల నిరసనల వల్ల విఫలమయ్యారు. అయితే కేరళకు చెందిన కనకదుర్గ (39), బిందు అమ్మిని (40) జనవరి 2, 2019న శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. పోలీసులు వీరికి సహకరించారు. ఈ విషయం బయటకు తెలిసిన వెంటనే భక్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆలయాన్ని ప్రధాన అర్చకులు శుద్ధి చేశారు. భద్రతా కారణాల రీత్యా కొన్నాళ్లు అజ్ఞాతంగా ఉన్న ఆ స్నేహితురాళ్లు ఇద్దరూ తిరిగి సామాన్య జీవనంలోకి అడుగు పెట్టే ప్రయత్నం చేశారు. ఆ వివరాలను కనకదుర్గ ఇలా చెబుతోంది.‘మలప్పురం జిల్లాలోని అంగడిపురం మా ఊరు. డిసెంబర్‌ 22, 2018న నేను మా ఇంటి నుంచి అయ్యప్ప దర్శనం కోసం నా స్నేహితురాలితో బయలుదేరాను. మాకు ఆలయ ప్రవేశం వెంటనే సాధ్యపడలేదు. శబరిమలకు సమీపంలోని ఒక రహస్య ప్రదేశంలో వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు జనవరి 2, 2019న మేము అయ్యప్ప దర్శనం చేసుకున్నాం. స్త్రీల గౌరవం కోసం, సుప్రీం కోర్టు తీర్పు గౌరవం కోసం, దేశంలో స్త్రీల సమానత్వం కోసం మేము ఈ పని చేశాం.

కాని ఆ వెంటనే పెద్దస్థాయిలో నిరసన వ్యక్తమైంది. మేము తీవ్రమైన తప్పు చేసినట్టుగా వ్యాఖ్యానాలు వచ్చాయి. అంత తప్పు మేము ఏం చేశాం. చట్టం మాకు కల్పించిన ఒక అవకాశాన్ని వినియోగించుకోవడం తప్పా? దర్శనం అయ్యాక మా భద్రతకోసం కొన్నాళ్లు మళ్లీ ప్రభుత్వం మమ్మల్ని వేరే చోటులో ఉంచింది. జనవరి 15న నేను ఇంటికి చేరుకున్నాను. అయితే ఇంట్లో ప్రవేశానికి నా భర్త, అత్త అడ్డు చెప్పారు. నాకు ఇద్దరు పిల్లలు. వారిని కొద్ది నిమిషాల సేపే నేను చూడగలిగాను. ఎందుకు నేను ఇంట్లోకి రాకూడదు అని ఎదురు ప్రశ్నించినందుకు నా అత్త నా బుర్ర పగుల గొట్టింది. మా ఊరిలోని ఆస్పత్రిలో వైద్యం సరిపోక కోజికోడ్‌ ఆస్పత్రిలో వారం రోజులు ఉండాల్సి వచ్చింది.

ఇప్పుడు కూడా తల తప్పలేక, సరిగ్గా మాట్లాడలేక అవస్థ పడుతున్నాను. నా ఇంట్లో నుంచి నన్ను తరిమేయడానికి నేనేం పాపం చేశాను? కొందరు పెద్దలు నా భర్తతో మాట్లాడితే నేను నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆలోచిస్తానని అన్నాడట. నేను చేసిన పనికి నేను ఎవరికైనా క్షమాపణ చెప్పడం కానీ, ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కానీ చేయను. నేను నా ఇంట్లో ప్రవేశానికి చట్టబద్ధంగా పోరాడతాను. కోర్టుకు వెళతాను’ అని అందామె.అయితే కనకదుర్గ పరిస్థితి పుట్టింట్లోనూ సరిగ్గా లేదు. పుట్టింటికి వెళదామనుకుంటే ఆమె సోదరుడు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ‘వారు నా మీద  కోపంగా ఉన్నారు’ అంది కనకదుర్గ.

ఆమె ప్రస్తుతం ఒక ప్రభుత్వ హోమ్‌లో ఉంటోంది. మరోవైపు ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ‘మూడుసార్లు వెంటవెంటనే తలాక్‌ చెప్పి స్త్రీకు అన్యాయం చేసిన పురుషుడికి జైలు శిక్ష ఉంటుందని చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం కనకదుర్గ భర్త వంటి వ్యక్తులు ఉన్న పళంగా భార్యను బయటకు గెంటేస్తే వేయాల్సిన శిక్ష గురించి ఎందుకు చట్టం చేయదు’ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవుడు దగ్గరైతే కన్నపిల్లలు దూరమయ్యే పరిస్థితి రావడం కనకదుర్గ ఉదంతంలో కనిపిస్తోంది. సాంస్కృతిక విశ్వాసాలు, చట్టం... వీటి మధ్య సాగుతున్న పోరులో మగ పెత్తనమే పై చేయి కావడం కూడా కనిపిస్తోంది. 

మరిన్ని వార్తలు