ఆమె ఓ ‘పబ్లిక్ ఎనిమీ’

22 May, 2014 22:23 IST|Sakshi
ఆమె ఓ ‘పబ్లిక్ ఎనిమీ’

సంక్షిప్తంగా... బోనీ ఎలిజబెత్ పార్కర్

 ‘‘సూర్య కిరణాలు సోకి, మంచు బిందువులు తాకి పూలలో మకరందం ఊరిన విధంగా,
 నీ వంటి వారి వల్ల  ఈ ప్రపంచం మరింత మధురం, తేజోమయం అయింది’’.
 బోనీ ఎలిజిబెత్ పార్కర్ సమాధిపై చెక్కి వున్న అక్షరాలివి.
 ఎవరీ ఎలిజబెత్ పార్కర్? రాజవంశీయురాలా? రాజనీతిజ్ఞురాలా? సంఘ సేవకురాలా? సంస్కర్తా? మత ప్రవక్తా? ఎవరు?
 
ఎవరూ కాదు. ఒక గ్యాంగ్‌స్టర్. దొంగల ముఠా సభ్యురాలు! సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం ఇదే రోజున అమెరికన్ పోలీసులు ఎట్టకేలకు ఆమెను, ఆమె సహచరుడు క్లైడ్ ఛెస్ట్‌నట్ బారోను చుట్టుముట్టి తుపాకీతో కాల్చి చంపారు.

అమెరికాలోని డాలస్ ప్రాంతం నుంచి ‘ఎదిగి’, ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం సమయంలో రకరకాల దోపిడీలతో మధ్య అమెరికా రాష్ట్రాలను గడగడలాడించిన ఎలిజబెత్.. నేలకు ఒరిగిందన్న వార్త వినగానే బ్యాంకులు, సూపర్ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ ‘థ్యాంక్ గాడ్’ అనుకుంది. 1931-1934 మధ్య ఎలిజబెత్, ఆమె సభ్యురాలిగా ఉన్న ముఠా కలిసి కనీసం తొమ్మిదిమంది పోలీసు ఆఫీసర్లను చంపి ఉంటారు. ముఠాను ప్రతిఘటించిన కొందరు పౌరులు కూడా ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది.

ఈ ఘటనల తర్వాత ఎలిజబెత్‌ను, ఆమె సహచరుడు క్లైడ్ బారోను అమెరికన్ ప్రభుత్వం ‘పబ్లిక్ ఎనిమీ’గా ప్రకటించింది. చివరికి లూసియానాలో ఎలిజబెత్ శకం ముగిసింది. ఆమె చనిపోయాక మీడియాలో ఆమెపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. డిటెక్టెవ్ కథలూ వచ్చాయి. 1967లో ‘బోనీ అండ్ క్లైడ్’ అనే సినిమా కూడా వచ్చింది.  
 
పోలీసులు వెంటాడుతున్నప్పుడు ఎలిజబెత్ చకచకా మకాం మార్చేసేవారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు ఆమెకు బదులుగా, ఆమె ఫొటోలు దొరికేవి. ఆ ఫొటోల ఆధారంగా వార్తా పత్రికలు కథనాలను అల్లేవి. మెషిన్‌గన్‌ను ఆమె అలవోకగా ఆపరేట్ చేసేదనీ, క్యామెల్ బ్రాండు సిగరెట్లను ఇష్టంగా తాగేదనీ; ఎలిజబెత్, క్లైడ్‌ల మధ్య దాంపత్యానికి ఏమాత్రం తక్కువ కాని సాన్నిహిత్యం ఉండేదనీ... ఇలా ఎన్నెన్నో. ఇవన్నీ అలా ఉంచితే ఎలిజబెత్ పార్కర్ స్వభావసిద్ధంగా మంచి అమ్మాయి అనేవారూ ఉన్నారు. బహుశా వారే, ఎలిజబెత్ సమాధిపై ఆమె గురించి నాలుగు మంచి ముక్కలు చెక్కించి ఉండొచ్చు.
 
బోనీ ఎలిజబెత్ పార్కర్ 1910 అక్టోబర్ 1న టెక్సాస్‌లోని రొవెనాలో జన్మించారు. ముగ్గురు పిల్లల్లో రెండోది.  తండ్రి తాపీ మేస్త్రీ. ఎలిజబెత్‌కు నాలుగేళ్లున్నప్పుడు ఆయన చనిపోయాడు. దాంతో తల్లి ఎమ్మా క్రాస్ పిల్లల్ని తీసుకుని డాలస్ శివారు ప్రాంతం సెమెంట్ సిటీలో ఉన్న పుట్టింటికి చేరుకుంది. కుటుంబాన్ని పోషించడానికి కుట్టుపనిలో కుదురుకుంది. ఎలిజబెత్ తెలివైన అమ్మాయి.

హైస్కూల్‌లో అన్నిటా తనే ఫస్ట్. స్పెల్లింగ్, రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్.. ప్రతిదాంట్లోనూ ప్రథమ బహుమతే! ఎలిజబెత్ చక్కటి కవిత్వం కూడా రాసేది. స్కూల్లో చేరిన రెండో సంవత్సరం ఆమెకు రాయ్ థార్టాన్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ స్కూల్ మానేసి 1926 సెప్టెంబర్ 25న పెళ్లి చేసుకున్నారు. ఎలిజబెత్‌కు అప్పటికి పూర్తిగా పదహారేళ్లు కూడా లేవు. తర్వాత మూడేళ్లకు అభిప్రాయభేదాల వల్ల ఇద్దరూ విడిపోయారు. అలాగని విడాకులు కూడా తీసుకోలేదు.

ఎలిజబెత్ అయితే థార్టాన్ తనకు తొడిగిన ఉంగరాన్ని జీవితాంతం అలాగే ఉంచుకున్నారు. విడాకులు తీసుకున్నాక ఆమె కొంతకాలం ఒక రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పని చేశారు. ఆ సమయంలోనే ఆమె జీవితం మలుపు తిరిగింది. క్లైడ్ బారోతో పరిచయం అయింది. పరిచయం ప్రేమ అయింది. ఆ ప్రేమే ఆమెను క్లైడ్ నేర ప్రపంచంలోకి లాక్కెళ్లింది.
 
1929 నాటి ఎలిజబెత్ డైరీలను బట్టి ఆమె ఎంతో సున్నిత మనస్కురాలని తెలుస్తోంది. తన ఒంటరితనం గురించి, డాలస్‌లో అసహనంగా గడిచిన జీవితం గురించి ఎంతో ఆవేదనగా రాసుకున్నారు ఎలిజబెత్. అలాగే ఫొటో తియ్యడమంటే తనకున్న ఇష్టం గురించి కూడా.
 

మరిన్ని వార్తలు