అందంలోనే కాదు...ఆదర్శంలోనూ మోడలే!

26 Aug, 2014 22:45 IST|Sakshi
అందంలోనే కాదు...ఆదర్శంలోనూ మోడలే!

ఛాంపియన్

నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యపతకాలు... ఈ సుందరాంగి సాధించిన ఈ పతకాలు అందాల పోటీలలో కాదు... కరాటేలో సాధించినవి. ముంబాయిలో పుట్టి పెరిగిన మోడల్ సంధ్యాశెట్టి ఐదడుగుల తొమ్మిదంగుళాల ఎత్తు, చామనఛాయ రంగు, చూడగానే ఆకట్టుకునే కళ్లు, సిల్కీ శిరోజాలతో... గిలిగింతలు పెట్టే సౌష్ఠవంతో ఉంటుంది.
 
విశేషం ఏమిటంటే కరాటేలో బ్లాక్‌బెల్ట్‌తోపాటు నేషనల్ ఛాంపియన్ షిప్ కూడా సాధించిందీమె. ఇటీవలే మహారాష్ర్టలో జరిగిన కరాటే అసోసియేషన్ ఛాంపియన్ షిప్ పోటీలలో కాంస్యపత కాన్ని కైవసం చేసుకున్న సంధ్య... తనకొచ్చిన పతకాన్ని ఆడియన్స్‌కు చూపిస్తూ... ‘ఇప్పుడు నేను సాధించింది కాంస్యమే కావచ్చు కానీ, వచ్చేసారికి  సువర్ణం సాధించి తీరతాను’ అంటూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
 
కాలేజీలో చదివేటప్పుడే స్నేహితులామెను ఫెమినా మిస్ ఇండియా ఉమెన్ పెజంట్‌లో పాల్గొనవలసిందిగా ఒత్తిడి చేసి మరీ ఒప్పించారు. అందాల ప్రపంచంలో అలా పడింది ఆమె తొలి అడుగు. ఆ తర్వాత ఆమె అనేక ర్యాంప్ షోస్, ప్రింట్, మ్యూజిక్ వీడియోలలోనూ పాల్గొంది. పలు బుల్లితెర షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. ‘లెవి’, ‘నల్లి’, ‘షాపర్స్ స్టాప్’, ‘రూపమ్’, ‘డిగ్‌జామ్’ తదితర బ్రాండ్లకు ప్రచారం నిర్వహించింది. విక్రమ్ ఫాద్నిస్, షైనా ఎన్‌సీ, కౌషిక్ షిమాంకర్, అనితా డోంగ్రే, స్వప్నిల్ షిండే వంటి డిజైనర్లకోసం ర్యాంప్ వాక్ చేసింది. డిస్కవరీ ఛానెల్‌లో ‘గో ఇండియా’ కార్యక్రమానికి అతిథేయిగా వ్యవహరించింది.
 
‘‘మోడలింగ్ అన్నా, నటన అన్నా చాలా ఇష్టం. ఈ రెండు రంగాలలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటూనే, నాకు ఎంతో ప్రీతికరమైన క్రీడలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు’’ అని చెబుతోంది ఈ అందాల భామ. ‘‘అందరికీ నేను ఒక మోడల్‌గా, నటిగా, టీవీ ప్రెజెంటేటర్‌గానే తెలుసు. నాకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉందని, నేను అందులో ఛాంపియన్  షిప్ సాధించానని తెలిసింది అతి కొద్దిమందికి మాత్రమే’’ అంటుంది. ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకున్న సంధ్యకు ట్రావెలింగ్ అన్నా, కొత్తవారితో స్నేహం చేయడమన్నా, కొత్తరకాల వంటకాలు తయారు చేయడమన్నా ఎంతో మక్కువ అట.  
 
ఖరీదుకంటే సౌకర్యవంతమైన దుస్తులకే ప్రాధాన్యత ఇస్తాననీ, రకరకాల యాక్సెసరీస్ అన్నా, పాదరక్షలన్నా ప్రాణం పెడతాననీ చెప్పే ఈ సుందరాంగి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం లోనూ, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం లోనూ ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు. గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అంత కష్టం కాకపోయినప్పటికీ, అందులో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదనీ, ఆహారం విషయంలోనూ, వ్యాయామాల విషయంలోనూ అప్రమత్తంగా ఉంటూ వ్యవహరిస్తూ క్రమశిక్షణతో వ్యవహరిస్తేగానీ అందులో రాణించలేమంటుంది.
 
రాత్రిళ్లు త్వరగా నిద్రపోతానని, పొద్దున్నే లేచి, వ్యాయామం చేస్తానని, ఆ తర్వాత కాసేపు శరీరం బాగా అలసిపోయేలా ఆటలాడతాననీ చెప్పే సంధ్యాశెట్టి అతివల ఆత్మరక్షణకోసం మార్షల్ ఆర్ట్స్‌లో ఉచిత శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. అంతేకాదు, గుర్రపు స్వారీ, ఈత శిక్షణ, వెయిట్ లిఫ్టింగ్‌లలోనూ ఉచిత శిక్షణ ఇప్పిస్తోందట. నిజంగా మనసున్న మంచి మోడల్ కదా!
 - డి.శ్రీలేఖ

మరిన్ని వార్తలు