తన జీవితానికి తానే న్యాయమూర్తి

6 Dec, 2017 23:34 IST|Sakshi

న్యాయమూర్తులను చూస్తూ.. ఆ స్థాయికి ఎదగాలన్న తపనే నడిపించింది  

భర్తను బలి తీసుకుని విధి అన్యాయం చేస్తే, తనకు తానే న్యాయం చెప్పుకుంది

కోర్టులో న్యాయమూర్తులు వినిపించే జడ్జిమెంట్‌ను రాసుకునే స్థాయి నుంచి ఆమె డిక్టేషన్‌ చేసే స్థాయికి ఎదిగింది. కోర్టులో స్టెనోగా పనిచేస్తూ జడ్జిగా ఎదగాలన్న సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు మూడు సంవత్సరాల పాటు జీతాన్ని కోల్పోయినప్పటికి జీవితంలో తాను నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకోగలిగింది. రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందినప్పటికీ, కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకుంటూ తన ఇద్దరు చిన్నారులకు తల్లీ తండ్రీ తానై... అనుకున్నది సాధించింది. ఆదిలాబాద్‌కు చెందిన కల్లెడ సౌజన్య జిల్లా కేంద్రంలోని ఎస్సీఎస్టీ కోర్టులో స్టెనోగా పనిచేస్తూనే, ఇటీవల హైకోర్టు నిర్వహించిన మెజిస్ట్రేట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై, తన జీవితానికి తానే తీర్పు చెప్పుకున్నారు. ఈనెల 14న  న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సౌజన్య జీవన గమ్యం...

నిజామాబాద్‌ జిల్లాకి చెందిన శంకర్‌ శాస్త్రి– శోభ దంపతుల ముగ్గురు సంతానంలో ఒక్కగానొక్క ఆడపిల్ల సౌజన్య. న్యూ ఇండియా ఇన్సురెన్స్‌ కంపెనీ ఉద్యోగి అయిన శంకర్‌ శాస్త్రి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్‌ జిల్లాలలో పనిచేశారు. దాంతో సౌజన్య ప్రాథమిక విద్య నిజామాబాద్, మెదక్‌ జిల్లాల్లోనూ, 8వ తరగతి నుంచి ఆదిలాబాద్‌లోనూ చదువుకున్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో బీఎస్సీ  చేశారు. ఇంటర్‌ చదివేటప్పుడే టైప్‌ షార్ట్‌హ్యాండ్‌ కోర్సు చేశారు. డిగ్రీ పూర్తి కాగానే ఆదిలాబాద్‌ జిల్లాలోని బో«ద్‌ కోర్టులో స్టెనోగా చేరారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌లోని ఆయా కోర్టుల్లో పనిచేస్తూ వచ్చారు.

దుఃఖాన్ని దిగమింగుకుంది
స్టెనోగా కోర్టులో ఉద్యోగం వచ్చిన తర్వాత సౌజన్యకు 2001లో వెటర్నరీ డాక్టర్‌ రమాకాంత్‌తో వివాహం జరిగింది. వారికి కూతురు సాక్షి, కుమారుడు కృష్ణ సంతానం. అంతా సాఫీగా సాగిపోతోందనుకున్న తరుణంలో... నార్నూర్‌లో పశువైద్యాధికారిగా పనిచేస్తున్న రమాకాంత్, 2010 నవంబర్‌లో విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్‌కు తిరిగి వస్తుండగా రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. అప్పుడు వారి పిల్లలు ఇద్దరు పసివాళ్లే. భర్త మృతితో సౌజన్య జీవితంలో విషాదం చోటుచేసుకుంది. అయితే అంత దుఃఖాన్నీ దిగమింగుకొని పిల్లల కోసం జీవితంతో పోరాడింది. వారే లోకంగా బతికింది. ప్రస్తుతం పిల్లలు ఇద్దరు ఆదిలాబాద్‌ పట్టణంలోని కాన్వెంట్‌ హైస్కూల్‌లో 6, 8 తరగతులు చదువుతున్నారు.


సంకల్పమే నడిపించింది
కోర్టులో 19 సంవత్సరాలుగా స్టెనోగా చేస్తున్న సౌజన్య కోర్టులో జరిగే వ్యవహారాలను దగ్గరినుంచి చూసింది. ప్రధానంగా మెజిస్ట్రేట్‌ కోర్టులో ఇచ్చే తీర్పులను షార్ట్‌హ్యాండ్‌లో రాసుకొని ఆ తర్వాత కంప్యూటర్‌లో ఆ తీర్పును సవివరంగా పొందుపరిచి మెజిస్ట్రేట్‌కు అందజేయడం ఆమె బాధ్యత. ఇన్నేళ్ల ఈ ప్రస్థానంలో ఆమె మనసులో తాను ఎలాగైనా మెజిస్ట్రేట్‌ కావాలన్న ఆలోచనకు బీజం పడింది. ‘లా’ చదివితేగానీ తన లక్ష్యంలో తొలి మెట్టు ఎక్కలేదు మరి. ఆమె ఆశయాన్ని అమ్మానాన్నా అర్థం చేసుకున్నారు. తోబుట్టువులు సంజీవ్, సందీప్‌లు తోడుగా నిలిచారు. సౌజన్య నాందేడ్‌లో లా కోర్సు చదివారు. మూడేళ్లపాటు జీతాన్ని కోల్పోవాల్సి వచ్చినా  సంకల్పాన్ని వీడకుండా ముందుకు సాగారు. 2015లో లా కోర్సును పూర్తిచేసి తిరిగి ఉద్యోగంలో చేరారు. ఆమె కల ఇప్పటికి నెరవేరింది. మొన్న మంగళవారం మేడ్చల్‌ కోర్టు ఫస్ట్‌ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియామకపు ఉత్తర్వులు అందుకున్నారు.

అవకాశాన్ని అందిపుచ్చుకుంది
హైకోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మెజిస్ట్రేట్‌ పరీక్షలు నిర్వహించింది. ఇందులో రెండు రాత పరీక్షలు, ఒక ఓరల్‌ టెస్ట్‌లో ఆమె అర్హత సాధించారు. ఏప్రిల్‌లో దీనికి సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 52 మంది మెజిస్ట్రేట్‌లుగా ఎంపికయ్యారు. అందులో సౌజన్య ఒకరు. మంగళవారం హైకోర్టు మెజిస్ట్రేట్‌లకు పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు వెలువరిచింది. పాత రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్‌ కోర్టులో ఆమె మేజిస్ట్రేట్‌గా ఈ నెల 14న బాధ్యతలు స్వీకరించనున్నారు. సౌజన్య జీవిత గమనం అనేకమంది మహిళలకు ఆదర్శం.
– గొడిశెల కృష్ణకాంత్‌ గౌడ్, సాక్షి, ఆదిలాబాద్‌
ఫొటోలు: చింతల అరుణ్‌ రెడ్డి

మరిన్ని వార్తలు