ఇలా చేసిన అత్తను చూశారా?

26 May, 2019 04:01 IST|Sakshi
కోడలికి పెళ్లి చేస్తున్న అత్తగారు

ఆడదంటే ఆడదానికి శత్రువు కాదని అత్త గుండెలో కూడా అమ్మ ఉన్నదన్నాడో సినీకవి. చంపాబాయీ అనే మహిళ ఈ మాటలను అక్షరాలా నిజం చేసి చూపించింది. భర్తను కోల్పోయిన తన కోడలికి తానే తల్లిగా మారి రెండోపెళ్లి చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.ఛత్తీస్‌గఢ్‌లోని హీరాపూర్‌కు చెందిన చంపాబాయీకి చిన్నతనంలోనే పెళ్లైంది. ఓ కొడుకు పుట్టిన కొన్నేళ్ల తర్వాత ఆమె భర్తను కోల్పోయింది. ఇక అప్పటినుంచి కొడుకే లోకంగా బతుకుతూ అతడిని పెంచి పెద్ద చేసింది. ఓ మంచి ముహూర్తం చూసి కొడుకు పెళ్లి జరిపించింది. తన కష్టాలు తీరినట్టేనని, కొడుకు, కోడలు, రాబోయే మనవలతో సంతోషంగా జీవితాన్ని గడపవచ్చని ఆశపడింది. కానీ దురదృష్టం.. ఒక్కగానొక్క కొడుకు రెండేళ్ల క్రితం హఠాన్మరణం చెందడంతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి.

అమ్మ మనసు.. అర్థం చేసుకున్న కోడలు
ఓ పెళ్లివేడుకలో చోటుచేసుకున్న ప్రమాదంలో చంపాబాయి కొడుకు డోమేంద్ర సాహు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే అతడు మరణించడంతో తన కోడలి జీవితం ఒక్కసారిగా తలకిందులైనట్లుగా చంపాబాయి భావించింది. జీవితభాగస్వామిని కోల్పోయిన స్త్రీగా సమాజంలో తానెలా బతికిందీ ఒంటరి తల్లిగా కొడుకును పెంచేందుకు పడిన కష్టాలు ఒక్కసారిగా ఆమె కళ్ల ముందు కదలాడాయి. అన్నింటికంటే... చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన  కోడలు ఙ్ఞానేశ్వరి పరిస్థితి ఏమవుతుందోనన్న వేదనే చంపాబాయి మనసును కలచివేసింది. తాను పడిన కష్టాలు కోడలు పడకకూడదనే ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది.అయితే హీరాపూర్‌ ప్రజలకు చంపాబాయి తీసుకున్న నిర్ణయం అంతగా నచ్చలేదు.

‘‘ఇలా చేయడం సంప్రదాయ విరుద్ధం.. అసలు నువ్విలాంటి ఆలోచన చేస్తావని అనుకోనేలేదు..’’ అంటూ ఈటెల్లాంటి మాటలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు. అయినప్పటికీ చంపాబాయి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కోడలి కోసం వరుడి వేట మొదలుపెట్టింది. తమ గ్రామానికి దగ్గర్లోనే ఉండే కమల్‌ సాహు అనే డివోర్సీతో కోడలి పెళ్లి ఖాయం చేసింది. అత్తగారు తన కోసం పడుతున్న తపన చూసిన ఙ్ఞానేశ్వరి ఆమె నిర్ణయాన్ని గౌరవించింది. భార్యతో విడిపోయినప్పటికీ.. ఇద్దరు ఆడపిల్లల బాధ్యతను తలకెత్తుకున్న కమల్‌ వ్యక్తిత్వానికి ముగ్ధురాలై.. అతడిని పెళ్లి చేసుకునేందుకు మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో ఈనెల 24న కొంతమంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వారి పెళ్లి జరిగింది.

కోడలు కాదు.. తను నా కూతురు..
కోడలు ఙ్ఞానేశ్వరికి రెండో పెళ్లి చేయడం గురించి చంపాబాయి మాట్లాడుతూ..‘మా ఇంట్లో అడుగు పెట్టిన నాటినుంచే కోడలిగా కాకుండా తనను కూతురిగా భావించాను. నా ఒక్కగానొక్క కొడుకు భార్య కాబట్టి వారిద్దరికీ నా ప్రేమను సమానంగా పంచాను. కానీ దురదృష్టవశాత్తూ 2017, ఏప్రిల్‌ 20న డోమేంద్ర మాకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఆ బాధను మరచిపోయేందుకు నా కోడలికి ఏ లోటు రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. భర్తను కోల్పోయిన స్త్రీగా ఎంత వేదన అనుభవించానో నాకు తెలుసు. ఙ్ఞానేశ్వరి జీవితంలో చోటుచేసుకున్న విషాదాన్ని తీర్చాలంటే పెళ్లి ఒక్కటే మార్గంగా తోచింది. అందుకే ఎవరేమనుకున్నా లెక్కచేయక ఆమెకు మళ్లీ పెళ్లి చేశాను’ అంటూ తల్లి మనసు చాటుకున్నారు.

మా వియ్యంకురాలు బంగారం..
‘మా వియ్యపురాలు ధైర్యం చేశారనే చెప్పాలి. ఆమె నా కూతురిని తన కూతురిలా భావించారు. తనకు రెండోపెళ్లి చేసి కొత్త జీవితాన్నిచ్చారు. వైధవ్యంలో మగ్గిపోకుండా తనను కాపాడారు. అందరూ మా వియ్యపురాలిలా ఆలోచిస్తే ఆడవాళ్ల పరిస్థితి మెరుగవుతుంది. స్త్రీ పునర్వివాహం నేరం కాదనే భావన సమాజంలో నాటుకుపోతుంది. ఇందుకు నా కూతురి పెళ్లి ఆదర్శంగా నిలుస్తుంది’ అంటూ ఙ్ఞానేశ్వరి తల్లి ఆనందభాష్పాలు పెట్టుకున్నారు.

అవును... భార్య చనిపోయిన రెండో రోజే వధువు కోసం వెదికే భర్తలున్న ఈ సమాజం భర్త చనిపోయిన తర్వాత స్త్రీ జీవితం అక్కడితోనే ఆగిపోవాలని ఎన్నో ఆంక్షలు విధించింది.దక్షిణాదిన కందుకూరి వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు వీటన్నింటినీ అధిగమించి వితంతు పునర్వివాహాలు జరిపించినప్పటికీ ఉత్తరాది సమాజంలో చంపాబాయి లాంటి వాళ్లు అరుదుగానైనా కన్పిస్తుండటం ఊరట కలిగించే విషయమే కదా!
– సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్‌

మరిన్ని వార్తలు