‘ఉగ్ర’బూచితో గెలుపు సాధ్యమా?

30 Mar, 2019 00:37 IST|Sakshi

జాతిహితం

నరేంద్ర మోదీ 2014లో జాతికి గొప్ప ఆశను వాగ్దానం చేసి ఘనవిజయం సాధించారు. అయిదేళ్ల తర్వాత పాకిస్తాన్‌ నుంచి ఉగ్రవాద దాడుల భయాన్ని రేకెత్తించి మరోసారి గెలవాలని కోరుకుంటున్నారు. తన పాలనా ఘనతర చరిత్ర ఆధారంగా కాకుండా తన ప్రత్యర్థుల లోపాల్ని చూపి ఓటర్ల వద్దకు వెళ్లే వ్యూహాన్ని మోదీ పకడ్బందీగా ఎంచుకున్నారు. ఈ వ్యూహం వెనుక దేశాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం, వ్యవసాయ దుస్థితి వంటి అసలు సమస్యలు మరుగున పడిపోయాయి. రాహుల్‌ గాంధీ కనీస ఆదాయ పథకం హామీతో ఆలస్యంగా ముందుకొచ్చినా అతి తక్కువ సమయం కారణంగా అది దేశ ప్రజలను ఆకర్షిస్తుందా అనేదే ప్రశ్న.

అధికారంలో ఉంటూ ఎన్నికల్లో మళ్లీ గెలుపొందాలని చూసే నాయకుడు తన ఓటర్లను అడిగే స్పష్టమైన ప్రశ్న: మీరు నాకు గతంలో ఓటు వేసినప్పటి కంటే ఇప్పుడు మీ పరిస్థితి బాగుందని భావిస్తున్నారా? కానీ నరేంద్ర మోదీ విషయానికి వస్తే ఆ ప్రశ్న మరోలా ఉంటుంది: మీరు నాకు అధికారం అప్పగించిన నాటి కంటే ఇప్పుడు మీరు మరింత సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నారా? సమాధానం ‘అవును’ అయినట్లయితే, మీరు రెండో దఫా కూడా అధికారంలోకి రావచ్చని భావించవచ్చు. సమాధానం ‘కాదు’ అయినట్లయితే అదే ప్రజలు, అదే ఓటర్లు మిమ్మల్నే  మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలి? అయితే మోదీ ప్రపంచంలో మూడో సంభావ్యత కూడా సిద్ధంగా ఉంటుంది. 2008లో ముంబైలో బాంబు దాడుల నాటి కంటే మీరు ఇప్పుడు తక్కువ అభద్రతా భావంతో ఉన్నట్లు భావిస్తున్నారా? ఒక సాంప్రదాయిక రాజకీయ నేత ఎల్లప్పుడూ తన పాలనా ఘనతర చరిత్ర ఆధారంగానే ఓటర్ల వద్దకు వెళుతుంటాడు. కానీ తెలివైన రాజకీయనేత మాత్రం తన ప్రత్యర్థుల లోపాల్ని చూపి ఓటర్ల వద్దకు వెళతాడు. ఈ కోణంలో చూస్తే మోదీని తెలివైన నేత అని కాకుండా మరోరకంగా చూడలేం.

నిజంగానే మోదీ తన అయిదేళ్ల పాలనలో కశ్మీరేతర భారతదేశంలో ఎలాంటి భారీ స్థాయి ఉగ్రవాద దాడిని చవిచూడలేదు. పంజాబ్‌ సరిహద్దుకు అత్యంత సమీపంలో గుర్దాస్‌పూర్, పఠాన్‌కోట్‌లలో రెండు విఫల దాడులను మినహాయిస్తే, పాకిస్తానీ ఉగ్రవాద బృందాలు భారత్‌లో మరెక్కడా దాడి చేయలేకపోయాయి. అంతకు ముందు యూపీఏ మలిదశ పాలనలో (2009–14) కూడా కశ్మీర్‌తో సహా భారత్‌ కూడా ప్రశాం తంగా ఉండిందని మనం గుర్తించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌ కూడా ఆ విషయాన్ని మర్చిపోయింది. జాతీయ భద్రత విషయంలో తన సొంత విజయాల ప్రాతిపదికన మోదీ తాజా ఎన్నికల ప్రచారాన్ని సాగించడం లేదు. బదులుగా మరిన్ని అభద్రతల పునాదిపై తన ప్రచారం సాగిస్తున్నారు. మరోలా చెప్పాలంటే, నేను అధికారంలోకి వచ్చాకే జైషే, లష్కర్, ఐఎస్‌ఐ ఉగ్రవాదం పతనమైపోయింది చూడండి.

2014లో, మోదీ గొప్ప ఆశను వాగ్దానం చేసి మరీ ఘనవిజయం సాధించారు. అయిదేళ్ల తర్వాత పాకిస్తాన్‌ నుంచి భీకరమైన ఉగ్రవాద దాడుల భయాన్ని రేకెత్తించి మరోసారి గెలవాలని కోరుకుంటున్నారు. తనను వ్యతిరేకించిన వారెవరైనా సరే, ప్రత్యేకించి కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తే వాళ్లు పాక్‌తో కుమ్మక్కు అయినట్లే లెక్క. అందుకనే, ఉగ్రవాదులు, పాక్‌ మాత్రమే ఈ ఎన్నికల్లో తన ఓటమిని కోరుకుంటున్నాయని మోదీ చెబుతూ వస్తున్నారు. అదే ఊపులో తన ప్రత్యర్థి ఉగ్రవాదులపై మృదువైఖరితో వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు కూడా. సరిహద్దులు దాటి పాక్‌పై జరిపిన దాడుల్లో విజయానికి సంబంధించిన ఆధారాలను అడిగే సాహసం చేస్తూ ప్రతిపక్షం మన సాయుధ బలగాలను అగౌరవిస్తున్నారని కూడా మోదీ అలవోకగా ఆరోపిస్తున్నారు.

2014లో తానే రేకెత్తించిన గొప్ప ఆశాభావం స్థానం నుంచి 2019లో ఈ భయాలను రేకెత్తించే స్థితికి మోదీ ఎందుకు మారిపోయినట్లు? మోదీ–షా నేతృత్వంలోని బీజేపీ ‘సంపూర్ణ రాజకీయాలు’ అనేభావనను నమ్ముతోంది. ఇక్కడ రాజకీయాలే 24 గంటలపాటు మీ ఏకైక వృత్తి, వినోదం, మనఃస్థితి, మత్తుగా ఉంటుంటాయి. ప్రభుత్వాధికారాన్ని ఏరంకంగానైనా సరే గెల్చుకునే తరహా రాజకీయాలను మనం ఇవాళ చూస్తున్నాం. గెలిచాక ఆ అధికారంతో ఏం చేస్తారో కూడా మనం చూడాల్సి ఉంటుంది.కాబట్టి కృత్రిమ ప్రచారంతో గారడీ చేస్తున్నట్లయితే అది చాలా పదునుగా ఉంటుంది, ఈ తరహా రాజకీయాలకు అది ఉపయోగకరం  కూడా. మరోవైపున మీ ఐదేళ్ల పాలన రికార్డు ఆధారంగా తిరిగి గెలుపుకోసం వెళ్లడం అనేది ప్రమాదకరం.

ఎందుకంటే అప్పుడు మీరు గతంలో చేసిన వాగ్దానాలకు, ఈరోజు వాటి అమలులోని వాస్తవికతకు మధ్య తేడాను ప్రజలు పోల్చి చూస్తారు. మీరు ఉద్యోగాల కల్పన గురించిన సకల సమాచారాన్ని దాచి ఉంచి జీడీపీ గణాంకాలను పైకి లేవనెత్తవచ్చు. కానీ మీరెలా ఫీలవుతున్నారు అని ప్రజలను అడిగారంటే మాత్రం వారు వెంటనే వాస్తవాలను శోధిస్తారు. మరుగుదొడ్లు, ముద్రా రుణాలు, ఉజ్వల ఎల్‌పీజీ కనెక్షన్లు, వ్యవసాయానికి మద్దతునిచ్చే ప్రత్యక్ష నగదు బదిలీలు, విద్యుత్‌ కనెక్షన్లు వగైరా మీ పథకాల ద్వారా ప్రజలు వాస్తవంగా ఎన్ని మేళ్లు పొంది ఉన్నా సరే, ప్రజలు అడిగే ప్రశ్నలు ఇంకా ఉండే ఉంటాయి. అవెంత ప్రమాదకరమో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే 2004 నాటి భారత్‌ వెలిగిపోతోంది అనే ప్రచారార్భాటం గురించి ఎల్‌కే అడ్వాణీని అడిగి చూడండి చాలు.

మోదీ ప్రారంభ ప్రసంగాలు పాక్, ఉగ్రవాదం, తన ప్రత్యర్థి పార్టీల అవినీతి, వాటి జాతీయవాద రాహిత్యం వంటి వాటిని సూచించేవి. కానీ ఉద్యోగాలు, వృద్ధి, వ్యవసాయ దుస్థితి వంటి అంశాలను తాను ప్రస్తావించేవారు కాదు. దీనర్థం ఏమిటి? ప్రతిపక్షం తనపై మోపే ఆరోపణలను సమర్థించుకోవడానికి భిన్నమైన పద్ధతిలో మోదీ తన ఎన్నికల ప్రచారాన్ని రూపొందించుకుంటున్నారు. ఉగ్రవాదం, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం తర్వాత మరొక అంశం కూడా ముందుపీఠికొస్తుంది. ముస్లిం లను పక్కన బెట్టడం ద్వారా మోదీ, షాలు 2014 ఎన్నికల్లో గెలుపు సాధించారు. మంత్రిమండలిలో, అత్యున్నత రాజ్యాంగ, పాలనా పదవుల్లో ముస్లింలను పూర్తిగా మినహాయించే తరహా అధికార నిర్మాణాన్ని వీరు చేపట్టారు. దేశ జనాభాలో 14 శాతంగా ఉన్న ముస్లింల నుంచి ఏడుగురు అభ్యర్థులను మాత్రమే పోటీకి నిలిపి కూడా లోక్‌సభలో వారు విజయం సాధించారు. ఆ తర్వాత 20 శాతం మంది ముస్లిం జనాభా ఉన్న యూపీలో ఒక్కరంటే ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలపకుండానే ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. మోదీ, షా వ్యూహం ఎంత విజయవంతమైందంటే, బీజేపీ ముస్లింలను ఇంతగా దూరం పెట్టడంపై సవాలు చేయడానికి కూడా కాంగ్రెస్‌ ధైర్యం చేయడం లేదు. కారణం తననెక్కడ ముస్లిం పార్టీ అని ఆరోపిస్తారో అనే భయం.

భావజాలపరంగా కూడా తనకు సవాలు ఎదురు కాకపోవడంతో మోదీ ముస్లింలను దూరం పెట్టడం అనే వ్యూహాన్ని మరింత విస్తృతపరుస్తారంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఆ ధైర్యంతోనే మోదీ తనను పాకిస్తానీలు, ఉగ్రవాదులతోపాటు ప్రతిపక్షం కూడా ఈ ప్రాతిపదికనే ఓడించాలని భావిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. మరి కాంగ్రెస్‌ బలమైన ఓటు బ్యాంకు అయిన ముస్లింల వైఖరి ఎలా ఉంటుంది? కాబట్టి ఉగ్రవాదులు, పాకిస్తానీలతోపాటు, ముస్లింలు కూడా తన ఓటమికి ప్రయత్నిస్తున్నారని మోదీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలు తనకు ఓటువేయకపోతే ఏం ఫర్వాలేదు. వారికి వ్యతిరేకంగా హిందువులు ఐక్యమవుతారు. అయితే తోటి భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా నేరుగా ఇలా ప్రచారం చేస్తే అది ఫలితమివ్వదు. కాబట్టి ముస్లింల నుంచి ప్రమాదం ఉందని చెబితే చాలు. పాకిస్తానీ ముస్లింలు, భారత్‌ పాక్‌ అనుకూల కశ్మీరీలు, పాక్‌ అక్రమిత కశ్మీర్‌లోని ముస్లింలు, తూర్పున బంగ్లాదేశీ ముస్లింలు అంటూ ప్రచారానికి లంకించుకుంటే సరిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు అమలులో ఉన్న అన్ని దేశాల్లో ఈ ధోరణే ఇప్పుడు నడుస్తోంది. ట్రంప్‌ మొదలుకుని ప్రపంచంలో ప్రజాదరణ పొందిన నేతలందరూ తమ పునాది వర్గాల గురించి మాత్రమే మాట్లాడుతూ, ఇతరుల్లో భయాందోళనలు కలిగిస్తూ వారిని జాతీయ స్రవంతి నుంచి పక్కను నెట్టివేస్తున్నారు.

ట్రంప్‌ నుంచి,  నెతన్యాహు నుంచి మోదీ వరకు మెజార్టీగా ఉన్న ప్రజల్లో ఒక భయానక అనుభవాన్ని కల్పిస్తారు. తమ సొంత దేశంలో తామే మైనార్టీలు కానున్న భావన కలిగిస్తారు. అక్రమ వలసదారులను ట్రంప్‌ బూచిగా చూపిస్తే, దేశంలోనే ఉన్న వామపక్ష ఉదారవాదులు, మైనార్టీలు, ప్రతిపక్షం, స్వేచ్ఛాయుత మీడియా, నిర్బంధ ప్రతికూలతలను పెద్ద శత్రువుగా మోదీ చూపుతున్నారు. ఇది ప్రతిపక్షాన్ని ఎక్కడికి నెడుతుంది? మోదీ తన వర్గాన్ని సురక్షితంగా ఉంచుకోగా, మిగిలిన వారంతా చెల్లాచెదురుగా ఉండటంతో ఆయన గమ్యం చేరుకోవడం సులువవుతుంది. అవినీతి, జాతీయ భద్రత అంశాల ఆధారంగా కాంగ్రెస్‌ మోదీతో పోరాడలేదు. తాజా దాడులతో మోదీ అనితర సాధ్యమైన కోటను నిర్మించుకున్నారు. ప్రతిసారీ మోదీ విమర్శకులుగా గుర్తింపు పొందినవారు దాడులపై ఆయన ఉద్దేశాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. కాబట్టి మోదీ రెండు అంశాలను సిద్ధం చేసుకున్నారు. ప్రతిపక్షాన్ని విభజించడం, తన పద్ధతిలో వారిపై యుద్ధం చేయడం.

కనీస ఆదాయ పథకం (ఎన్‌వైఏవై) వంటి ప్రకటనలతో కాంగ్రెస్‌ ఆలస్యంగా మేలుకొంది. కాంగ్రెస్‌ నెలకు ఆరువేలు ఇస్తామనడం, మోదీ చిన్న రైతులకు ఇస్తానన్న ఐదొందలు కంటే చాలా ఎక్కువ. సంప్రదాయకంగా చూస్తే కాంగ్రెస్‌ సంక్షేమ పార్టీ కాగా, బీజేపీ కేవలం జాతీయవాద పార్టీ మాత్రమే. తీవ్ర నిరుద్యోగికత, వ్యవసాయ సంక్షోభం, పరిష్కారం కనుగొనకుండా సాగదీయడంపై అసంతృప్తి ఉన్నవారు చాలామందే ఉన్నారు. ప్రశ్న అల్లా ఏమిటంటే మోదీ ఎంపిక చేసుకుంటున్న ప్రచారాంశాలనుంచి బయటకు లాగి, తాను సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం రాబట్టేంత నైపుణ్యం, వనరులు కాంగ్రెస్‌కు ఉన్నాయా అన్నదే. ఒకవేళ దీన్ని సాధించినప్పటికీ, భారత్‌లోనే అత్యంత నిరుపేదలు నివసిస్తున్న పశ్చిమబెంగాల్, ఒడిశా, తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో కాంగ్రెస్‌కు పునాదులే లేవు. కానీ కనీస ఆదాయ పథకం అనేది దాని రాజకీయ చింతనలో ఆసక్తికరమైనదే. ఈ ప్రాతిపదికన కొత్త పొత్తులకు ప్రయత్నాలు ఆరంభించి మోదీకి నిజమైన పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్‌ పార్టీకి మరి కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి మరి.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా