శివ దర్శనం

12 Nov, 2017 00:20 IST|Sakshi

శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు. కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత?

పరమేశ్వరుడికి అనుంగు భక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపాన్ని మనస్సు వెంటనే గ్రహించగలదు. కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజరూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి.

నంది పృష్టభాగాన్ని నిమురుతూ, శృంగాల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది  అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది. కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రం, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి.

శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది. అందుకే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణం చెబుతోంది.

మరిన్ని వార్తలు