భయాలను భయపెట్టండి

16 Feb, 2014 23:46 IST|Sakshi
భయాలను భయపెట్టండి

మనసుల్లో  దాగి ఉన్న అంతర్గత భయాలు మనుషులు ముందుకెళ్లకుండా అడ్డుపడతాయి. వీటిని వదిలించుకుంటే అనుకున్నది సాధించవచ్చు. భయాలను జయించాలంటే చేయాల్సింది.. ధైర్యంగా వాటికి ఎదురెళ్లడం. మనిషి ఎదురు తిరిగితే భయం తోకముడిచి వెనక్కి పారిపోవడం ఖాయం. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేని వ్యక్తులే జీవితంలో విజేతలుగా నిలుస్తారు.
 
 ఒక రుషి.. రెండు శునకాలు


పూర్వం ఒక గొప్ప రుషి ఉండేవారు. ఆయన ఒకనాడు హిమాలయాల్లోని ప్రఖ్యాత ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఆలయ విశేషాలు తెలుసుకొనేందుకు అక్కడున్న ఒక స్థానికుడిని తన వెంట సహాయకుడిగా నియమించుకున్నారు. దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద భీతి కలిగించే సన్నివేశం రుషి కంటపడింది. రెండు బలమైన శునకాలు ఆలయం గేటుకు గొలుసుతో కట్టేసి ఉన్నాయి. అవి వీరిని చూడగానే బిగ్గరగా మొరగడం ప్రారంభించాయి. వాటి రౌద్రరూపం చూస్తే ఎంతటివారికైనా గుండెలదిరిపోతాయి.

రుషి మనసులోని భావాన్ని సహాయకుడు పసిగట్టాడు. ‘భయపడకండి గురుదేవా! ఆ శునకాలను గొలుసులతో బంధించారు. తెంచుకొనే అవకాశమే లేదు. అవి మనల్ని ఏమీ చేయలేవు’ అంటూ ధైర్యం చెప్పాడు. ఇద్దరూ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టారు. ప్రధాన ఆలయం వైపు నడక ప్రారంభించారు. గుడి గురించి సహాయకుడు చెబుతున్న విశేషాలు రుషి మనసులోకి చేరడం లేదు. ఆయన పదేపదే వెనక్కి తిరిగి శునకాల వైపు చూస్తున్నారు. వాటి అరుపులు ఆయన చెవుల్లో మార్మోగుతున్నాయి.

ఈసారి రుషి వెనక్కి తిరిగి చూడగానే.. ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. ఆయన తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. గొలుసులను తెంచుకున్న రెండు శునకాలు వీరి వైపు వేగంగా పరుగెత్తుకొస్తున్నాయి. వాటి నోటికి చిక్కితే బతుకుపై ఆశ వదులుకోవాల్సిందే. రుషి తక్షణమే అప్రమత్తమయ్యారు. మెరుపు వేగంతో పరుగందుకున్నారు.. శునకాల వైపు!  అప్పుడేం జరిగిందో ఊహించండి. తమవైపు దూసుకొస్తున్న గురువు గారిని చూసి శునకాలు ఒక్కసారిగా బెదిరిపోయాయి. బుద్ధిగా వెనక్కి తిరిగి ద్వారం వద్దకు వెళ్లిపోయాయి.
 
పారిపోతే.. జీవితాన్ని కోల్పోతాం!


 మనుషుల్లోని భయాలు కూడా ఆ శునకాల్లాంటివే. మనమంతా భయాలకు భయపడి, వాటికి దూరంగా పారిపోతుంటాం. అప్పుడు అవి మనల్ని ఏమీ చేయలేవని అనుకుంటున్నాం. కానీ, దానివల్ల జీవితంలో ఏం కోల్పోతున్నామో తెలుసుకోలేకపోతున్నాం. భయాలు ఎదురైనప్పుడు రుషిలాగే వాటికి ఎదురొడ్డి ముందుకెళ్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. భయాలను ఎదుర్కోండి, భయాలను భయపెట్టండి. ఎంతటి భయంకరమైన భయాలైనా మిమ్మల్ని ఏమీ చేయలేవని తెలుసుకుంటారు.
 
 ఎదిరించి గెలవలేమా?


 ఓడిపోతామనే భయంతో మనుషులు బతుకులీడుస్తుంటారు. ఓటమి భయం వెంటాడుతూ ఉంటుంది. జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించలేకపోతుంటారు. భయానికి ఎందుకు భయపడాలి? దాన్ని ఎదిరించి గెలవలేమా?.. మీకు నీళ్లంటే భయమా? అయితే, ధైర్యంగా ఈత నేర్చుకోండి. స్విమ్మింగ్ క్లాసులో చేరండి. నలుగురిలో మాట్లాడాలంటే భయమా? దాన్ని అధిగమించండి. మాట్లాడేందుకు ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా నిర్భయంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తే నష్టం వస్తుందని భీతి చెందుతున్నారా? అయినా ప్రారంభించండి, ఏం జరుగుతుందో చూద్దాం! నష్టం వచ్చినా, లాభం వచ్చినా... ఒకటి మాత్రం తథ్యం. మీలో భయం కచ్చితంగా అంతమైపోతుంది.
 
 భయం అంటే నిరర్థక ఊహే!


 భయం అంటే.. తప్పుడు ఊహలను వాస్తవాలుగా భ్రమించడం. భయం అనేది కేవలం మనసులో జనించే ఒక నిరర్థకమైన ఊహేనని అర్థం చేసుకుంటే దాన్ని పూర్తిగా వదిలించుకోవచ్చు. మీలోని భయాన్ని మీ ముందున్న ఒక గోడగా భావించండి. మీ సంతోషాలు, విజయాలు గోడకు ఆవలి వైపున ఉన్నాయనుకోండి. అప్పుడేం చేస్తారు? గోడ నుంచి దూరంగా పారిపోతారా? విజయాన్ని అందుకోవాలంటే గోడను అధిగమించాల్సిందే. మీరు ధైర్యంగా అడుగు ముందుకేస్తే గోడ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. భయం కూడా అంతే.. దాని తీవ్రతను ఎక్కువగా ఊహించుకుంటే ఇంకా భయపెడుతుంది.
 
 భయంపై కపిల్‌దేవ్ జయం


 క్రికెట్ అభిమానులకు లండన్‌లోని లార్డ్స్ మైదానంలో 1990లో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక టెస్ట్ సిరీస్ గుర్తుండే ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ నాలుగు వికెట్లకుగాను 653 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత్ 9 వికెట్లను కోల్పోయి 430 పరుగుల వద్ద ఆట కొనసాగిస్తోంది. కపిల్ దేవ్ మైదానంలోకి వచ్చారు. ఫాలోఆన్ తప్పాలంటే 24 పరుగులు చేయాలి. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. భారత జట్టులో భయం, ఆందోళన పెరిగిపోతున్నాయి. విపరీతమైన ఒత్తిడిలోనూ కపిల్ దేవ్ నిబ్బరంగా ఆట కొనసాగించారు. వరుసగా నాలుగు సిక్సులు బాదారు. కావాల్సిన 24 పరుగులు సాధించారు. భయాలను ఎదుర్కోవడం అంటే అదే..  మీరు కూడా భయాలను దూరంగా తరిమేయండి. పరుగులు రావాలంటే భయాలను బ్యాటుతో బాది, స్టేడియం బయటకు పంపించాల్సిందే!

 -కెరీర్స్ 360 సౌజన్యంతో
 

మరిన్ని వార్తలు