షార్ట్ ఫిల్మ్‌తో బాలీవుడ్ ఛాన్స్ కొట్టేశాడు!

22 Oct, 2013 23:58 IST|Sakshi
షార్ట్ ఫిల్మ్‌తో బాలీవుడ్ ఛాన్స్ కొట్టేశాడు!

 ప్రతిభ ఉండాలే కానీ... అవకాశాలు అవే వెదుక్కొంటూ వచ్చే కాలం ఇది. అయితే ఆ అవకాశాల కోసం వల పన్నాలి. ప్రతిభావంతుల కోసం అన్వేషించే వారిని ఆకర్షించగలగాలి. అలాంటి ఒడుపు తెలిసిన వాళ్లు చాలా సులభంగా సక్సెస్‌ను సొంతం చేసుకొంటున్నారు. ఇలా సక్సెస్ అయిన యువకుడే ఆదిత్య. 23 యేళ్ల వయసుకే బాలీవుడ్ దర్శకులే పిలిచి అవకాశాలు ఇచ్చేంత స్థాయికి చేరుకొన్నాడు.  అలా అవకాశాలను సొంతం చేసుకోవడానికి ఆదిత్య చూపిన ఒడుపు , చొరవ ఏమిటంటే...
 ఇంటర్మీడియట్ పూర్తి అయ్యాక.. ఇంజనీరింగ్ చదవమని చెప్పారట ఆదిత్య జెల్లా తల్లిదండ్రులు. అయితే అతడికి మాత్రం సినిమా అంటే ఆసక్తి, తనలోని సృజనాత్మకతను చాటాలనే అభిలాష ఉన్నాయి. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి మూడేళ్ల డిగ్రీ జాయిన్ అయ్యాడు. ఆ డిగ్రీ పూర్తవ్వగానే మళ్లీ సినిమా గుర్తుకొచ్చింది. అయితే గుడ్డెద్దు చేల్లో పడినట్టు కాకుండా ముందు మెళుకువలను నేర్చుకోవాలని అనుకొన్నాడు. అందుకోసం ప్రసిద్ధ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నాలుగు నెలల కోర్సును పూర్తి చేశాడు. థియరీ అక్కడ పూర్తయ్యింది. మరి ఆ థియరీని మాత్రమే చూసి ఎవరూ అవకాశం ఇవ్వరు కదా. అందుకే ప్రాక్టికల్‌గా తనను తాను నిరూపించుకొనే ప్రయత్నంలో షార్ట్‌ఫిల్మ్ మేకింగ్‌పై దృష్టి సారించాడు ఈ యువకుడు.
 
  కోర్సు విషయమై అమెరికాలో ఉన్న సమయంలోనే సరదాగా ఒక షార్ట్‌ఫిల్మ్ తీసి ఇంటర్నెట్‌లో పెట్టాడు ఆదిత్య. ఫ్లోరిడా నుంచి మియామీ మధ్య ప్రయాణం చేస్తూ ఆ జర్నీ గురించి ఒక సరదా షార్ట్‌ఫిల్మ్ తీశాడు. ఇక్కడ కట్ చేస్తే బాలీవుడ్‌లో సైఫ్ అలీఖాన్ హీరోగా రూపొందుతున్న ‘గో గోవా గాన్’ సినిమా సెట్స్‌పై తేలాడు ఆదిత్య. ‘న్యూయార్క్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సుపూర్తి చేశాను’ అని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఆదిత్యకు అవకాశం కలిసివచ్చింది. ఇంటర్నెట్‌లో బాగా పాపులర్ అయిన షార్‌‌ట ఫిల్మ్ ఇతనికి అవకాశాలను తెచ్చిపెట్టింది. ‘గో గోవా గాన్’ సినిమా దర్శక ద్వయం రాజ్, డీకేలు ఆదిత్యను తమ టీమ్‌లో చేర్చుకొన్నారు. సినిమా రూపకల్పనలో సృజనాత్మక సాయం చేయమని అడిగారు. ఆ విధంగా వ్యక్తిగత ఆసక్తి, అభిలాష, న్యూయర్క్ ఫిల్మ్ అకాడమీ కోర్సు, షార్ట్ ఫిల్మ్.. ఇవన్నీ కలిసి ఆదిత్యను ఛాంపియన్‌ను చేశాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తయారైన ‘గో గోవా గాన్’ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రచారం కోసం ఆదిత్య రూపొందించిన ప్రోమోలకు బాగా పేరు వచ్చింది. దీంతో ఇతడికి అవకాశాలు కలిసి వచ్చాయి.
 
 హైదరాబాద్‌కు చెందిన ఈ కుర్రాడు ఇప్పుడు మకాం మార్చాడు. బాలీవుడ్‌లో అవకాశాలు వస్తుండటంతో ముంబై చేరుకొన్నాడు. తను సినిమా అవకాశాలు పొందడం తన ఇంట్లో వాళ్లను అమితాశ్చర్యపరిచిందని అంటాడు ఆదిత్య. తనకు సైఫ్ వంటి స్టార్‌హీరో సినిమాలో అవకాశం వచ్చిందని అంటే మొదట ఎవరూ నమ్మలేదని, తీరా తాను రూపొందించిన వీడియో ప్రోమోలు టీవీల్లో ప్రసారం అయ్యే సరికి గర్వమనిపించిందని ఆదిత్య చెప్పాడు. చాలా చిన్న వయసులోనే, తొలి సినిమాతోనే సైఫ్ వంటి హీరోతో పనిచేయడం మంచి అనుభవాన్ని ఇచ్చిందని ఆదిత్య వివరించాడు. ఎక్కువ సినిమాలకు పనిచేయాల్సిన అవసరం లేకుండానే.. ఆదిత్య తగిన గుర్తింపు సంపాదించుకొన్నాడు. తెలుగు ‘డీ ఫర్ దోపిడి’ అనే సినిమాకు కో డెరైక్టర్‌గా కూడా పనిచేశాడు.
 ఆదిత్య తన అభిలాషను నెరవేర్చుకోవడాన్ని గమనిస్తే డబ్బు, తెలివి తేటలు మాత్రమే కాదు.. అవకాశాలు సంపాదించుకోవడానికి వాటిని సద్వినియోగం చేసుకొనే నేర్పు కూడా తెలిసి ఉండాలని అనిపిస్తుంది.
 
 హైదరాబాద్‌కు చెందిన ఈ కుర్రాడు ఇప్పుడు మకాం మార్చాడు. బాలీవుడ్‌లో అవకాశాలు వస్తుండటంతో ముంబై చేరుకొన్నాడు. తను సినిమా అవకాశాలు పొందడం తన ఇంట్లో వాళ్లను అమితాశ్చర్యపరిచిందని  అంటున్నాడు ఆదిత్య.
 

మరిన్ని వార్తలు