పులుసురాయి

11 Nov, 2019 00:36 IST|Sakshi

కథాసారం

యుద్ధం అయిపోయింది. ఒక సిపాయి మళ్లీ ఇంటికి పోవాలని బయలుదేరి పోతున్నాడు. అలా పోతూ ఉండగా దారిలో ఒక చిన్న పల్లెటూరు దగ్గరికి వచ్చేసరికి, ఆకాశం నిండా కారు మేఘాలు కమ్ముకొచ్చినయి. చలిగాలి రివ్వు రివ్వున కొడుతూంది. వీటి అన్నిటికి తోడు కడుపులో ఆకలి దహించుకు పోతూంది. సిపాయి ఆ బాధ ఓర్చుకోలేకపోయాడు. ఆ పల్లెటూరు చిట్టచివర ఒక యిల్లు వుంది. ఆ ఇంటి దగ్గరకు వెళ్లి ఏదైనా తినటానికి పెట్టమని, ఆ ఇల్లాలిని అడిగాడు.

‘‘మేమే తిన తిండిలేకుండా తిప్పలు పడుతుంటే నీకేమి పెట్టగలం బాబూ!’’ అన్నది ఆ ఇల్లాలు. కొంత దూరం పోయాక, మళ్లీ ఇంకో ఇంటికి వెళ్లి, ‘‘నాకు చాలా ఆకలిగా వుంది, కాస్త ఏదైనా పెట్టండమ్మా’’ అని అడిగాడు. ఆ ఇంటామె కూడా ‘‘మాకే ఏమీ లేదు నాయనా, పోయిరా’’ అంది.

వెంటనే సిపాయి, ‘‘పోనిలేండమ్మా, మీ వద్ద ఒక పెద్ద కుండ ఏదైనా ఉందా?’’అని అడిగాడు. ఇల్లాలు పెద్దకుండ తెచ్చి సిపాయి ముందు పెట్టింది. ‘‘మంచినీళ్లు ఉన్నయ్యా?’’ అన్నాడు. ‘‘నీళ్లకేమీ తక్కువ లేదు, బోలెడన్ని ఉన్నయి,’’ అంది ఆ ఇల్లాలు. ‘‘అయితే ఆ కుండ నిండా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టండి. నా దగ్గర ఒక అద్భుతమైన ‘‘పులుసురాయి’’ ఉంది అన్నాడు. ‘‘పులుసురాయి అంటే ఏమిటి నాయనా? మే మెప్పుడూ దాన్ని గురించి వినలేదే’’ అన్నారు ఆ యింట్లో వాళ్లు.

‘‘ఈ పులుసురాయి వేసి కాస్తే పులుసు అమృతంలాగ బలే రుచిగా తయారవుతుంది’’ అన్నాడు సిపాయి. ఆ చిత్రమైన పులుసురాయి చూడటానికి చుట్టుప్రక్కల వాళ్లందరూ సిపాయి చుట్టూ మూగారు.ఇంటి యజమానురాలు ఆ పెద్ద కుండ నిండా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టింది. సిపాయి తన జేబులోంచి ఒక రాయి(చూట్టానికి మామూలు గులకరాయిలాగే ఉంది) తీసి కుండలో పడేశాడు. ఇంక కుండలో నీళ్లు బాగా కాగనివ్వండి’’ అని చెప్పాడు సిపాయి. అందరూ ఆ కుండ చుట్టూ కూచున్నారు. నీళ్లు బాగా మరిగేంతవరకూ చూస్తూ కూచున్నాడు. ‘‘మీకు వీలుంటే కాస్త చింతపండు, ఉప్పు అందులో వెయ్యండి’’ అన్నాడు సిపాయి. చింతపండు బుట్ట, ఉప్పుతొట్టి తెచ్చి సిపాయి కిచ్చారు. కుండ పెద్దది కాబట్టి పట్టెడు చింతపండు, పిడికెడు ఉప్పు తీసుకొని ఆ కాగుతున్న నీటిలో వేశాడు. అందరూ సిపాయి ఇంకా ఏమిచేస్తాడో చూద్దామని చుట్టూ చేరారు. ‘‘కాసిని క్యారట్లు దానిలో వేస్తే బాగుంటుందేమో’’ అన్నాడు సిపాయి. ఆ ఇల్లాలు బల్లకింద దాచిన క్యారట్లు తెచ్చి తరిగి పులుసులో వేసింది. ఈ క్యారట్లు ఆ బల్ల కింద ఉండటం అంతకుముందే సిపాయి చూశాడు. క్యారట్లు బాగా ఉడికే లోపల తన చుట్టూ చేరిన వారికి ఎంతో తమాషాగా తాను యుద్ధంలో చేసిన వీర, సాహస కార్యాలను గురించిన కథలు చెప్పటం మొదలెట్టాడు.

కొన్ని బంగాళదుంపలు కూడా వేస్తే, పులుసు ఇంకా చిక్కబడి బాగుంటుందని ఆ మాటల మధ్యలో సిపాయి మళ్లీ సలహా యిచ్చాడు. ఆ ఇంటివారి పెద్ద కూతురు, ‘‘కాసిని దుంపలు ఇంటిలో ఉన్నాయిలే’’ అంటూ అవి తెచ్చి పులుసులో వేసింది. పులుసు బాగా మరిగేదాకా అందరూ ఊరుకున్నారు.

‘‘ఇంకేమీలేదుగాని, నాలుగు ఉల్లిపాయలు కూడా అందులో పడేశామంటే మంచి కమ్మని వాసన వస్తుంది’’ అన్నాడు సిపాయి. ఇంటికాపు ఇది వినగానే చిన్న కొడుకుతో పక్కయింట్లోంచి కాసిని ఉల్లిపాయలు అడిగి తెమ్మన్నాడు. వాడు చెంగున పరిగెత్తుకు వెళ్లి దోసెడు ఉల్లిపాయలు పట్టుకొచ్చాడు. అవి కూడా పులుసులో పడేశారు. పులుసు తయారయ్యేలోగా అందరూ కథలు, కబుర్లు చెప్పుకుంటూ కూచున్నారు.

నేను మా అమ్మనూ, ఇంటినీ వదిలి వచ్చింది మొదలు ఇంతవరకు మళ్లీ క్యాబేజీ ముఖం చూడలేదు’’ అని సిపాయి చెప్పేసరికి, ఆ ఇల్లాలు ‘‘త్వరగా వెళ్లి తోటలో క్యాబేజీ పువ్వొకటి కోసుకురావే?’’ అని చిన్న పిల్లను పంపించింది. అది కూడా తరిగి పులుసులో పడేశారు.

‘‘ఇంకా కాసేపటిలో పులుసు తయారవుతుంది లేండి. బాగా పక్వానికొచ్చింది’’ అని సిపాయి అనగానే ఇల్లాలు పొడుగాటి తెడ్డుతో పులుసు బాగా కలియబెట్టింది. సమయానికి సరీగ్గా ఆ ఇంటి పెద్దకొడుకు వేటకు వెళ్లి అప్పుడే రెండు కుందేళ్లను పట్టుకొచ్చాడు. ‘‘ఇదిగో చూడండి, పులుసు ఇంకా పసందుగా ఉండాలంటే, ఆ కుందేళ్లను కోసివేస్తే ఇంకా బాగా రుచి వస్తుందిలాగుందే’’ అన్నాడు సిపాయి. వెంటనే వాటిని కూడా కోసి పడేశారు. ‘‘ఆహా! ఘుమ ఘుమలాడుతూ ఎంత కమ్మని వాసన వస్తూందో చూశారా! నోరూరుతూందే’’ అన్నాడు సిపాయి.

‘‘అబ్బాయి! ఈ బాటసారి ఇవాళ ఒక పులుసురాయి తెచ్చాడు. దాంతో ఈ కుండలో మంచి పులుసు కాచాడు’’ అని కాపు తన పెద్దకొడుకుతో చెప్పాడు. చివరకి పులుసు కమ్మగా తయారైంది. పెద్దకుండతో చెయ్యబట్టి అందరికీ సరిపోయేంత వుంది కూడాను. సిపాయి, కాపు, కాపువాని భార్య, పెద్దపిల్ల, పెద్దకొడుకు, చిన్నపిల్ల, చిన్న కుర్రవాడు అందరూ కూచుని లొట్టలు వేసుకుంటూ తాగుతున్నారు పులుసు.

‘‘సెభాష్‌! ఇది నిజంగా చాలా అద్భుతమైన పులుసు’’ అని కాపు సంతోషించాడు.‘‘ఆ పులుసురాయి చాలా అద్భుతమైనది. అదే పులుసుకి అంత రుచి తెచ్చింది,’’ అన్నది కాపు భార్య.‘‘ఔను. ఆ పులుసురాయి చాలా గొప్పది. ఇవ్వాల నేను చేసినట్టు పులుసు కాస్తే, ఈ పులుసురాయి పులుసును అమితరుచిగా తయారుచేయటానికి ఎన్నాళ్లయినా పనికివస్తుంది’’ అని సిపాయి చెప్పాడు. అందరూ కలిసి సంతృప్తిగా పులుసు తాగారు.

సిపాయి సెలవు తీసుకొని పోవటానికి ముందు, ఇంటి యజమానురాలు చూపిన ఆదరణకి మెచ్చుకొని, ఆ పులుసురాయి ఆ ఇల్లాలికి ఇచ్చాడు. ఆమె వద్దని చెప్పినా వినలేదు. ‘‘మరేమీ పరవాలేదమ్మా, తీసుకోండి. అదేమి పెద్ద ఘనమైన వస్తువుకాదు లేండి’’ అని సిపాయి పులుసురాయి పోయిందనే చింతావంతా లేకుండా మళ్లీ తన దారిని తాను పోయాడు. మరో గ్రామం చేరేముందు దారిలో సిపాయి మళ్లీ ఇంకొక గులకరాయి ఏరుకుని జేబులో వేసుకున్నాడు.

 నవంబర్‌ 14 బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల కోసం ఈ ‘పులుసు రాయి’ జానపద కథ ప్రత్యేకం. సౌజన్యం: 1958లో దక్షిణ భాషా పుస్తక సంస్థ సహకారంతో అద్దేపల్లి అండ్‌ కో. ప్రచురించిన వేటగాడి కొడుకు: ఇతర విదేశీ కథలు. బాపు బొమ్మలతో వచ్చిన ఈ సంకలనాన్ని కనకదుర్గా రామచంద్రన్‌ అనువదించారు. దీనికి మూలం హెరాల్డ్‌ కూర్లెండర్‌ సంకలనం చేసిన ‘రైడ్‌ విత్‌ ద సన్‌’. అమెరికా రచయిత, ఆంత్రో పాలజిస్ట్‌ కూర్లెండర్‌ (1908–96) ప్రపంచ వ్యాప్తంగా భిన్న దేశాల్లోని వందల కొలదీ జానపద కథల్ని సంకలనాలుగా వెలువరించాడు. పులుసు రాయి,
బెల్జియంకు చెందింది. పేదరికం, లౌక్యం, కుటుంబ జీవనాలను ఇది వినోదాత్మకంగా చిత్రిస్తుంది. ఇందులో వచ్చే క్యారట్లు అనే మాటకు అనువాదకురాలు ఎర్ర ముల్లంగి అని వివరణ ఇచ్చారు. అరవై ఏళ్ల కింద తెలుగు జనానికి క్యారట్లు అంతగా తెలిసివుండవు. కూర్లెండర్‌ రచనల్లో ‘ది ఆఫ్రికన్‌’ నవల పేరొందింది. దీన్నుంచే రూట్స్‌ (ఏడు తరాలు) నవలను కాపీ చేశాడని అలెక్స్‌ హేలీ మీద వచ్చిన ఆరోపణలు జగత్ప్రసిద్ధం. ఆ వివాదం కోర్టు బయట పరిష్కారం అయింది. 

మరిన్ని వార్తలు