లఘు చిత్రాలుగా మహిళా సమస్యలు

19 Aug, 2014 22:08 IST|Sakshi

దృశ్య ఆకృతి
 
మన రక్షణ మన చేతుల్లోనే ఉంది. దేశంలోని ప్రతి పాఠశాలలోనూ ఆడపిల్లలకు ఆత్మరక్షణ విధానాలను కనుక నేర్పిస్తే, మగవాళ్లలో జంకు బయల్దేరుతుంది. అప్పుడీ అత్యాచార ఘటనలు తగ్గుతాయి’’ అంటున్న అకృతి...
 
ఆకృతి నాగ్‌పాల్! నటి, మోడల్. ఇటీవలి బాలీవుడ్ చిత్రం ‘హాలీడే’లో చిన్న పాత్ర. అయితే ఈ పరిచయం అప్పుడే పాతపడిపోయింది. ఆమె ఇప్పుడు ‘డైలీ రేప్’ అనే లఘు చిత్రాన్ని తీసిన నిర్మాత, దర్శకురాలు! ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ గుజరాతీ అమ్మాయి తన కెరీర్‌ను బాలీవుడ్ చిత్రాలకే పరిమితం చేసుకోవాలనుకోవడం లేదు. లఘుచిత్ర దర్శకురాలిగా మహిళా సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అనుకుంటున్నారు. ‘డైలీ రేప్’ చిత్రంలో ప్రధానంగా ఆమె దాంపత్య జీవితంలోని లైంగిక హింసను చూపించారు. భర్త తన భార్యను అనుక్షణం మాటలతో, చేతలతో ఎలా వేధించేదీ దాపరికం లేకుండా చిత్రీకరించారు. అలాంటివే మరికొన్ని తియ్యాలని ఆకృతి ఉద్దేశం.
 
‘‘వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట స్త్రీలపై, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. స్త్రీని మగాడు ఒక ఆటవస్తువుగా చూస్తున్న ధోరణి నానాటికీ ఎక్కువవుతోందే కానీ, తగ్గుముఖం పట్టడం లేదు. ఈ ధోరణిని సున్నితంగా ఎత్తిచూపి సమాజంలో ఆలోచన రేకెత్తించాలన్నదే నా ధ్యేయం’’ అంటున్నారు ఆకృతి. అదే సమయంలో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి స్త్రీ సాధికారత ఎంత కీలకమైనదో ఆమె చెప్పదలచుకున్నారు.

నిర్ణయాలు తీసుకోవడంలో, బాధ్యతలను మోయడంలో స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వెయ్యడం వల్లనే సమాజాభివృద్ధి మందగమనంలో సాగుతోందని ఆకృతి బలంగా నమ్ముతున్నారు. మహిళలు పురుషులకంటే ఏవిధంగానూ, ఎందులోనూ తక్కువ కాదని నిరూపించిన బాలీవుడ్ చిత్రాలు.. మదర్ ఇండియా, మిర్చి మసాలా, దామిని, బాండిట్ క్వీన్, లజ్జ, కహానీల నుంచి స్ఫూర్తి పొందిన ఆకృతి అలాంటి చిత్రాలు విరివిగా రావలసిన అవసరం ఉందని అంటున్నారు.
 
నటి, రచయిత్రి, సామాజిక కార్యకర్త అయిన ఆకృతి కొంతకాలంగా ‘ఇండియా ఫర్ ఉమెన్’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచే స్తున్నారు. ఆకృతికి కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది! ‘‘మన రక్షణ మన చేతుల్లోనే ఉంది. దేశంలోని ప్రతి పాఠశాలలోనూ ఆడపిల్లలకు ఆత్మరక్షణ విధానాలను కనుక నేర్పిస్తే, మగవాళ్లలో జంకు బయల్దేరుతుంది. అప్పుడీ అత్యాచార ఘటనలు తగ్గుతాయి’’ అంటున్న ఆకృతి.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు విఠల్‌దాస్ పాంఛోటియా మనవరాలు. విఠల్‌దాస్ కొన్ని మూకీ చిత్రాలను కూడా తీశారు. తాతగారి అడుగుజాడల్లో నడుస్తున్న ఆకృతి లఘుచిత్రాల అనంతరం కొంత అనుభవం వచ్చాక మహిళా సమస్యలపై ఒక పెద్ద చిత్రాన్నే తీస్తానంటున్నారు. ఆశయం గొప్పది కనుక ఆమె ప్రయత్నం తప్పక ఫలించి తీరుతుంది.
 

మరిన్ని వార్తలు