మా అబ్బాయిని క్షమాపణ అడగాలనుంది...

3 Sep, 2014 08:33 IST|Sakshi
మా అబ్బాయిని క్షమాపణ అడగాలనుంది...

కోపం చెడ్డదని ఎందుకంటారో తెలుసుకోవాలంటే నా జీవితమే ఉదాహరణ. ఆవేశంలో నేను చేసిన పని వల్ల నేనిప్పుడు చాలా బాధపడుతున్నాను.
 
ఆ రోజు నా కళ్లముందు నుంచి ఎప్పుడూ తొలగిపోదు. మా అబ్బాయి రవీంద్రకు ఓ సంబంధం చూశాం. నేను, మావారు వాళ్లతో మాట్లాడి  వచ్చాం. మంచి రోజు చూసుకుని రవిని తీసుకుని వస్తామని చెప్పాం. కానీ ఆ రాత్రి మేం విషయం చెప్పీ చెప్పగానే నో అనేశాడు రవి. దానికి కారణం సునీత. తను మావాడి కొలీగ్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మావాడు తనకి మాట కూడా ఇచ్చేశాడు. ఆ విషయం చెప్పగానే మావారు సెలైంట్‌గా అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయారు.
 
నేను మాత్రం వాడి మీద ఇంతెత్తున లేచాను. ‘పెళ్లి చేసేసుకోలేదు కదమ్మా, ప్రేమించానంతే, మీకు చెప్పకుండా చేసేసుకుంటానా ఏంటి’ అన్నాడు. ఆ అమ్మాయి వివరాలు చెప్పాడు. అవి విన్నాక మరీ మండుకొచ్చింది నాకు.  అందుకే పెళ్లికి ఒప్పుకునే ప్రసక్తి లేదని తెగేసి చెప్పాను. దాంతో వాడు ఏకంగా మాతో బంధమే తెంచుకుని వెళ్లిపోయాడు. సునీతను పెళ్లి చేసుకుని, ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రుల్ని కూడా చూసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. మావారు అది భరించలేక మంచం పట్టారు. ఆయన్ని దక్కించుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కొడుకు దూరమైపోయాడు. భర్త వదిలి వెళ్లిపోయాడు. దిక్కులేని పక్షిలా మిగిలాను.
 
కొన్నాళ్లకు ఆయన వస్తువులన్నీ సర్దుతుంటే ఓ డైరీ దొరికింది. అందులో ‘‘శారదా... చాలా పెద్ద తప్పు చేశావ్. కొడుకునైనా వదిలేసుకున్నావ్ కానీ ఓ పేదింటి పిల్లని కోడలిగా ఒప్పుకోలేకపోయావ్. మా అమ్మ కూడా నీలానే అనుకుని ఉంటే మన పెళ్లి జరిగేదా? ఆ మాట అని నిన్ను బాధ పెట్టలేను. అలా అని నువ్వు చేసిన పనిని క్షమించనూ లేను.’’
 
ఆయన అన్నది నిజం. ఒకప్పుడు నేనున్న స్థాయిని మర్చిపోయాను. సునీత పేదరికాన్ని ఎత్తి చూపించి నా కొడుకు మనసును గాయపర్చాను. తప్పు చేశాను. చాలా పెద్ద తప్పు చేశాను. వెళ్లి నా కొడుకును క్షమాపణ అడగాలనుంది. నా కోడలిని గుండెలకు హత్తుకోవాలని ఉంది. మీరు ఇది చదివేనాటికి ఆ పని తప్పక చేస్తాను. నా తప్పిదానికి పరిహారం చేసుకుంటాను!
- వి.శారద, నల్లజర్ల

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా