అరచేతి సిందూరం

3 Jun, 2020 04:59 IST|Sakshi

రక్తం ఆడపిల్లల్ని భయపెట్టదు. రక్తంతో సహజీవనం వాళ్లది!! మగపిల్లలే.. రక్తమంటే కళ్లు మూసుకుంటారు. పడి, దెబ్బలు తగిలినప్పుడే.. ఈ ధీశాలురు రక్తాన్ని చూడటం. ఇక పీరియడ్‌ బ్లడ్‌ అయితే.. అదొక ‘స్త్రీ గ్రూప్‌’ బ్లడ్‌ వీళ్లకు. ‘‘ఛుక్‌ చుక్‌ రైలు వస్తోంది.. దూరం దూరం జరగండి..’’ మెన్‌ కూడా బాయ్‌సే ఈ స్టేషన్‌లో! ఎలా వీళ్లతో కలిసి ప్రయాణించడం? ‘అరచేతి సిందూరం’తో గోప్యాల చీకట్లను పోగొట్టడమే.

తెలియనివాళ్లకు తెలియజెప్పడం దేనికి? మొదట వచ్చే ప్రశ్న! నిజమే కదా.. పూర్తిగా వ్యక్తిగత విషయం అయినప్పుడు.. ‘నేను పీరియడ్స్‌లో ఉన్నాను’ అని అరిచేతిలో ఎర్రచుక్క పెట్టుకోవడం దేనికి.. గుసగుసల్ని రేపడానికి కాకపోతే?! అయితే గుసగుసలు లేకుండా చెయ్యడానికే ‘యూనిసెఫ్‌’.. రెడ్‌ డాట్‌ ఛాలెంజ్‌ని ‘మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ డే’ కి సరిగ్గా రెండు నెలల ముందు ఈ ఏడాది మార్చినెలలో మొదలుపెట్టింది. రెడ్‌ డాట్‌ చాలెంజ్‌ అంటే నెలసరి రోజుల్లో అరిచేతిలో ఎర్ర చుక్కపెట్టుకోవడం. మహిళలంతా దీన్నొక నియమంగా పాటిస్తే కొన్నాళ్లకు, లేదా కొన్నేళ్లకు అదొక మామూలు సంగతైపోయి, మెన్సెస్‌ చుట్టూ పురుషులలో, మగపిల్లల్లో, కొందరు మహిళల్లో కూడా ఉండే అపరిశుభ్రమనే భావనలు తొలగిపోతాయని! యూనిసెఫ్‌ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ని మొదట నేహా దుపియా, దియా మీర్జా స్వీకరించారు. తర్వాత డయానా పెంటీ, ఖుబ్రా సయాత్, మానుషీ చిల్లర్, అనితా ష్రాఫ్, అతిదీరావ్‌ హైద్రీ ఫాలో అయ్యారు. సెలబ్రిటీలు కాకుండా యూత్‌లో చాలామంది అమ్మాయిలు ఈ చాలెంజ్‌ని తీసుకుంటున్నారు. కొందరు ఆ చాలెంజ్‌ని నేరుగా తీసుకోనప్పటికీ తమ ‘తొలిసరి’ అనుభవాలను, ఇబ్బందులను షేర్‌ చేసుకుంటున్నారు. పెద్ద సెక్సెస్‌.. ఈ రెడ్‌ డాట్‌ చాలెంజ్‌! మే 28 న  మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ డే రోజు సోషల్‌ మీడియాలోని అన్ని వేదికల మీదా అరచేతి సిందూరాలు గోరింటలా పూచాయి.

మూడు రోజుల క్రితం శ్రద్ధా శ్రీనాథ్‌ తన రెడ్‌ డాట్‌ డే గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నారు. శ్రద్ధ ఫెమినిస్టు. మగవాళ్లలో స్త్రీల సమస్యల పట్ల సహానుభూతిని (సానుభూతి కాదు) కలిగించే అనేక విషయాలను సోషల్‌ మీడియాలో ఆమె వివరంగా మాట్లాడుతుంటారు. శ్రద్ధ కశ్మీరీ అమ్మాయి. సినీ నటి. నాలుగు దక్షిణాది భాషా చిత్రాలలో నటించారు. తెలుగులో జెర్సీ, జోడీ íసినిమాల్లో ఉన్నారు. తను నటిస్తున్న మరో ఆరు సినిమాలు లాక్‌డౌన్‌ సడలింపులతో మళ్లీ షూటింగ్‌కి రెడీ అవుతున్నాయి. ఇన్ని సినిమాల్లో నటిస్తున్నా.. ఫెమినిస్టుగానే శ్రద్ధకు సోషల్‌ మీడియాలోనే గుర్తింపు. అసలు తనను తన ఫస్ట్‌ పీరియడే ఫెమినిస్టుగా మార్చిందని అంటారు శ్రద్ధ. ‘‘అప్పుడు నాకు 14 ఏళ్లు. ఇంట్లో పూజ జరుగుతోంది. పూజలో నేను కూడా కూర్చొని ఉన్నాను. అప్పుడు నా ఫస్ట్‌ పీరియడ్‌ వచ్చింది. పక్కన అమ్మ లేదు. శానిటరీ ప్యాడ్స్‌ లేవు. పూజలో ఉన్న పిన్నిని మోచేత్తో పొడిచి విషయం చెప్పాను. చెబుతున్నప్పుడు పిన్ని పక్కనే ఉన్న బంధువులావిడ విని, నా వైపు చూసి నవ్వింది. ‘పర్వాలేదు చిన్నా, దేవుడు క్షమిస్తాడు’ అని అభయం ఇచ్చింది! ఆమె ఉద్దేశం.. పూజలో ఉన్నప్పుడు పీరియడ్స్‌ వచ్చినందుకు దేవుడు కోపగించుకోడని, క్షమిస్తాడని. అప్పుడే నేను ఫెమినిస్టుగా మారాను. నాన్‌–బిలీవర్‌గా కూడా’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు శ్రద్ధ. 

ఇంట్లో చేసి పెడుతుంటే.. బాగున్నాయి అనో, బాగోలేదనో అనడం మాత్రమే మనకు తెలిసింది. ఆ చేసిపెట్టేవాళ్లకు ఒంట్లో ఎలా ఉందోనన్న ఆలోచన మరో స్త్రీకి మాత్రమే వస్తుంది. ఆఫీస్‌లలో, ఇంకా కలిసి పని చేసే అనేక చోట్ల కూడా అంతే. ఏ రోజైనా పని సరిగా చేయలేక పోతుంటేనో, అసలే చెయ్యలేక పోతుంటేనో అంతవరకే కనిపిస్తుంది. అందుకు కారణం పైకి తెలిసేది కాదు, చెప్పుకునేదీ కాదు. అయితే ఈ గోప్యనీయత వల్ల ప్రయోజనం ఉండదు అంటుంది యూనిసెఫ్‌. ‘నేను పీరియడ్స్‌ లో ఉన్నాను’ అని సంకేత పరచకపోవడంవల్లే కావచ్చు.. మహిళల పని సామర్థ్యంపై అపోహలు, పీరియడ్స్‌ చుట్టూ ఇన్ని అస్పృశ్య ఆలోచనలు! వీటిని పోగొట్టడానికి రెడ్‌ డాట్‌ ఛాలెంజ్‌లు, శ్రద్ధ వంటì æవారి సొంత అనుభవాల పోస్టింగ్‌లు తప్పకుండా తోడ్పడతాయి.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా